చిలకలూరిపేట టౌన్: పట్టణంలోని హ్యాపీ హోమ్స్ సమీపంలోని పొలాల్లో ఒక గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభించడం స్థానికంగా కలకలం రేపింది. శుక్రవారం పొలాల్లో మృతదేహాన్ని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. చిలకలూరిపేట పోలీసులు వచ్చి విచారణ చేపట్టారు. మృతుడి వయస్సు సుమారు 50 సంవత్సరాలు ఉండవచ్చని, కొంతకాలంగా ఈ ప్రాంతంలో యాచిస్తూ జీవనం సాగిస్తున్నట్లు స్థానికులు గుర్తించారని పోలీసులు వెల్లడించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చిలకలూరిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో భద్రపరిచినట్లు సీఐ పి. రమేష్ తెలిపారు.
నరసరావుపేట టౌన్: మండల న్యాయ సేవాధికార సంస్థలో పారా లీగల్ వలంటీర్లగా వ్యవహరించటానికి అర్హులైన అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవాలని 13వ అదనపు జిల్లా ఇన్‌చార్జి న్యాయమూర్తి ఆర్. శరత్‌బాబు శుక్రవారం తెలిపారు. సామాన్య ప్రజలకు, న్యాయసేవల సంస్థలకు మధ్య అంతరాన్ని పూడ్చేందుకు మధ్యవర్తులుగా వ్యవహరించే వారధిగా వలంటీర్లు ఉంటారన్నారు. న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో చట్టాలు, న్యాయ వ్యవస్థపై శిక్షణ పొంది అవగాహన కల్పిస్తారన్నారు. ఎటువంటి ఆదాయం ఆశించకుండా సేవా దృక్పథంతో పనిచేసేవారు ముందుకు రావాలన్నారు. విశ్రాంత ఉపాధ్యాయులు, సీనియర్ సిటిజెన్‌లు, అంగన్‌వాడీ కార్యకర్తలు, న్యాయ విద్యార్థులు దరఖాస్తుకు అర్హులన్నారు. ఈ నెల 10వ తేదీ లోపు స్థానిక మండల న్యాయసేవాధికార సంస్థ కార్యాలయంలో దరఖాస్తు అందజేయాలన్నారు.
ఏఎన్‌యూ(పెదకాకాని): ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో 2025 అక్టోబరు, నవంబరు నెలలో జరిగిన బీఏ, బీబీఏ, ఎల్‌ఎల్‌బీ, ఎంబీఏ మూడో సెమిస్టర్ పరీక్ష ఫలితాలను వర్సిటీ పరీక్షల నియత్రణ అధికారి ఆలపాటి శివప్రసాదరావు శుక్రవారం విడుదల చేశారు. ఎంబీఏ(హాస్పటల్ మేనేజ్‌మెంట్) మూడో సెమిస్టర్‌కు 28 మంది హాజరు కాగా 23 మంది, ఎంబీఏ(ఇంటర్నేషనల్ బిజినెస్) మూడో సెమిస్టర్‌కు 52 మంది హాజరు కాగా 50 మంది ఉత్తీర్ణులయ్యారు. బీఏ, బీబీఏ, ఎల్‌ఎల్‌బీ రెండో సెమిస్టర్‌కు 56 మంది హాజరు కాగా వారిలో 51 మంది, బీఎ, బీబీఏ, ఎల్‌ఎల్‌బీ నాల్గవ సెమిస్టర్‌కు 47 మంది హాజరు కాగా వారిలో 44 మంది ఉత్తీర్ణులయ్యారన్నారు. రీవాల్యుయేషన్‌కు ఈనెల 16 చివరి తేదీ కాగా రీవాల్యుయేషన్ దరఖాస్తులను 17వ తేదీలోగా పీజీ కో ఆర్డినేటర్ కార్యాలయంలో అందజేయాలన్నారు. ఒక్కొక్క సబ్జెక్ట్‌కు రీవాల్యుయేషన్ ఫీజు రూ.1860 కాగా పర్సనల్ వెరిఫికేషన్‌కు రూ.2190 చెల్లించాలన్నారు. పూర్తి వివరాలకు అధికారిక వెబ్‌సైట్‌ను చూడాలని ఆలపాటి సూచించారు.
తెనాలి రూరల్: గంజాయి కలిగి ఉన్న కేసులో నిందితుడికి జైలు శిక్ష , జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్ కథనం మేరకు ... ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో స్పెషల్ డ్రైవ్‌లో భాగంగా 2022 ఏప్రిల్ 24న అప్పటి సెబ్ ఇన్‌స్పెక్టర్ ఎ. వెంకటాచలం మండలంలోని సోమసుందరపాలెం ఆటోనగర్ వద్ద తనిఖీలు నిర్వహించారు. ఓ టింబర్ డిపో వద్ద పుల్లల వ్యాపారం చేసే కురగంటి ప్రసాద్ వద్ద 120 గ్రాముల గంజాయి లభించింది. గంజాయిని స్వాధీనం చేసుకుని నిందితుడిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచారు. కేసు శుక్రవారం విచారణకు రావడంతో సాక్ష్యాధారాలను పరిశీలించిన తెనాలి ప్రధాన జూనియర్ సివిల్ జడ్జి ఎ. పవన్‌కుమార్... నిందితుడికి మూడు నెలల జైలు శిక్ష, రూ. ఐదు వేల జరిమానా విధించారు. ప్రాసిక్యూషన్ తరఫున సీనియర్ ఏపీపీ పరిశపోగు సునీల్‌కుమార్ వాదించారు.
గుంటూరు రూరల్: బ్రెయిన్ స్ట్రోక్‌తో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని మృతి చెందిన సంఘటన నల్లపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో వెంగళాయపాలెం గ్రామంలో శుక్రవారం చోటు చేసుకుంది. సీఐ వంశీధర్ తెలిపిన వివరాల ప్రకారం... వెంగళాయపాలెం గ్రామానికి చెందిన మన్నవ మనీష (30) చైన్నెలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా పనిచేస్తోంది. గత కొంత కాలంగా వర్క్ ఫ్రం హోం తీసుకుని ఇంటి వద్ద నుంచే విధులు నిర్వహిస్తోంది. ఈ క్రమంలో శుక్రవారం ఇంటి వద్ద విధులు నిర్వహిస్తుండగా తలనొప్పిగా ఉండటంతో కొంతసేపు నిద్రించింది.
ఎంత సేపటికీ లేవకపోవటంతో తల్లిదండ్రులు చూడగా.. అపస్మారక స్థితిలో ఉన్నట్లు గుర్తించారు. మనీషాను చికిత్స నిమిత్తం జీజీహెచ్‌కు తరలించారు. ఆసుపత్రిలో పరీక్షించిన వైద్యులు బ్రెయిన్ స్ట్రోక్‌తో మరణించిందని తెలిపారు. సంఘటనపై మృతురాలి తండ్రి పోలయ్య ఫిర్యాదు మేరకు అనుమానస్పద కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.


