నిలిచిన వాణిజ్య సిలిండర్ల సరఫరా హాస్టల్ విద్యార్థులకు ఒక కూరతో సరి ఎలక్ట్రిక్ స్టౌలపై ఆధారపడుతున్న టీ స్టాల్ నిర్వాహకులు హోటళ్లలోనూ వంటల రకాలు కుదింపు గ్యాస్ సంక్షోభం కొనసాగితే వ్యాపార సంస్థల మూసివేతే
నరసరావుపేట టౌన్: వాణిజ్య ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్‌ల కొరత పట్టణంలోని పలు వ్యాపార సంస్థలను తీవ్ర సంక్షోభంలోకి నెట్టింది. హోటళ్లు, టీస్టాల్స్, ప్రైవేటు హాస్టళ్ల నిర్వాహకులు గత కొన్ని రోజులుగా వంట గ్యాస్ లేక తలలు పట్టుకుంటున్నారు. సరిపడ నిల్వలు ఉన్నాయి, గ్యాస్ సరఫరాలో ఎలాంటి ఇబ్బంది లేదని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెబుతున్నప్పటికీ వాస్తవ పరిస్థితి మాత్రం పూర్తి భిన్నంగా ఉంది. వాణిజ్య గ్యాస్ సిలిండర్‌లు సరఫరా నిలిచిపోవటంతో రెస్టారెంట్‌లలో మెనూలను కుదించారు. రెస్టారెంట్, ఫాస్ట్‌ఫుడ్ సెంటర్‌లలో వండే చైనీస్ వంటకాలు పూర్తిగా గ్యాస్ పొయ్యిలపైనే ఆధారపడి ఉంటాయి. కమర్షియల్ గ్యాస్ సిలీండర్‌లు అందుబాటులో లేకపోవటంతో ఇప్పటికే కొన్ని ఫాస్ట్‌ఫుడ్ సెంటర్‌లు మూతబడ్డాయి. బ్లాక్‌లో అధిక ధరకు సిలిండర్‌లు కొనుగోలు చేస్తుండటంతో కొన్ని రెస్టారెంట్‌లలో ఆహార ధరలను పెంచారు. టీస్టాళ్లలో గ్యాస్ లేక ఎలక్ట్రిక్ స్టౌలను ప్రత్యామ్నాయంగా వినియోగిస్తున్నారు. అయితే గ్యాస్ కన్నా విద్యుత్ ఖర్చే అధికం అవుతుందని, దీంతో నష్టాలు చవిచూస్తున్నామని నిర్వాహకులు వాపోతున్నారు. మరో వైపు హోటళ్ల నిర్వాహకులు కట్టెలు, బొగ్గు పొయ్యిలను వినియోగిస్తున్నారు. వాటికి డిమాండ్ పెరగటంతో ధరలు అమాంతం పెరిగాయి. వ్యాపారులకు ఇది అదనపు భారంగా మారింది. చిన్న వ్యాపారాల బతుకుబండిని నడిపించటంలో గ్యాస్ కీలకం. హోటళ్లు, టీస్టాల్స్, బేకరీ, ఫాస్ట్‌ఫుడ్ సెంటర్స్ వంటివి పూర్తిగా గ్యాస్‌పై ఆధారపడి ఉంటాయి. గ్యాస్ సరఫరా నిలిచిపోవడం యజమానులతోపాటు అక్కడ పనిచేసే కార్మిక కుటుంబాలను ఆందోళన కలిగిస్తోంది.
హాస్టళ్లలో మెనూ కుదింపు..
వంట గ్యాస్ కొరత ప్రభావం ప్రైవేట్ హాస్టళ్లలో ఉండే వారిపై పడింది. విద్యా కేంద్రంగా విరజిల్లుతున్న నరసరావుపేట పట్టణంలో పదుల సంఖ్యలో ప్రైవేటు హాస్టళ్లు కొనసాగుతున్నాయి. అక్కడ వేలాది మంది విద్యార్థులు ఉంటూ ఉన్నతవిద్యను అభ్యసిస్తున్నారు. హాస్టళ్లలో ఉదయం టిఫిన్‌కు బదులు రాగిజావ, మధ్యాహ్నం, సాయంత్రం భోజనంలో ఒక కూర, పెరుగు మాత్రమే అందిస్తున్నారు. వారం క్రితం మూడు కూరలు, ఒక ఫ్రై వడ్డించారు. విద్యార్థులు కడుపునిండా తినలేక ఇబ్బందులు పడుతున్నారు.
8 నుంచి సరఫరా బంద్..
వాణిజ్య గ్యాస్ సిలిండర్‌ల సరఫరాను ఈ నెల 8వ తేదీ నుంచి డీలర్‌లు నిలిపివేశారు. చంద్రబాబు ప్రభుత్వం మాత్రం గ్యాస్ సరఫరాలో సమస్య లేదని చెప్పుకొస్తుంది. వాస్తవానికి అనేక హోటళ్లు, వ్యాపార సంస్థలు మూసివేసి ఉండటం బహిరంగంగానే కనిపిస్తోంది. కొందరు ఏజెన్సీ నిర్వాహకులు సిలిండర్‌లను బ్లాక్ మార్కెట్‌లో అధిక ధరలకు విక్రయిస్తున్నారు. ప్రస్తుతం గృహవినియోగదారులకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తూ వాణిజ్య గ్యాస్ సరఫరాను పూర్తిగా నిలిపివేశారు. పరిస్థితి ఇలానే కొనసాగితే గ్యాస్ సంక్షోభం చిన్న వ్యాపారుల ఆర్థిక స్థితిని మరింత దెబ్బతీస్తుంది.


