పాలనపై చిత్తశుద్ధి ‘ఖాళీ’ | - | Sakshi
Sakshi News home page

పాలనపై చిత్తశుద్ధి ‘ఖాళీ’

Mar 10 2026 12:44 PM | Updated on Mar 10 2026 12:44 PM

పాలనపై చిత్తశుద్ధి ‘ఖాళీ’ జిల్లాలో ఖాళీగా కీలకమైన అధికారుల పోస్టులు

కమిషనర్‌ నియామకమెప్పుడో?

ఏసీబీకి దొరకడంతో రెండు నెలల కిందట డీఆర్వో సస్పెన్షన్‌ ఆ స్థానంలో కొత్త అధికారిని నియమించని ప్రభుత్వం 8 నెలలుగా నరసరావుపేట సబ్‌డివిజన్‌లో ఇన్‌చార్జి డీఎస్పీ పాలన మూడు నెలలుగా నరసరావుపేట మున్సిపల్‌ కమిషనర్‌ నియామకం వాయిదా తాజాగా 2018 గ్రూప్‌–1 అధికారుల విషయంలో హైకోర్టు తీర్పుతో మరిన్ని పోస్టులు ఖాళీ గురజాల డీఎస్పీ, సత్తెనపల్లి, నరసరావుపేటల ఆర్డీఓలు బదిలీ వాటిని భర్తీ చేయడంలో ప్రభుత్వం మీనమేషాలు అత్యంత సున్నితమైన పల్నాడులో కీలక అధికారులు లేకపోవడంతో ప్రజాసమస్యలు, శాంతిభద్రతలు గాలికి

జిల్లాలో ఖాళీగా కీలకమైన అధికారుల పోస్టులు

సాక్షి, నరసరావుపేట: రాష్ట్రంలోని అత్యంత సమస్యాత్మక జిల్లాగా పేరొందిన పల్నాడు జిల్లాలో పరిపాలన కుంటుపడుతోంది. పోలీసు, రెవెన్యూ శాఖలలో పరిపాలన పరంగా కీలకమైన పోస్టులు నెలల తరబడి ఖాళీగా ఉండడమే అందుకు కారణం. ఇది ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనంగా మారింది. డీఆర్వో, ఆర్డీఓ, డీఎస్పీ వంటి కీలక పదవులు భర్తీ కాకపోవడంతో ఇన్‌చార్జిల పాలన కొనసాగుతోంది. తద్వారా ప్రజలకు అందాల్సిన ప్రభుత్వ సేవలలో తీవ్ర జాప్యం చోటుచేసుకుంటోందన్న విమర్శలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. అధికారుల నియామకం కోసం ప్రజలు ఎదురుచూస్తుంటే.. భర్తీ విషయంలో ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోంది.

కలెక్టరేట్‌లో ముందుకు కదలని ఫైళ్లు...

జిల్లా రెవెన్యూ పరిపాలనలో కీలకమై డీఆర్వో పోస్టు రెండు నెలలుగా ఖాళీగా ఉంది. డీఆర్వోగా పనిచేస్తున్న మురళిని లంచం తీసుకుంటుండగా కలెక్టర్‌ కార్యాలయంలోనే ఏసీబీ అధికారులు రెండు నెలల కిందట పట్టుకున్న విషయం తెలిసిందే. దీంతో ఆయనను ప్రభుత్వం సస్పెండ్‌ చేసింది. అప్పటి నుంచి ఆ స్థానంలో ఎవర్ని నియమించకపోవడంతో పౌరసరఫరాల శాఖ జిల్లా అధికారి నారదమునికి ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించారు. రెవెన్యూ శాఖలో కీలకమైన పోస్టు రెండు నెలలుగా ఖాళీగా ఉన్నా భర్తీ చేయకపోవడంతో ముఖ్యమైన ఫైళ్లు పెండింగ్‌లో ఉంటున్నాయి. పనుల కోసం అర్జీదారులు, కిందస్థాయి రెవెన్యూ అధికారులు కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు.

డివిజన్‌లలోనూ అదే పరిస్థితి..

ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారిధిగా వ్యవహరిస్తూ ప్రభుత్వ సేవలు చేరువ చేయడంలో ఆర్డీఓలది కీలకపాత్ర. నరసరాావుపేట, సత్తెనపల్లి ఆర్డీఓలు హైకోర్టు తీర్పు కారణంగా బదిలీపై వెళ్లడంతో వారి స్థానంలో ఎవర్ని నియమించలేదు. జిల్లా మీదుగా కీలకమైన జాతీయ రహదారులకు భూసేకరణ జరుగుతున్న సమయంలో వీరు లేకపోవడంతో ఆ ప్రభావం పనులపై పడుతోంది. రాజకీయంగా అత్యంత సున్నితమైన పల్నాడులో ఎన్న డూ లేనివిధంగా అధికార సంక్షోభం నెలకొనడం ఆందోళన కలిగిస్తోంది. ఆర్డీఓల పర్యవేక్షణ కొరవడంతో క్షేత్రస్థాయిలో అవినీతి, అక్రమాలు పెరిగిపోతున్నాయి. రెవెన్యూ కార్యాలయాల్లో ప్రతి పనికి ఓ రేటు పెట్టి వ్యవహారాన్ని చక్కదిద్దుతున్నారు.

