అర్జీల పరిష్కారంపై
131 అర్జీలు స్వీకరించిన కలెక్టర్, జేసీ
నరసరావుపేట: ప్రజాసమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్)కు వచ్చిన అర్జీలను ప్రత్యేక దృష్టితో పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన పీజీఆర్‌ఎస్‌కు కలెక్టర్ కృతికా శుక్లా, రెవెన్యూ క్లినిక్‌లో జాయింట్ కలెక్టర్ సంజనా సింహ అధ్యక్షత వహించి జిల్లాలోని ఆయా మండలాల నుంచి వివిధ రకాల సమస్యలతో వచ్చిన అర్జీదారుల నుంచి 131 అర్జీలు స్వీకరించారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా అధికారులు అర్జీలను సకాలంలో పరిష్కరించాలని, ఆయా శాఖల పరిధిలో గ్రీవెనన్స్‌పై ఆడిట్ నిర్వహించాలన్నారు. అర్జీదారులతో మాట్లాడాలని, పెండింగ్ ఆడిట్ పూర్తి చేయాలన్నారు. వచ్చిన అర్జీలలో రెవెన్యూ క్లినిక్ ద్వారా 22 అర్జీలు రాగా అందులో నరసరావుపేట మండలం నుంచి 15, గురజాల నుంచి ఐదు, సత్తెనపల్లి నుంచి రెండు అర్జీలు అందుకున్నారు. డీఆర్‌ఓ నారదముని, డీపీఓ నాగేశ్వరనాయక్, డీఆర్‌డీఏ పీడీ ఝాన్సీరాణి పాల్గొన్నారు.


