మత్తు కాదు..అంతకు మించి | - | Sakshi
Sakshi News home page

మత్తు కాదు..అంతకు మించి

Mar 7 2026 8:16 AM | Updated on Mar 7 2026 8:16 AM

గంజాయి, డ్రగ్స్‌కు బానిసవుతున్న యువత

సంపాదన లేక వైట్‌నర్‌, సొల్యూషన్స్‌ వినియోగం

మానసిక వ్యాధులు రావటానికి బీజం

చిన్న వయసులోనే ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్న బాల్యం

అరికట్టడంలో అధికార యంత్రాంగం విఫలం

బిడ్డలను చూసి తల్లడిల్లుతున్న తల్లిదండ్రులు

పెరుగుతున్న కేసులు

గంజాయి, డ్రగ్స్‌కు బానిసవుతున్న యువత

నరసరావుపేట టౌన్‌: బంగరు భవితకు బాటలు వేసే పుస్తకాలు పట్టాల్సిన చేతులు వైటనర్‌ మత్తులో వణుకుతున్నాయి. ఉత్సాహంగా ఉరకలెత్తాల్సిన యువత అర్థంగాని మత్తులో తడబడుతోంది. 20 ఏళ్లు కూడా నిండకుండానే నూరేళ్ల జీవితాలను చీకట్లు కమ్మేస్తున్నాయి. ఎదిగిన కొడుకుని చూసి మురిసిపోవాలనుకున్న తల్లిదండ్రుల కలలపై కన్నీళ్ల ముసురుకుంటున్నాయి. యువతను మత్తులో ముంచేసే వైట్‌నర్‌, సొల్యూషన్ల విక్రయాలపై నిఘా వర్గాలు నిద్ర మత్తులో జోగుతున్నాయి.

పట్టుమని 20 ఏళ్లు కూడా నిండలేదు.. బాగా మాసిన దుస్తులు, చెదిరిన జుట్టు, చేతిలో గుడ్డలో తెల్లని ద్రవ పదార్థం.. రోడ్డుపై నడుస్తుంటే కాళ్లు తడబడుతున్నాయి. కళ్లు మూతలు పడుతున్నాయి. ఏం మాట్లాడుతున్నాడో తెలియదు. పల్నాడు జిల్లా కేంద్రం నరసరావుపేట పట్టణంలో బస్టాండ్‌, రైల్వే స్టేషన్‌ తదితర ప్రాంతాల్లో భవితను ఛిద్రం చేసుకున్న యువత నిత్యం ఇలా కనిపిస్తుంటారు. డ్రగ్స్‌ మహమ్మారికి బానిసై నిండు జీవితాలను సర్వనాశనం చేసుకుంటున్నారు. గంజాయి కంటే ప్రమాదకరమైన వైట్‌నర్‌, సొల్యూషన్స్‌ను పీలుస్తూ ఆరోగ్యానికి ముప్పు తెచ్చుకుంటున్నారు.

ఏమిటీ వైట్‌నర్‌, సొల్యూషన్స్‌ ?

గంజాయి విక్రయాలు విచ్చలవిడిగా పెరిగిపోవడంతో యువత మత్తుకు బానిసగా మారుతోంది. మత్తుకు బానిసైన వారు పనులకు వెళ్లకపోవడంతో డబ్బుకు ఇబ్బందిగా మారుతోంది. దీంతో గంజాయి కంటే ఎక్కువ మత్తు ఇచ్చే వైట్‌నర్‌ (పేపర్‌ పై పెన్నుతో రాసిన అక్షరాలను కనిపించకుండా చేసేది), సైకిల్‌ షాపుల్లో పంచర్లకు వాడే సొల్యూషన్‌న్స్‌ను వినియోగిస్తున్నారు. ఇవి మార్కెట్లో అతి తక్కువ ధరకు దొరకడంతో కొనుగోలు చేస్తున్నారు. ఒక గుడ్డ ముక్కలో కొంచెం వైట్‌నర్‌ వేసుకుని పీల్చితే మత్తుగా ఉంటుంది. వీటి విక్రయాలపై నియంత్రణ లేకపోవటంతో యథేచ్ఛగా కొనుగోలు చేసి వినియోగిస్తున్నారు. నరసరావుపేట పట్టణంలో అనేక మంది యువత ఇలాంటి మత్తులో పడి జీవితాలను చీకటిమయం చేసుకుంటున్నారు.