ఎనిమిది నెలలుగా డీఎస్పీ లేరు..

పల్నాడు జిల్లాలో చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి శాంతిభద్రతలకు విఘాతం కలుగుతూనే ఉంది. గత సాధారణ ఎన్నికల పోలింగ్‌ రోజు నరసరావుపేట నడిబొడ్డున మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఇంటిపై రౌడీ మూకలు దాడులకు తెగబడ్డారు. జిల్లా కేంద్రంలో నిత్యం ఆర్థిక మోసాలు జరుగుతూనే ఉన్నాయి. మరోవైపు వినుకొండ, నరసరావుపేటలో నడిరోడ్లపై హత్యలు, కిడ్నాపులతో శాంతిభద్రతలకు విఘాతం కలుగుతోంది. గురజాల నియోజకవర్గంలో వైఎస్సార్‌సీపీ నేతలపై పాశవికంగా దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఇన్ని జరుగుతున్నా జిల్లాలో కీలకమైన పోలీసు అధికారుల పోస్టులు ఇన్‌చార్జిలతో నడిపిస్తున్నారు. గతేడాది జూలై నెలలో నరసరావుపేట డీఎస్పీగా పనిచేసిన కె.నాగేశ్వరరావు ఉద్యోగ విరమణ చేశారు. ఆయన స్థానంలో ఎవరినీ నియమించకపోవటంతో సత్తెనపల్లి డీఎస్పీ ఎం.హనుమంతరావు ఇన్‌చార్జిగా వ్యవహరిస్తున్నారు. దాదాపు 8 నెలలుగా ఆయన రెండు సబ్‌ డివిజన్లకు డీఎస్పీగా పనిచేస్తున్నారు. జిల్లాలోనే పెద్దదైన నరసరావుపేట సబ్‌ డివిజన్‌ పరిధిలో 13 పోలీసుస్టేషన్లు, ఒక ట్రాఫిక్‌ పోలీస్‌స్టేషన్‌ ఉన్నాయి. ఇక్కడ డీఎస్పీ పోస్టు భర్తీ కాకుండా ఓ పోలీసు ఉన్నతాధికారి ద్వారా ప్రయత్నాలు చేస్తున్నారనే ప్రచారం ఉంది.

హైకోర్టు తీర్పుతో మూడు గ్రూప్‌–1 పోస్టులు ఖాళీ...

పల్నాడు జిల్లాలో ఇప్పటికే అధికారుల కొరత వేధిస్తుండగా అంతలోనే హైకోర్టు తీర్పుతో మరో మూడు ముఖ్యమైన పోస్టులు ఖాళీలు ఏర్పడ్డాయి. 2018 గ్రూప్‌–1 ఉద్యోగాలపై విచారణ జరుగుతున్న నేపథ్యంలో ఆ బ్యాచ్‌కు చెందిన వారిని అ ప్రధాన పోస్టులకు బదిలీ చేయమని హైకోర్టు తీర్పునిచ్చింది. 2018 బ్యాచ్‌కు చెందిన ముగ్గురు అధికారులు జిల్లాలో ఉండగా, వారిలో గురజాల డీఎస్పీ జగదీశ్‌, నరసరావుపేట ఆర్డీఓ మధులత, సత్తెనపల్లి ఆర్డీఓ రమణకాంత్‌రెడ్డిలు జిల్లా నుంచి బదిలీ మీద వెళ్లారు. జిల్లాలో ఉన్న నరసరావుపేట, గురజాల సబ్‌ డివిజన్లలో డీఎస్పీ పోస్టులు ఖాళీగా ఉండడంతో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటి కేసుల్లో సత్వర న్యాయం, విచారణలో జాప్యం చోటుచేసుకుంటోంది.

జిల్లా కేంద్రమైన నరసరావుపేట మున్సిపల్‌ కమిషనర్‌ నియామకంలో తీవ్రజాప్యం జరుగుతోంది. కమిషనర్‌ జస్వంతరావును బదిలీ చేసి మూడు నెలలవుతున్నా ఆయన స్థానంలో ప్రభుత్వం ఎవర్ని నియమించలేదు. ఇన్‌చార్జి కమిషనర్‌గా ఎంఈ రవికుమార్‌ వ్యవహరిస్తున్నారు. ఓ వైపు పాలకవర్గం లేకపోవడంతో స్పెషలాఫీసర్‌గా నరసరావుపేట ఆర్డీఓ వ్యవహరిస్తుండగా, ఆమె ఇటీవల బదిలీ అవ్వడంతో స్పెషలాఫీసర్‌ స్థానం సైతం ఖాళీ ఏర్పడింది. స్పెషల్‌ ఆఫీసర్‌, కమిషనర్‌ పోస్టులు ఖాళీగా ఉండటంతో అక్రమ నిర్మాణాలు పెరిగిపోతున్నాయి. అభివృద్ధి పనులు నత్తనడకన సాగుతున్నాయి. పారిశుద్ధ్యం, నీటి సరఫరా, మౌలిక వసతుల కల్పనలపై నిర్ణయాలు తీసుకునే అధికారులు లేక పట్టణవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement