సత్తెనపల్లి: కృష్ణా జిల్లా గన్నవరంలో ఈ నెల 8వ తేదీన నిర్వహించిన 3వ రాష్ట్రస్థాయి మినీ బాల, బాలికల రగ్బీ పోటీలలో పల్నాడు జిల్లా బాల,బాలికల జట్లు తృతీయ స్థానం సాధించాయని పల్నాడు జిల్లా రగ్బీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి టి.డానియేల్ తెలిపారు. గెలుపొందిన క్రీడాకారులను పల్నాడు జిల్లా రగ్బీ అసోసియేషన్ అధ్యక్షుడు ఇ.కృష్ణారెడ్డి, వైస్ ప్రెసిడెంట్ సుబ్బారావు, జాయింట్ సెక్రటరీ శ్రీనివాస రెడ్డి, ట్రెజరర్ యం.ప్రకాష్‌లు మంగళవారం ప్రత్యేకంగా అభినందించారు. ఈ జట్టుకి కోచ్‌గా యం.బాలాజీ వ్యవహరించారన్నారు.
నాగార్జుననగర్‌లో వివాహిత బలవన్మరణం
సత్తెనపల్లి: వివాహిత బలవన్మరణానికి పాల్పడిన సంఘటన పట్టణంలోని నాగార్జుననగర్‌లో మంగళవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. పట్టణంలోని నాగార్జుననగర్‌కు చెందిన జెల్లి ఆదిలక్ష్మి (28) ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకుని బలవన్మ రణానికి పాల్పడింది. మృతురాలికి భర్త నాగరాజు, కుమారుడు, కుమార్తె ఉన్నారు. 10 ఏళ్ల క్రితం వివాహం కాగా కొద్ది రోజుల క్రితం ఇంటి నుంచి వెళ్లిన ఆదిలక్ష్మీ తిరిగి వచ్చింది. అప్పటి నుంచి మానసిక ఒత్తిడికి గురౌతూ బలవన్మరణానికి పాల్పడింది. తన మరణానికి ఎవరు కారకులు కాదని, భర్త, అత్త,మామలు మంచి వాళ్ళు అంటూ ఆమె లేఖ రాసింది. బలవన్మరణానికి గల కారణం ఏమిటనేది రాయలేదు. సంఘటనా స్థలాన్ని పట్టణ ఎస్‌ఐ పి. పవన్‌కుమార్ క్షుణ్ణంగా పరిశీలించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సత్తెనపల్లి ఏరియా వైద్యశాలకు తరలించారు. మృతురాలి తల్లి కిలారి తిరుపతమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
గుంటూరు బ్రాంచి కెనాల్‌లో గుర్తుతెలియని మృతదేహం
నకరికల్లు: గుర్తుతెలియని వ్యక్తి మృతదేహాన్ని మండలంలోని కండ్లకుంట సమీపంలోని గుంటూరు బ్రాంచి కెనాల్‌లో గుర్తించినట్లు ఎస్‌ఐ కె.సతీష్ మంగళవారం తెలిపారు. గుర్తించిన వ్యక్తికి సుమారు 35 సంవత్సరాల వయస్సు ఉంటుందన్నారు. లేత ఆకుపచ్చ రంగు నిక్కరు, సిమెంట్‌రంగు టీషర్టు ధరించి ఉన్నట్లు తెలిపారు. కేసీపీ పవర్‌ప్లాంటు–4 వద్ద మృతదేహం లభ్యమైందన్నారు. మృతదేహానికి పంచనామా నిర్వహించి నరసరావుపేట ఏరియా వైద్యశాలలోని మార్చురీకి తరలించామన్నారు. ఆచూకీ తెలిసినవారు 9440796246, 9966460427 నంబర్లకు సమాచారం ఇవ్వాలని కోరారు.


