విజయపురి సౌత్: శాంతి, సమాధానం, ప్రేమ, కరుణ, వాత్సల్యాలను భక్తులకు ప్రసాదించాలని నల్గొండ పీఠాధిపతులు మహాఘన డాక్టర్ కరణం ధమన్‌కుమార్ ప్రార్థిచారు. మాచర్ల మండలం విజయపురిసౌత్‌లో శుక్రవారం ప్రారంభమైన సాగర్‌మాత మహోత్సవాలను పురస్కరించుకొని జరిగిన సమష్టి దివ్యబలిపూజ కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. పరిశుద్ధాత్మ అయిన ఏసుక్రీస్తుకు జన్మను ప్రసాదించిన సాగర్‌మాత(మరియమ్మ) ఆశీస్సులు అందరిపైనా ఉంటాయని తెలిపారు. మహోత్సవాల సందర్భంగా ఆలయాలను, జపమాల క్షేత్రాలను విద్యుత్ దీపాలతో అలంకరించారు. ఉదయం సాగర్‌మాత విచారణ గురువులు పామిశెట్టి జోసఫ్ బాలసాగర్, గురుశ్రీ కాకుమాను కిరణ్‌సాగర్, గురుశ్రీ రాజవరపు అనిల్‌కుమార్‌లచే దివ్యబలిపూజ, గురుశ్రీ మధు జపమాల, స్తుతి ఆరాధన, మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం, గురుశ్రీ మధుచే వాక్య పరిచర్య, స్వస్థత ప్రార్థనలు, సాయంత్రం మహా ఘన డాక్టర్ కరణం ధమన్‌కుమార్‌చే జపమాల, నవదిన జపములు, దివ్యబలిపూజ, రాత్రి కొవ్వొత్తులతో తేరు ప్రదక్షిణ, సాగర్‌మాత కళాకారుల బృందంచే యేసేపు చరిత్ర బుర్రకథ, ఽభక్త యోబు బైబిల్ నాటక ప్రదర్శన నిర్వహించారు.
భారీగా తరలివచ్చిన భక్తులు
శుక్రవారం వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో విజయపురిసౌత్ కళకళలాడింది. స్థానిక లాంచీస్టేషన్ సెంటర్ నుంచి సాగర్‌మాత దేవాలయం వరకు రోడ్డుకు ఇరువైపులా తినుబండారాల విక్రయ కేంద్రాలు, ఫ్యాన్సీషాపులు, వివిధ రకాలైన ఆటబొమ్మల దుకాణాలు వెలిశాయి. సాగర్‌మాత ప్రాంగణంలో చిన్నారుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన జెయింట్ వీల్, రంగులరాట్నాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.


