నగరంపాలెం(గుంటూరు వెస్ట్) : అరండల్‌పేటలోని శ్రీ అష్టలక్ష్మీ సమేత లక్ష్మీనారాయణస్వామి దేవస్థానం 31వ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యస్వామి కల్యాణం వైభవంగా నిర్వహించారు. పలు రకాల పుష్పాలు, సుగంధ ద్రవ్యాలు, ప్రత్యేకంగా కనకాంబరాలు, మల్లెలు, తులసి మాలలతో కల్యాణమూర్తులను అలంకరించారు. విరూపాక్ష విద్యారణ్య పీఠాధిపతులు విద్యారణ్యభారతి స్వామి పుష్పాభిషేకం నిర్వహించి, ప్రత్యేక హారతులతో కల్యాణమూర్తులను సేవించారు. భక్తులకు తీర్థ ప్రసాదాలు అందించారు.
అమరావతి: అమరావతిలోని అమరేశ్వరాలయంలో చంద్రగ్రహణానంతరం బుధవారం అమరేశ్వరునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేకువజామున ఆలయశుద్ధి అనంతరం ఆలయ స్థానాచార్యుడు కౌశిక చంద్రశేఖర శర్మ ఆధ్వర్యంలో సంప్రోక్షణ కార్యక్రమంలో భాగంగా విఘ్నేశ్వర పూజ, నవగ్రహ మంటపారాధన, పుణ్యహావాచన నిర్వహించి అనంతరం జలాలతో అమరేశ్వరునికి అభిషేకం చేశారు. బాలచాముండేశ్వరి అమ్మ వారికి, ఉపాలయాలలో అభిషేకం నిర్వహించారు. ఉదయం 8 గంటలకు భక్తులకు దర్శనం కల్పించారు.
అమరావతి: ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన అమరావతిలో వేంచేసియున్న బాలచాముండికా సమేత అమరేశ్వర స్వామి దేవస్థానంలో బుధవారం హుండీల లెక్కింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. మహాశివరాత్రి అనంతరం హుండీల లెక్కింపును దేవదాయశాఖ ప్రత్యేక అధికారి దాసరి చంద్రశేఖర్ సమక్షంలో దేవాలయంలో ఉన్న 10 హుండీలతో పాటు తాత్కాలిక హూండీలను తెరచి భక్తులచే లెక్కింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం ఆలయ కార్యనిర్వహణాధికారి రేఖ మాట్లాడుతూ హుండీల ఆదాయం మొత్తం రూ.41,42,621వచ్చినట్లు తెలిపారు.
మంగళగిరి టౌన్: శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీనరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. బుధవారం ఉదయం శ్రీదేవి భూదేవి సమేత శ్రీవారి చూర్ణోత్సవం, వసంతోత్సవం నిర్వహించారు. కై ంకర్యపరులుగా నిడమర్రుకు చెందిన కొమ్మారెడ్డి బ్రహ్మానందరెడ్డి, ఛాయాదేవి దంపతులు వ్యవహరించారు. బుధవారం రాత్రి స్వామి వారికి ధ్వజారోహణం, కేళిగుర్రంపై విహారం, దొంగల దోపిడీ నిర్వహించారు. ఉదయం జరిగిన స్వామివారి చూర్ణోత్సవం అనంతరం స్వామి వసంతోత్సవం జరుపుకొంటూ పురవీధుల్లో విహరించారు. ఉత్సవాన్ని ఆలయ ఈవో కె. సునీల్‌కుమార్ పర్యవేక్షించారు.


