ఎక్స్‌ప్రెస్‌ రైలు ఢీకొని బాలిక దుర్మరణం | - | Sakshi
Sakshi News home page

ఎక్స్‌ప్రెస్‌ రైలు ఢీకొని బాలిక దుర్మరణం

Mar 6 2026 9:04 AM | Updated on Mar 6 2026 9:04 AM

ఎక్స్‌ప్రెస్‌ రైలు ఢీకొని బాలిక దుర్మరణం ఆర్టీసీ బస్సును ఢీకొన్న లారీ రైలు నుంచి జారిపడి వ్యక్తి మృతి రేషన్‌ బియ్యం పట్టివేత అంతర రాష్ట్ర బైక్‌ దొంగల అరెస్ట్‌

చీరాల రూరల్‌: ౖరెలు ఢీకొనడంతో బాలిక దుర్మరణం చెందిన సంఘటన చినగంజాం రైల్వే స్టేషన్‌ సమీపంలో చోటు చేసుకుంది. జీఆర్పీ ఎస్సై సీహెచ్‌ కొండయ్య తెలిపిన వివరాల మేరకు.. చినగంజాం మున్నంవారిపాలేనికి చెందిన చంద్రశేఖర రెడ్డి కుమార్తె హేమ శివస్మృతి (16)తన నాయనమ్మ ఇంటికి వెళ్లేందుకు రైల్వే స్టేషన్‌ యార్డు సమీపంలో దిగువలైన్‌లో రైలు పట్టాలు దాటుతోంది. ఈ క్రమంలో బాలిక రైలుబండిని గమనించకపోవడంతో ఒంగోలు వైపు నుంచి విజయవాడ వెళ్లే బిలాస్‌పూర్‌ సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ ఢీకొట్టింది. ఈ సంఘటనలో బాలిక అక్కడిక్కడే మృతి చెందింది. పోస్టుమార్టం నిమిత్తం మృత దేహాన్ని చీరాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. బాలిక పుట్టకతోనే మానసిక దివ్యాంగురాలని ఎస్సై చెప్పారు.

స్వల్ప గాయాలతో బయటపడిన ప్రయాణికులు

తాడేపల్లి రూరల్‌: కృష్ణానది కనకదుర్గ వారధిపై ఆర్టీసీ బస్సు ప్రయాణికులకు పెను ప్రమాదం తప్పింది. గురువారం సాయంత్రం విజయవాడ ఆర్టీసీ బస్టాండ్‌ నుంచి మంగళగిరి వెళుతున్న మంగళగిరి డిపో బస్సు 38 మంది ప్రయాణికులతో వస్తోంది. ఈక్రమంలో కనకదుర్గ వారధి మధ్యలో వెనుక నుంచి అతివేగంగా వచ్చిన ఒక లారీ ఢీకొట్టింది. ఈ సంఘటనలో ఆర్టీసీ బస్సు వెనుక అద్దం పగలడంతో పాటు వెనుక సీట్లు స్వల్పంగా దెబ్బతిన్నాయి. అద్దాల ముక్కలు లోపల పడడంతో లారీ ఢీకొన్న సమయంలో ఇద్దరు ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. జరిగిన సంఘటనపై ఆర్టీసీ డ్రైవర్‌ తాడేపల్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.

నరసరావుపేట టౌన్‌: రైల్లో నుంచి జారిపడి గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందిన సంఘటన గురువారం సాతులూరు రైల్వే స్టేషన్‌ సమీపంలో చోటు చేసుకుంది. రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గుంటూరు నుంచి నరసరావుపేటకు వస్తున్న రైలు నుంచి గుర్తుతెలియని వ్యక్తి జారిపడి మృతి చెందాడు. సమాచారం అందుకున్న ఎస్‌ఐ ఎం.రాజామోహన్‌ సంఘటనా స్థలానికి చేరుకొని ప్రమాదం తీరును పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏరియా వైద్యశాలకు తరలించారు. మృతుడి ఆనవాళ్లు తెలిసిన వాళ్లు రైల్వే పోలీస్‌ స్టేషన్‌లో సంప్రదించాలని ఎస్‌ఐ కోరారు.

రైల్వే స్టేషన్‌లో గుండెపోటుతో వృద్ధుడు ..

ఈపూరు మండలం గుండే పల్లి గ్రామానికి చెందిన పాతపోతుల మల్లయ్య(85) గురువారం నరసరావుపేట రైల్వే స్టేషన్‌ బుకింగ్‌ కౌంటర్‌ వద్ద కూర్చొని ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు అక్కడికి వెళ్లి పరిశీలించగా అప్పటికే మృతి చెంది ఉన్నాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏరియా వైద్యశాలకు తరలించారు.

పట్నంబజారు (గుంటూరు ఈస్ట్‌): అక్రమంగా తరలిస్తున్న రేషన్‌ బియ్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. పాతగుంటూరు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆనందపేట పరిసర ప్రాంతాల నుంచి క్రాంతి, హతీబ్‌ అనే వ్యక్తులు రేషన్‌ బియ్యం సేకరించి తరలిస్తుండగా, గురువారం పక్కా సమాచారం అందుకున్న పోలీసులు దాడిచేశారు. ఆటోలో తరలిస్తున్న 35 క్వింటాళ్ల రేషన్‌ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. రేషన్‌ బియ్యం తరలిస్తున్న ఇరువురితోపాటు, డ్రైవర్‌పై కూడా కేసు నమోదు చేసి బియ్యాన్ని, వాహనాన్ని సీజ్‌ చేశారు. ఈమేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

హుజూర్‌నగర్‌ : అంతర్రాష్ట్ర బైక్‌ దొంగలను తెలంగాణ రాష్ట్రం సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. వారి నుంచి ఆరు బైక్‌లు స్వాధీనం చేసుకుని కోర్టుకు పంపగా రిమాండ్‌ విధించారు. సీఐ చరమందరాజు గురువారం తెలిపిన వివరాల ప్రకారం.. హుజూర్‌నగర్‌ పట్టణంలోని కొత్త బస్టాండ్‌ వద్ద ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా సంచరిస్తున్నట్లు సమాచారం అందడంతో ఎస్‌ఐ మోహన్‌బాబు తన సిబ్బందితో వెళ్లి వారిని అదుపులోకి తీసుకున్నారు. వారు ఏపీలోని గుంటూరు జిల్లా మేడికొండూరుకు చెందిన షేక్‌ మాబు, గుంటూరు సిటీకి చెందిన షేక్‌ రిహాజ్‌గా గుర్తించారు. వారిని విచారించగా బైక్‌లు చోరీ చేస్తున్నట్లు ఒప్పుకున్నారు. సూర్యాపేట జిల్లాలోని హుజూర్‌నగర్‌, కోదాడ టౌన్‌తో పాటు గుంటూరులోని నగరపాలెం, పట్టాభిపురం, మంగళగిరి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో మొత్తం ఆరు బైక్‌లు దొంగిలించినట్లు అంగీకరించారు. వాటిని రిహాజ్‌ అమ్మమ్మ ఊరైన సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం కట్టవారిగూడెంలో దాచిపెట్టగా వాటిని స్వాధీనం చేసుకున్నట్లు సీఐ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement