విద్యార్థీ... విజయీభవ | - | Sakshi
Sakshi News home page

విద్యార్థీ... విజయీభవ

Mar 16 2026 7:48 AM | Updated on Mar 16 2026 7:48 AM

నేటి నుంచి పదవ తరగతి పరీక్షలు జిల్లా వ్యాప్తంగా 128 కేంద్రాలు ఏర్పాటు చేసిన అధికారులు ఏడు సమస్యాత్మక కేంద్రాల్లో సీసీ కెమెరాలతో నిఘా పర్యవేక్షణకు ఏడు ఫ్లయింగ్‌ స్క్వాడ్‌లు సమస్యల పరిష్కారానికి హెల్ప్‌లైన్‌

పకడ్బందీగా...

ఏపీ ఓపెన్‌ స్కూల్‌ సొసైటీ (ఎస్‌ఎస్‌సీ) షెడ్యూల్‌ ఇలా...

ఏడాదంతా నేర్చుకున్న జ్ఞానాన్నంతా పేపర్‌పై పెట్టే సమయం ఆసన్నమైంది.. మదిలో నిక్షిప్తమై ఉన్న అక్షర గనిని వెలికి తీసే ఘడియ రానే వచ్చింది. కంగారు పడకుండా ఆత్మవిశ్వాసంతో అడుగేయాల్సిన శుభ తరుణమిదే. బంగారు భవితకు బాటలు వేసుకునే అద్భుత క్షణమిదే. ఈరోజు నీ కలం నుంచి జాలువారే ‘అక్షరాలే’.. నుదుటి రాతను మారుస్తాయని గుర్తుంచుకోవాల్సిన తరుణమిదే. పదవ తరగతి పరీక్షలు రాయబోయే ఓ విద్యార్థీ.. విజయీభవ!

సత్తెనపల్లి: జిల్లా వ్యాప్తంగా నేటి నుంచి ప్రారంభం కానున్న పదో తరగతి పరీక్షలకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. కేంద్రాల్లో తాగునీరు, విద్యుత్‌, ఫర్నిచర్‌తో పాటు అన్ని ఏర్పాట్లు చేశారు. కేంద్రాల్లోకి 8:45 గంటలకే విద్యార్థులను అనుమతిస్తామని అధికారులు వెల్లడించారు. దూర ప్రాంతాల నుంచి ఆర్టీసీ బస్సుల్లో వచ్చేవారు హాల్‌ టికెట్‌ చూపి ఉచితంగా ప్రయాణించవచ్చని ఆర్టీసీ జిల్లా అధికారి అజిత్‌కుమారి తెలిపారు. కేంద్రాల్లో సమస్యలు ఉంటే చెప్పడానికి ఈ నెల 16 నుంచి మే 1వ తేదీ వరకు పల్నాడు జిల్లా డీఈవో కార్యాలయంలో కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేశారు. 99636 38232, 93948 84558 ఫోన్‌ నంబర్లకు కాల్‌ చేయొచ్చని వెల్లడించారు. పరీక్షలు ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు కొనసాగనున్నాయి. ఈ ఏడాది కూడా అన్ని కేంద్రాల్లో సెల్‌ఫోన్‌లను నిషేధించారు. చీఫ్‌ సూపరిండెంట్‌, డిపార్ట్‌మెంట్‌ ఆఫీసర్‌, సిబ్బంది వద్ద కూడా సెల్‌ఫోన్‌ ఉండకూడదని ఉన్నతాధికారులు ఆదేశించారు. విధులకు హాజరయ్యే సిబ్బంది కచ్చితంగా గుర్తింపు కార్డు ధరించాలని పేర్కొన్నారు.

జిల్లా వ్యాప్తంగా 26,515 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారు. మొత్తం 128 కేంద్రాలను ఏర్పాటు చేశారు. 7 కేంద్రాలను సమస్యాత్మకంగా గుర్తించారు. ఇక్కడ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. జిల్లా వ్యాప్తంగా 30 స్టోరేజ్‌ పాయింట్లలో రెండు సెట్ల ప్రశ్నపత్రాలను భద్రపరిచారు. పోలీస్‌ బందోబస్తు మధ్య ఏ రోజుకారోజు ప్రశ్నపత్రాలను సమీపంలోని పరీక్ష కేంద్రాలకు తీసుకెళ్లనున్నారు. జిల్లా విద్యాశాాఖ అధికారి పీవీజే రామారావు ఆధ్వర్యంలో పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల– విప్పర్లరెడ్డిపాలెం, ఎస్‌బీఆర్‌ మున్సిపల్‌ హై స్కూల్‌ – బరంపేట, నరసరావుపేట; జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల– క్రోసూరు, జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల– కొమెరపూడి, జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల – బండ్లమోటు, గవర్నమెంట్‌ హైస్కూల్‌ –విజయపురిసౌత్‌, వైఆర్‌ఎస్‌ హైస్కూల్‌ –రెంటచింతల పరీక్ష కేంద్రాలను సమస్యాత్మకమైనవిగా ప్రకటించారు. ఆయా కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ అమల్లో ఉంటుంది. సమీపంలోని జిరాక్స్‌ సెంటర్లు, ఇంటర్నెట్‌ సెంటర్లు మూసేయాలని అధికారులు ఆదేశించారు. అలాగే కేంద్రంలోకి స్మార్ట్‌ వాచీలు, క్యాలిక్యులేటర్లు, సెల్‌ఫోన్‌లను నిషేధించారు. జిల్లా వ్యాప్తంగా 1,350 మంది ఇన్విజిలేటర్లను, 128 మంది చీఫ్‌ సూపరిండెంట్లు, 128 మంది డిపార్ట్‌మెంట్‌ అధికారులను నియమించారు. మాస్‌ కాపీయింగ్‌కు పాల్పడకుండా ఆరు ఫ్లయింగ్‌ స్క్వాడ్‌లను ఏర్పాటు చేశారు.

ఏపీ ఓపెన్‌ స్కూల్‌ సొసైటీ (ఎస్‌ఎస్‌సీ) పరీక్షలు ఈ నెల 16 నుంచి 28వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు జిల్లా కోఆర్డినేటర్‌ బొనిగల హైమారావు తెలిపారు. ఈ పరీక్షల కోసం 12 కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొత్తం 1,136 మంది పరీక్షలకు హాజరుకానున్నారు. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్షలు ఉంటాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement