రేపల్లె: మైనేనివారిపాలెం గ్రామం కృష్ణానది ఒడ్డున గురు నిలయం ఆవరణంలోని శ్రీ గాయత్రీ సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో శ్రీనివాస వైభవోత్సవాలు శనివారం మూడవ రోజు కనుల పండువగా జరిగాయి. లక్ష్మీ, పద్మావతి సమేత వేంకటేశ్వర స్వామివారికి సుప్రభాత సేవ, ప్రాతఃకాలార్చన నిర్వహించారు. స్వామివారికి, దేవేరులకు మంగళస్నానాలు ఆచరించి వధువరులుగా అలంకరించి వేదపండితుల మంత్రోచ్ఛరణ నడము శాంతి కల్యాణం నిర్వహించారు. వేడుకల్లో భాగంగా వేంకటేశ్వరస్వామి విగ్రహానికి ప్రత్యేక అలంకరణ చేశారు. ట్రస్ట్ నిర్వాహకుడు కళ్యాణ్ చక్రవర్తి స్వామివారి కల్యాణ ఘట్టాలను వివరించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కల్యాణాన్ని కన్నులారా తిలకించారు. నిర్వాహకులు భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు.
బాపట్ల: బాపట్ల ఆర్టీసీ పాత బస్టాండ్‌లో ఉన్న లక్ష్మీ పద్మావతి సమేత వెంకటేశ్వరస్వామి వారి 55వ ప్రతిష్ట మహోత్సవంలో భాగంగా శనివా రం ఉదయం స్వామి వారికి శాంతి కల్యాణం నిర్వహించారు. మాజీ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి శాంతి కల్యాణ మహోత్సవంలో పాల్గొన్నారు. సాయంత్రం స్వామివారికి పుష్పయాగం అంగరంగ వైభవంగా జరిగింది. ఉత్సవ మూర్తులతో పురవీధుల్లో ఊరేగింపు జరిగింది. మహిళలు కోలాటం నిర్వహించారు.
తాడికొండ: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం తుళ్లూరులో పర్యటించనున్న సందర్భంగా జిల్లా కలెక్టర్ ఎ.తమీమ్ అన్సారియా, జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ శనివారం ఏర్పాట్లను పరిశీలించారు. తుళ్లూరులో నిర్వహించే అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి కార్యక్రమానికి ముఖ్యమంత్రి రానున్నారు. తుళ్లూరులో ఆర్యవైశ్య ట్రస్టుకు ప్రభుత్వం కేటాయించిన 6.80 ఎకరాల స్థలంలో అమరజీవి పొట్టి శ్రీరాములు స్మృతి వనా న్ని ఏర్పాటు చేస్తున్నారు. 58 అడుగుల పొట్టి శ్రీరాములు కాంస్య విగ్రహాన్ని సీఎం ఆవిష్కరించనున్నారు. అనంతరం బహిరంగ సభలో ముఖ్యమంత్రి పాల్గొంటారని అధికారులు తెలి పారు. ఆర్య వైశ్య కార్పొరేషన్ చైర్మన్, ఆర్యవైశ్య ట్రస్ట్ ప్రెసిడెంట్ రూండి రాకేష్ వివరాలను అందిస్తూ పదివేల మంది కార్యక్రమానికి హాజరవుతారన్నారు.
రెంటచింతల: స్థానిక కానుకమాత చర్చి విచారణ గురువులు రెవ. ఫాదర్ ఏరువ లూర్దుమర్రెడ్డి 36వ గురు పట్టాభిషేక వార్షికోత్సవ వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం ఫాదర్ మర్రెడ్డిని ఘనంగా సన్మానించి అభినందించారు. కానుకమాత చర్చి సహాయ గురువులు ప్రసన్నకుమార్ తదితరులు పాల్గొన్నారు.


