వైఎస్సార్ సీపీ మాజీ ఎమ్మెల్యే నంబూరు శంకరరావు
అచ్చంపేట: పెదకూరపాడు నియోజకవర్గంలో 2014 – 19 వరకు టీడీపీ పాలనలోగానీ, గత రెండేళ్ల కూటమి పాలనలోగానీ జరిగిన అభివృద్ధి, సంక్షేమం ఏంటో చెప్పే ధైర్యం ఆ పార్టీ నాయకులకు ఉందా అని మాజీ ఎమ్మెల్యే నంబూరు శంకరావు ప్రశ్నించారు. వైఎస్సార్ సీపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గురువారం అచ్చంపేటకు వచ్చిన శంకరరావు విలేకరులతో మాట్లాడుతూ... 5 సంవత్సరాల వైఎస్సార్ సీపీ పాలనలో తానేం చేశానో నియోజకవర్గంలో ఎవరిని అడిగినా చెబుతారన్నారు. అమరావతి నుంచి బెల్లంకొండ వరకు ట్రిబుల్ రోడ్డుకు అప్పటి సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శంకుస్థాపన చేశారని, 60 శాతం పనులు పూర్తి చేశామన్నారు. టీడీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత ఎందుకు పనులు ఆపారో చెప్పాలన్నారు. మాదిపాడు వద్ద కృష్ణానదిపై రూ.63 కోట్లతో వంతెన మంజూరు చేయించి పనులు ప్రారంభిస్తే దానికి కూడా కొనసాగించడం లేదన్నారు. మాదిపాడు నుంచి తండాలను కలుపుతూ పులిచింతల ప్రాజెక్టు రోడ్డుకు నిధులు మంజూరు చేయిస్తే ఎందుకు పూర్తి చేయలేదని నిలదీశారు. పెదకూరపాడు, అమరావతి, అచ్చంపేట, దొడ్లేరు గ్రామాలలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, క్రోసూరులో పాలిటెక్నిక్ భవనం, గ్రామ గ్రామాన సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, పక్కా స్కూలు భవనాలు, అదనపు తరగతి గదులు, గ్రామ గ్రామానికి అంతర్గత పక్కా రహదారులు తమ హయాంలోనే నిర్మించిన విషయం నిజం కాదా అని ప్రశ్నించారు. సూపర్ సిక్స్, సూపర్ సెవన్ అంటూ ప్రజలను మభ్యపెట్టడం, ఇచ్చిన హామీలను తుంగలో తొక్కడం తప్ప ఏం చేశారని ప్రశ్నించారు. చిత్తశుద్ది ఉంటే మిగిలిపోయిన పనులు పూర్తి చేయాలని మంజూరు చేయించడానికి, బిల్లులు ఇప్పించడానికి తేడా తెలియని టీడీపీ నాయకులు కూడా మాట్లాడటం హ్యస్యాస్పదంగా ఉందన్నారు. ఆయన వెంట నియోజకవర్గ పరిశీలకులు మురళీధరరెడ్డి, నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.


