బరితెగిస్తున్న | - | Sakshi
Sakshi News home page

బరితెగిస్తున్న

Mar 11 2026 7:52 AM | Updated on Mar 11 2026 7:52 AM

అడ్డొస్తే అంతుచూస్తాం...

మధ్యవర్తిత్వం నడుపుతున్న

అధికారపార్టీ

నేతలు..

గ్రానైట్‌ లారీలను తెలంగాణ తరలించే క్రమంలో మరో సీటీఓ(కమర్షియల్‌ టాక్స్‌ ఆఫీసర్‌)పై దాచేపల్లి మండలం పొందుగల వద్ద మాఫియా సభ్యులు బెదిరింపులకు దిగినట్టు సమాచారం. తమ లారీలను అడ్డుకునే ప్రయత్నం చేయొద్దని, చేస్తే అంతుచూస్తామని, దిక్కున్నవారికి చెప్పుకోమంటూ బెదిరించారట. దీనిపై సదరు అధికారి దాచేపల్లి పోలీసులకు ఫిర్యాదు చేయగా పల్నాడు జిల్లా ఎస్పీ అనుమతి తీసుకొని కేసు నమోదు చేస్తామని చెప్పి పంపారట. దీంతో ఆ అధికారులు ఇద్దరు చేసేదేమిలేక తమ ఉన్నతాధికారుల వద్ద గోడు వెళ్లబోసుకున్నారట. ప్రభుత్వ అధికారుల విధులకు అడ్డొచ్చి, బెదిరిస్తున్నా పోలీసులు కనీసం ఫిర్యాదు కూడా తీసుకోకపోతే ఎలా అనే విమర్శలొస్తున్నాయి.

సాక్షి, నరసరావుపేట: అధికార మదంతో రెచ్చిపోతున్న ‘పచ్చ’ మాఫియా సహజ వనరులను కొల్లగొట్టి కోట్ల రూపాయలు సొమ్ము చేసుకుంటున్నారు. గ్రానైట్‌, ఇసుక, మట్టి, రేషన్‌ బియ్యం అక్రమ రవాణాతో ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయాన్ని తమ్ముళ్ల జేబుల్లోకి తోస్తున్నారు. అడ్డుకుంటున్న అధికారులను బెదిరించి, భయపెట్టి దౌర్జన్యంగా అక్రమ రవాణా సాగిస్తున్నారు. సోమవారం, మంగళవారం పల్నాడు జిల్లా మీదుగా వెళ్తున్న అక్రమ గ్రానైట్‌ లారీలను ఆపి పత్రాలను పరిశీలించే ప్రయత్నం చేసిన కమర్షియల్‌ టాక్స్‌ అధికారులపై గ్రానైట్‌ మాఫియా దౌర్జాన్యానికి దిగింది.

● సోమవారం రాత్రి మాచవరం పోలీసుస్టేషన్‌ పరిధిలోని పిల్లుట్ల రోడ్డులో ఆపి ఉన్న రెండు గ్రానైట్‌ లారీలను ఓ మహిళా అధికారి పరిశీలించి పత్రాలను చూపమని అడిగారు. దీంతో ఆమైపె మాఫియా సభ్యులు దౌర్జన్యానికి దిగారు. పత్రాలు చూపాలని ఆడిగినందుకు తాము గురజాల ఎమ్మెల్యే యరపతినేని అనుచరులమని బెదిరింపులుకు దిగారట. మహిళా అధికారి కారుకు గ్రానైట్‌ మాఫియా కారు అడ్డుగా పెట్టి లారీలను అక్కడి నుంచి దౌర్జన్యంగా తరలించారు. దీనిపై సదరు అధికారి మాచవరం పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు కేసు నమోదు చేయలేదు. మంగళవారం ఆ అధికారి మాచవరం పోలీసుస్టేషన్‌ ముందే పడిగాపులు కాసినా కేసు నమోదు చేయకుండా అధికార పార్టీ నేతలతో చర్చించి వారి అక్రమ రవాణాకు సహకరించాలని పోలీసులు సలహా ఇచ్చారట. దీంతో చేసేదేమి లేక మాచవరం నుంచి ఆ మహిళా అఽధికారి వెళ్లిపోయారు. ‘సాక్షి’ విలేకరి ఆమెను ప్రశ్నించగా మళ్లీ మాచవరం పోలీసుస్టేషన్‌కు వస్తానని, అప్పుడు సమాధానం చెబుతానంటూ అక్కడి నుంచి వెళ్లిపోయారు.

చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి పల్నాడు జిల్లా మీదుగా మార్టూరు నుంచి నిత్యం పదుల సంఖ్యలో అక్రమ గ్రానైట్‌ లారీలు జిల్లా సరిహద్దులు దాటి తెలంగాణ రాష్ట్రంలోకి ప్రవేశిస్తున్నాయి. అక్రమ గ్రానైట్‌ లారీలు ప్రయాణించే దారిలో ఉన్న ప్రజాప్రతినిధులకు నెలవారీ ముడుపులు సైతం భారీ మొత్తంలో ముట్టజెబుతున్నట్టు సమాచారం. ఇందులో కొందరు ప్రభుత్వ అధికారులకు సైతం మూమూళ్ల అందుతున్నాయి. అయితే ఈ వాటాల పంచాయితీలో వచ్చిన తేడాలతో తామే గ్రానైట్‌ అక్రమ రవాణా చేస్తామని గురజాలకు చెందిన అధికారపార్టీ నాయకులు అక్రమ రవాణా చేతిలోకి తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో లారీలను అడ్డుకుంటున్న అధికారులపై గురజాలకు చెందిన అక్రమ రవాణా బ్యాచ్‌ దౌర్జన్యాలకు దిగి బెదిరిస్తున్నట్టు సమాచారం. వారి ఆగడాలు శృతిమించి పోలీసుస్టేషన్‌కు చేరడంతో అధికారులతో స్థానిక టీడీపీ నేతలు మధ్యవర్తిత్వం నడుపుతున్నారు. చూసీచూడనట్టు పోతూ అక్రమరవాణాకు సహకరించాలని సూచిస్తున్నారు. ఈ వ్యవహారంపై పోలీసులు, ప్రభుత్వం ఏ విధంగా చర్యలు తీసుకుంటుందో వేచి చూడాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement