పథకాలు సద్వినియోగమయ్యేలా చూడాలి
బ్యాంకు అధికారులకు ఎంపీ, కలెక్టర్‌ల సూచన
నరసరావుపేట: మ్యూల్ ఖాతాల ద్వారా జరుగుతున్న ఆన్‌లైన్ మోసాలను అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని బ్యాంకు అధికారులను ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా ఆదేశించారు. బుధవారం బ్యాంకుల ప్రతినిధులతో కలెక్టరేట్‌లో జిల్లా స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. కాలేజీ విద్యార్థుల బ్యాంకు ఖాతాలకు డబ్బులు చెల్లించి మరీ మోసాలకు వాడుతున్న విధానాన్ని నిరోధించేందుకు కళాశాలల్లో అవగాహన కార్యక్రమాలు చేపట్టాలన్నారు. బ్యాంకులు నిర్వహిస్తున్న స్కిల్ డెవలప్‌మెంట్ కార్యక్రమాల ద్వారా శిక్షణ పొందిన వారిలో 80 శాతం మందికి ఉపాధి, వ్యాపార అవకాశాలు దక్కేలా చూడాలన్నారు. సూర్య ఘర్ పథకం కింద సబ్సిడీ రుణాల వితరణ వేగవంతం చేయాలని పేర్కొన్నారు. రికవరీ సమస్యలున్న డ్వాక్రా రుణాల అకౌంట్ల వివరాలు డీఆర్‌డీఏ అందించాలన్నారు. విద్యార్థులకు హాస్టల్ ఫీజులు, ఇతర ఖర్చుల వినియోగానికి విద్యారుణాలు అందించాలన్నారు. దీనిపై కళాశాలల్లో అవగాహన కల్పించాలని సూచించారు. రుణ వితరణ లక్ష్యాలు చేరుకోని బ్యాంకుల నుంచి వివరణ ఇవ్వాల్సి ఉంటుందన్నారు. జూన్, జూలై నాటికి కౌలు రైతులకు సీసీఆర్‌సీ కార్డులు అందించి పంట రుణ వితరణ జరిగేలా చూడాలని జిల్లా వ్యవసాయ అధికారిని ఆదేశించారు. పశు పెంపకందారులకు కేవలం నాలుగు శాతం వడ్డీతో ఒక్కో పశువుపై రూ.50 వేలు నుంచి రూ.లక్ష వరకూ అందించే రుణాలపై అవగాహన కల్పించాలన్నారు. మార్చి మూడో వారంలోగా క్లస్టర్ విధానంలో మండలాలవారీగా ఏర్పాటు చేసిన క్లస్టర్ల అభివృద్ధికి రుణాలు అందించాలని తెలిపారు. డీసీసీబీ చైర్‌పర్సన్ మక్కెన మల్లికార్జునరావు, ఎల్‌డీఎం రామ్‌ప్రసాద్, జిల్లా వ్యవసాయ అధికారి ఐ.జగ్గారావు, డీఆర్‌డీఏ పీడీ ఝాన్సీరాణి తదితరులు పాల్గొన్నారు.
నరసరావుపేట: ప్రభుత్వ పథకాలను లబ్ధిదారులు తమ అభివృద్ధికి వినియోగించుకునేలా చూడాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో బుధవారం నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. డ్వాక్రా రుణాలు వ్యాపారాలకు బదులుగా కుటుంబ అవసరాలకు వినియోగించడం, బాలింతలు, బాలలకు ఇచ్చే పౌష్టికాహారం కుటుంబంలోని అందరూ వినియోగించకుండా చూడాలన్నారు. మండలానికి రూ.90 లక్షల చొప్పున గ్రామాల్లో పన్ను వసూళ్లు చేయాలని డీపీవోను ఆదేశించారు. స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు సిబ్బందితో ప్రభుత్వం నిర్వహిస్తున్న సర్వేలు పూర్తి చేయాలన్నారు. ఇన్‌చార్జి డీఆర్‌ఓ నారదముని, డీఎంహెచ్‌ఓ డాక్టర్ బి.రవి, ఐసీడీఎస్ పీడీ ఎం.ఉమాదేవి, డీపీఓ వి.నాగేశ్వరరావు నాయక్ పాల్గొన్నారు.
భూసేకరణపై సమావేశం
నకరికల్లు–చీరాల వాడరేవుకు (167/ఏ) సంబంధించి జిల్లా పరిధిలో భూ సేకరణ ప్రక్రియపై కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా సమావేశం నిర్వహించారు. రహదారి కోసం భూములు కోల్పోయిన కేసానుపల్లి, జొన్నలగడ్డ, గుంటగార్లపాడు, నరసరావుపేట, రావిపాడు గ్రామాలకు చెందిన రైతులకు ఇచ్చే నష్టపరిహారానికి సంబంధించిన అవార్డును పూర్తి చేసినట్లు అధికారులు వివరించారు. రహదారి పనులను మొదలు పెట్టాలని కలెక్టర్ ఆదేశించారు. జాయింట్ కలెక్టర్ సంజనా సింహ, ఆర్డీవో మురళీకృష్ణ, జాతీయ రహదారుల ఈఈ శ్రీనివాసరావు, తహసీల్దార్ వేణుగోపాల్ హాజరయ్యారు.