తక్షణ మత్తు.. ప్రాణాలకు ముప్పు

వైట్‌నర్‌లో రబ్బర్‌, సిమెంట్‌లలో వాడే టోల్యూయిన్‌, హెక్సేన్‌వంటి రసాయనాలు ఉంటాయి. ఇవి పీల్చిన వెంటనే తలతిరగడం, తాత్కాలిక ఉల్లాసం, మాట తడబడటం వంటి ప్రమాదాలు కనిపిస్తాయి. అదే సమయంలో గుండె కొట్టుకోవడంలో మార్పులు, శ్వాస ఆడకపోవడం వంటి తీవ్రమైన ప్రమాదాలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి. ఒక్కోసారి ఇటువంటి రసాయనాలు పీల్చటం వల్ల ప్రాణాపాయానికి దారి తీయవచ్చు. టోల్యూయిన్‌ వంటి వాయు రసాయనాలు గుండైపె తీవ్ర ప్రభావం చూపి మరణాలు సంభవిస్తాయని వైద్య నిపుణులు చెబుతున్నారు.

మెదడు, కాలేయంపై తీవ్ర ప్రభావం..

వైట్‌నర్‌ , సొల్యూషన్‌న్స్‌ తరచూ వినియోగిస్తే మెదడు కణాలు దెబ్బతిని జ్ఞాపకశక్తి తగ్గిపోతుంది. చదువులో వెనకబడతారు. మానసిక అస్థిరత, డిప్రెషన్‌, ఆందోళన సమస్యలు పెరుగుతాయి. కాలేయం, మూత్రపిండాలు కూడా ప్రభావితమవుతాయి. మత్తు పదార్థాలకు అలవాటు పడ్డ వ్యసనపరులు చౌక రసాయనాల వైపు మళ్లి ప్రమాదం కొని తెచ్చుకుంటున్నారు. ఎక్కువగా వినియోగించిన వారు తమ విచక్షణ కోల్పోతారు. ఆ సమయంలో వారి ఏం చేయాలి అనిపిస్తే అదే చేస్తారని వైద్యులు అంటున్నారు.

నియంత్రణ ఎక్కడ ?

తక్కువ ధరలో సులభంగా వైట్‌నర్‌, సొల్యూషన్స్‌ లభిస్తుండటంతో మత్తుకు బానిసైన వారు దీన్ని ఎక్కువగా వినియోగిస్తున్నారు.

చట్టపరంగా కఠిన నియంత్రణ లేకపోవటంతో యువత ఎక్కువగా ఆకర్షితులై మత్తులో విలువైన భవిష్యత్తును అంధకారంలోకి నెట్టుకుంటున్నారు. మానసిక ఒత్తిళ్లు, చెడు స్నేహాల ప్రభావం కారణంగా వాడకం పెరుగుతోంది. దీంతో తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

రెండు నెలల క్రితం పల్నాడు జిల్లాకు డి–అడిక్షన్‌ సెంటర్‌ మంజూరు అయింది. మొదటి జనవరి నెలలో 15 కేసులు నమోదు కాగా, ఫిబ్రవరి నెలలో 28 కేసులు నమోదయ్యాయి. రకరకాల మానసిక జబ్బులు రావటానికి మత్తు పదార్థాలే ముఖ్య కారణం. 10 నుంచి 15 సంవత్సరాల లోపు పిల్లలు ఎక్కువ ప్రభావానికి గురవుతున్నారు. పిల్లల ప్రవర్తనను తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలి. అనుమానం ఉంటే డి–అడిక్షన్‌ సెంటర్‌కు తీసుకురావాలి.

–డాక్టర్‌ అత్తిలి సతీష్‌,

మానసిక వైద్య నిపుణులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement