అమ్మవారికి రూ.3లక్షల విరాళం | - | Sakshi
Sakshi News home page

అమ్మవారికి రూ.3లక్షల విరాళం

Mar 10 2026 12:44 PM | Updated on Mar 10 2026 12:44 PM

పెనుగంచిప్రోలు: అమ్మవారికి ఆభరణాలు చేయించేందుకు మధ్యవర్తి ద్వారా ఇచ్చిన విరాళం ఎట్టకేలకు ఆలయానికి చేరింది. ఆయా వివరాలను దాతలు మన్నం వెంకటేశ్వర్లు, అంజమ్మ దంపతులుసోమవారం విలేకరులకు వివరించారు. వివరాల్లోకి వెళితే పల్నాడు జిల్లా వినుకొండకు చెందిన మన్నం వెంకటేశ్వర్లు, అంజమ్మ దంపతులు పెనుగంచిప్రోలు గ్రామంలో వేంచేసియున్న తిరుపతమ్మవారికి వెండి ఆభరణాలు చేయించేందుకు మొక్కుకున్నారు. ఏడాదిన్నర కిందట రూ.3లక్షలతో మూడు కేజీల వెండితో అమ్మవారికి ఐదు వస్తువులు తయారుచేయించేందుకు హైదరాబాద్‌కు చెందిన తయారీదారులతో అంచనా వేయించారు.

ఈక్రమంలో శ్రీతిరుపతమ్మ ఆలయంలో సత్యనారాయణ అనే ఉద్యోగి ద్వారా అవే వస్తువులు తయారుచేయించేందుకు దాతలు, తెనాలికి చెందిన ఆభరణాల తయారీదారుడు కృష్ణారెడ్డికి రూ.3లక్షలు అందజేశారు. అయితే ఏడాదిన్నరగా ఆయా వస్తువులను అప్పగించలేదు. ఈ విషయంపై తయారీదారుడు కృష్ణారెడ్డిని తొమ్మిదినెలల కిందట దాతలు నిలదీయడంతో ఐదు వెండి వస్తువులకుగాను ఓ కిరీటం అందజేశాడు. ఆ కిరీటాన్ని అమ్మవారికి అలంకరిస్తే సరిపోకపోవడంతో తిరిగి అతనికే ఇచ్చారు. అప్పట్నుంచి ఆయా వస్తువులను తయారుచేసి ఇవ్వకుండా తయారీదారుడు తమను తిప్పుకుంటున్నారంటూ దాతలు మన్నం వెంకటేశ్వర్లు, అంజమ్మ దంపతులు సమస్యను నాలుగురోజుల కిందట గ్రామ పెద్దలు, ఆలయ అధికారుల దృష్టికి తెచ్చారు. దీంతో గ్రామపెద్దలు, ఆలయ అధికారులు జోక్యం చేసుకోవడంతో సదరు తయారీదారుడు కృష్ణారెడ్డి రూ.3లక్షలను దాతలకు పంపించారు. ఈ మేరకు ఆ నగదును మన్నం వెంకటేశ్వర్లు, అంజమ్మ దంపతులు సోమవారం ఆలయ ఉత్సవ కమిటీసభ్యులు చుంచు రమేష్‌బాబు సమక్షంలో ఆలయానికి విరాళంగా అందజేశారు. ఆలయంలోని అంకమ్మవారి ఉపాలయం గోపురం వెండి తాపడం పనులకు వినియోగించాలని కోరారు.

ఏడాదిన్నర తర్వాత

ఆలయానికి చేరిన విరాళం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement