ఉపాధికి కొత్త రూపు | - | Sakshi
Sakshi News home page

ఉపాధికి కొత్త రూపు

Mar 5 2026 7:37 AM | Updated on Mar 5 2026 7:37 AM

జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఇక వీబీజీరామ్‌జీ కేంద్రం వాటా 60 శాతం .. రాష్ట్రం 40 శాతం నిధులు ఉపాధి వేతన దారులకు ఎన్‌ఎంఎస్‌ యాప్‌లో హాజరు సర్వర్‌ సమస్యతో యాప్‌లో అప్‌లోడ్‌ కాని వేతనదారుల ఫొటోలు మండుటెండలో గంటల తరబడి వేచి చూస్తున్న వేతనదారులు పల్నాడు జిల్లాలో 5.52 లక్షల మంది వేతనదారులు

పనికి హాజరైతేనే వేతనాలు...

సత్తెనపల్లి: మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరును కేంద్ర ప్రభుత్వం వికసిత్‌ భారత్‌ గ్యారంటీ ఫర్‌ రోజ్‌గార్‌ అండ్‌ అజీవికా మిషన్‌–గ్రామీణ్‌ గా(వీబీజీరీమ్‌జీ) మార్చి కొత్త చట్టం చేసింది. 2026–27 ఆర్థిక సంవత్సరం దేశ వ్యాప్తంగా నూతన ఉపాధి హమీ చట్టం అమల్లోకి వచ్చింది. వేతనదారుల హాజరు నమోదుకు నేషనల్‌ మొబైల్‌ మానిటరింగ్‌ సిస్టం ఎంఎంఎస్‌ యాప్‌ను తీసుకొచ్చారు. ఈ విధానం వచ్చిన తర్వాత పనులకు హాజరవుతున్న వేతనదారులకు ఉదయం, మధ్యాహ్నం వేళల్లో తప్పనిసరిగా ఫొటో మస్టర్‌(ఫేషియల్‌ అటెండెన్‌న్స్‌) వేయాలి. ఈ విధానం వేతనదారులకు, ఫీల్డ్‌ అసిస్టెంట్లకు చుక్కలు చూపిస్తోంది. బుధవారం జిల్లా వ్యాప్తంగా 12,499 మంది కూలీల డిమాండ్‌ ఉండగా 7,604 మంది మాత్రమే మస్టర్లు నమోదయ్యాయి. ఉదయం పనులు ముగిసిన తరువాత మండుటెండలో ఫొటో మస్టర్ల కోసం పడిగాపులు కాయాల్సి వస్తోంది. గత రెండు రోజులుగా ఇదే పరిస్థితి పలు గ్రామాల్లో నెలకొంది. ఎన్‌ఎంఎంఎస్‌ యాప్‌కు సంబంధించిన సర్వర్‌లో సాంకేతిక సమస్యల వల్ల గడిచిన రెండు రోజుల్లో సగం కట్టే తక్కువ మంది వేతన దారులు హాజరు నమోదు అవుతుంది. దీంతో వేతన దారులు తమకు వేతనం వస్తుందో రాదోనని ఆందోళన చెందుతున్నారు.

ఏడాదికి 125 రోజులు పని దినాలు...

ఈ పథకం కింద కూలీలకు ఏడాదికి 125 రోజులు పని దినాలు కేటాయించారు. గతంలో ఏడాదికి 100 పని దినాలు ఉండేవి. రోజువారీగా రూ. 311 వేతనం సైతం అందించనున్నారు. గతంలో పని అడిగితే వచ్చే విధానం ఉండేది. ప్రస్తుతం నూతన చట్టంలో గ్రామపంచాయతీలో కూలీలను బట్టి బడ్జెట్‌ కేటాయించనున్నారు. నిర్ణీత సమయంలో ఉపాధి కల్పించకపోతే 15 రోజుల్లో కూలీలకు నిరుద్యోగ భృతి అందించే విధంగా చట్టంలో మార్పులు చేశారు.

మౌలిక వసతులపై ఫిర్యాదులు...

ఉపాధి పనులు చేస్తున్న ప్రాంతంలో కూలీలకు కనీస మౌలిక వసతులు లేకుంటే నేరుగా టోల్‌ ఫ్రీ నెంబర్‌ ద్వారా ఫిర్యాదు చేసేందుకు అవకాశం కల్పించారు. పనుల వద్ద తాగునీరు, పనిముట్లు, మెడికల్‌ కిట్లు వంద శాతం ఉండే విధంగా చర్యలు చేపట్టనున్నారు. ఇవి లేకుంటే కూలీలు నేరుగా టోల్‌ ఫ్రీ నెంబర్‌కు ఫోన్‌ చేసి ఫిర్యాదు చేయవచ్చు. వ్యవసాయ పనులు ఉండే సీజన్‌లో 60 రోజులపాటు పనులకు విరామం ప్రకటించే విధంగా చట్టాన్ని రూపొందించారు.

వీబీ జీరామ్‌జీ చట్టంలో సమూల మార్పులు చేపట్టారు. నూతన సాంకేతిక విధానంతో కూడిన పర్యవేక్షణ చేయనున్నారు. ఇందుకోసం కూలీల బయోమెట్రిక్‌ జియో ట్యాగింగ్‌, రియల్‌ టైం డ్యాష్‌ బోర్డులతో సాంకేతికతతో కూడిన పర్యవేక్షణ చేయనున్నారు. ఈ సాంకేతిక విధానంలో దొంగ మస్టర్లలకు కాలం చెల్లినట్టే. పనిచేస్తున్న ప్రదేశాన్ని జియో ట్యాకింగ్‌ చేస్తారు. అక్కడికి వెళ్లి కూలీలు బయోమెట్రిక్‌ వేస్తేనే హాజరు నమోదు అవుతుంది. దీంతోపాటు ఫొటో, పని ముగిసిన వెంటనే మరో మారు బయోమెట్రిక్‌ వేయాల్సి ఉంటుంది. ఈ విధానంలో పనులకు వస్తేనే వేతనం అందించే విధంగా మార్పులు చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement