కండె రాదు.. కనీస ధర దక్కదు | - | Sakshi
Sakshi News home page

కండె రాదు.. కనీస ధర దక్కదు

Mar 5 2026 7:37 AM | Updated on Mar 5 2026 7:37 AM

కండె రాదు.. కనీస ధర దక్కదు

తీవ్రంగా నష్టపోతున్న మొక్కజొన్న రైతులు జిల్లా వ్యాప్తంగా రికార్డుస్థాయిలో 52 వేల ఎకరాల్లో సాగు నాసిరకం విత్తనాల సరఫరాతో భారీగా పడిపోయిన దిగుబడి ఎకరాకు 35 క్వింటాళ్లు రావాల్సిన చోట 10 క్వింటాళ్లు మాత్రమే దిక్కు కొనుగోలు కేంద్రాల ద్వారా మద్దతు ధర రూ.2,400కి కొంటామన్న ప్రభుత్వ హామీ గాలికి... దళారుల సిండికేట్‌తో క్వింటాకు రూ.1,700 కూడా కష్టమే ప్రభుత్వ తీరు, వ్యాపారుల మోసాలతో తీవ్రంగా నష్టపోతున్న రైతన్నలు

భారీగా తగ్గిన దిగుబడి ...

సాక్షి, నరసరావుపేట : మొక్కజొన్న పంటతో గత ఏడాది రైతులకు ఎంతో కొంత మేలు కలగడంతో ఈ ఏడాది పల్నాడు జిల్లా వ్యాప్తంగా భారీ స్థాయిలో సాగు చేశారు. విత్తన సమయంలో విత్తనాలు దొరక్క నానా ఇబ్బందులు పడి అధిక ధరలకు కొందరు రైతులు సాగు చేయగా, మరికొందరు విత్తన కంపెనీలు అందించే సీడ్‌తోనే సాగు చేశారు. చంద్రబాబు ప్రభుత్వం సాగునీటి సరఫరాపై కనీస శ్రద్ధ పెట్టకపోవడంతో మొక్కజొన్న పంట చివరి దశలో నీరు సరిగా అందలేదు. దీంతో నరసరావుపేట మండలం ములకలూరు వద్ద రహదారిపై బై బైఠాయించి తమ గోడును వెళ్లడించారు. ఇన్ని కష్టాలు పడి పండించిన రైతు నకిలీ మొక్కజొన్న విత్తనాలు దెబ్బతో తీవ్రంగా నష్టపోయారు. దిగుబడి తగ్గి ఓ వైపు మరోవైపు కనీస మద్దతు ధర దక్కకపోవడంతో రైతుల వెతలు వర్ణనాతీతం. మిర్చి, పత్తి పంటలకు ప్రత్యామ్నాయంగా మొక్కజొన్న వైపు మళ్లిన రైతులకు ఈ ఏడాది చిక్కులు తప్పడం లేదు.

దోచుచుంటున్న దళారులు...

పల్నాడు జిల్లా వ్యాప్తంగా సుమారు 50 వేల ఎకరాలకు పైగా ఈ ఏడాది మొక్కజొన్న సాగు చేయడంతో ఏ రైతు వద్ద చూసినా మొక్కజొన్న బస్తాలు కనిపిస్తున్నాయి. మరోవైపు ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో దళారులు రైతులను నిలువునా మోసం చేస్తున్నారు. మొక్కజొన్నకు మార్కెట్‌లో డిమాండ్‌ తగ్గిందన్న సాకుతో ధరలను అమాంతరం తగ్గించేశారు. మద్దతు ధర రూ.2,400 ఉండగా రైతుల నుంచి ప్రైవేట్‌ వ్యాపారులు కేవలం రూ.1,700కే కొనుగోలు చేస్తున్నారు. దీంతో ఎకరాకు 10 నుంచి 20 క్వింటాళ్ల దిగుబడి వచ్చిన రైతుకు కనీసం పెట్టుబడి కూడా రాకుండా నష్టపోతున్నారు. ఈ చర్యలతో తాము తీవ్రంగా నష్టపోతున్నామని మొక్కజొన్న రైతులు వాపోతున్నారు. ప్రభుత్వం వెంటనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి మద్దతు ధరకు మొక్కజొన్న కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్‌ చేస్తున్నారు. మరోవైపు విత్తన కంపెనీలు ఒప్పందం చేసుకున్న మొక్కజొన్న రైతులకు క్వింటా మొక్కజొన్నకు రూ.3 వేలకు పైగా దక్కుతోంది. అయితే కొందరు రైతులు డిమాండ్‌కు మించి సాగు చేయడంతో మొత్తం పంటను కొనుగోలు చేయమంటూ రైతులతో కంపెనీల ప్రతినిధులు తేల్చిచెబుతున్నారు. ఎంఎన్‌సీ కంపెనీలు కాకుండా స్థానికంగా కొన్ని కంపెనీ ప్రతినిధులు ఇచ్చిన విత్తనాలు సరిపడా దిగుబడి రాక రైతులు నష్టపోతున్నారు. బొల్లాపల్లి మండలం గుమ్మనంపాడు, మేళవాగు, గరికపాడు, లింగంగుంట్ల తండా గ్రామాలకు చెందిన రైతులు నకిలీ విత్తనాలతో ఇబ్బందిపడి పోలీసుస్టేషన్‌ మెట్లు ఎక్కారు. వారితో సదరు కంపెనీ ప్రతినిధులు మాట్లాడి నష్టపరిహారంపై చర్చించినట్టు సమాచారం. తక్కవ పెట్టుబడి, చీడపీడల బాధ తక్కువగా ఉంటుందని ఇప్పుడిప్పుడే మొక్కజొన్న పంట వైపు వెళుతున్న రైతుల శ్రేయస్సును ప్రభుత్వం పట్టించుకోవాలని రైతు సంఘాల నేతలు డిమాండ్‌ చేస్తున్నారు.

మొక్కజొన్న ఎకరం సాగు చేయడానికి సుమారు రూ.40 వేలు ఖర్చు అవుతోంది. కౌలు రైతుకై తే మరో రూ.10 వేలు అదనం. గతేడాది ఎకరానికి 35 నుంచి 40 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. అయితే ఈ ఏడాది కొందరు రైతులు నకిలీ విత్తనాల బారిన పడటం, ప్రభుత్వం కాలువల ద్వారా నీటి సరఫరా సక్రమంగా చేయకపోవడంతో పంట దిగుబడి భారీగా పడిపోయింది. కొందరు రైతులు ఏకంగా ఎకరానికి 10 క్వింటాళ్ల మొక్కజొన్న మాత్రమే దిగుబడి వచ్చింది. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. మరోవైపు పండిన అరకొర పంటనైనా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర రూ.2,400కు అమ్ముదామంటే అది కుదరడం లేదు. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి రైతుల నుంచి మొక్కజొన్న కొనుగోలు చేసి ఉంటే రైతులకు మద్దతు ధర దక్కేది. చంద్రబాబు ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో రైతులు ప్రైవేట్‌ వ్యాపారులను ఆశ్రయించాల్సి వస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement