● ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిరసనగా
ఏప్రిల్ 20 నుంచి వీఆర్‌ఏల సమ్మెబాట
● ఈ నెల 27న వీఆర్‌ఏల సంఘం
జిల్లా మహాసభ
● వీఆర్‌ఏల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బందగీ సాహెబ్
సత్తెనపల్లి: టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 22 నెలలు గడిచినా గ్రామ రెవెన్యూ అధికారుల (వీఆర్‌ఏ) ఏ ఒక్క సమస్య పరిష్కారం చేయలేదని వీఆర్‌ఏల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు షేక్ బందగీ సాహెబ్ అన్నారు. పల్నాడు జిల్లా వీఆర్‌ఏల సంఘం జిల్లా కమిటీ సమావేశం సత్తెనపల్లి పట్టణంలోని పుతుంబాక వెంకటపతి భవన్‌లో శనివారం నిర్వహించారు. సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా హజరై మాట్లాడారు.
● పక్క రాష్ట్రాలలో వీఆర్‌ఏలకు పేస్కేలు, జీతాలు అమలు చేస్తున్నారని, మన రాష్ట్రంలో వీఆర్‌ఏలకు 8 సంవత్సరాల నుంచి జీతాలు పెంచకుండా, వన్ టైం సెటిల్మెంట్ ద్వారా ప్రమోషన్లు ఇవ్వకుండా, నామిని సమస్య పరిష్కారం చేయకుండా ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తుందన్నారు.
● ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి వ్యతిరేకంగా ఏప్రిల్ 20 నుంచి రాష్ట్రవ్యాప్తంగా వీఆర్‌ఏలు సమ్మెలో పాల్గొంటారని, ప్రభుత్వంతో తాడోపేడో తేల్చుకోవడానికి వీఆర్‌ఏలు సమ్మెబాట పట్టానున్నారన్నారు.
● ప్రభుత్వం సార్వత్రిక ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. దీనిలో భాగంగా పల్నాడు జిల్లా వీఆర్‌ఏల సంఘం మహాసభ ఈ నెల 27న నిర్వహించడం జరుగుతుందని, ఈ మహాసభకు జిల్లాలో ఉన్న ప్రతి ఒక్క వీఆర్‌ఏ తప్పనిసరిగా హాజరుకావాలని, సమ్మెకు సంబంధించి వీఆర్‌ఏలు అంగీకార పత్రాల మీద సంతకాలు చేసి సమ్మెలో పాల్గొనడానికి కృషి చేయాలన్నారు.
సమావేశంలో వీఆర్‌ఏల సంఘం సత్తెనపల్లి డివిజన్ అధ్యక్షుడు సంజీవరావు, డివిజన్ ప్రధాన కార్యదర్శి సుబ్బారావు, వివిధ మండల నాయకులు రవి, మునఫ్, శ్రీకాంత్, శ్రీనివాస్, వెంకటేష్, కొండలు, అశోక్, రామకృష్ణ, సుందరరావు, నాగేశ్వరరావు, సుబ్బారావు, బుడే సాహెబ్, డేవిడ్, రాజు, రమేష్, తదితర నాయకులు పాల్గొన్నారు.


