పసిబిడ్డలు అనాథలై..
చిలకలూరిపేట టౌన్: పదేళ్ల కిందట మూడు ముళ్ళతో మొదలైన ఆ సంసార నావ, అనుమానం అనే సుడిగుండంలో చిక్కుకుని చివరకు ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. ముగ్గురు పసిబిడ్డలకు అమ్మ ప్రేమను దూరం చేస్తూ, వివాహిత బలవన్మరణం చెందిన తీరు స్థానికులను కలచివేస్తోంది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. చిలకలూరిపేట మండలం కట్టబడివారిపాలెంలో క్వారీ పనులు చేసుకునే మక్కె వీరాంజనేయులుకు పట్టణంలోని పురుషోత్తమపట్నంకు చెందిన యువతి తిరుమలతో పదేళ్ల కిందట వివాహమైంది. మొదట సంతోషంగానే ఉన్న దంపతుల మధ్య గత కొంతకాలంగా కలహాలు మొదలయ్యాయి. భార్య ప్రవర్తనపై అనుమానం పెంచుకున్న భర్త, నిత్యం వేధింపులకు గురిచేయడంతో ఆమె మనస్తాపానికి గురైంది. కన్నబిడ్డల భవిష్యత్ కంటే, పడుతున్న అవమానమే పెద్దదిగా భావించి, గత నెల 28వ తేదీ సాయంత్రం శీతల పానీయంలో ఎలుకల మందు కలుపుకొని తాగింది. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే గుంటూరు పెద్దాసుపత్రికి తరలించినప్పటికీ, వారం రోజుల పాటు మృత్యువుతో పోరాడి గురువారం మృతి చెందింది. ఈ ఘటనతో అటు పుట్టినిల్లు, ఇటు మెట్టినిల్లు విషాదంలో మునిగిపోయాయి. మృతురాలికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. అమ్మ ఒడిలో సేదతీరాల్సిన ఆ పసిపాపలు, ఇప్పుడు దిక్కులేని వారయ్యారు. తన కుమార్తె మరణానికి భర్త వేధింపులే కారణమని మృతురాలి తల్లి తాటికొండ శివపార్వతి కన్నీరుమున్నీరుగా విలపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ జి.అనిల్‌కుమార్ తెలిపారు.


