టెన్త్ విద్యార్థులకు కొనసాగుతున్న ప్రత్యేక తరగతులు ఉదయం నుంచి సాయంత్రం వరకు పుస్తకాలతో కుస్తీ అల్పాహారం లేక నీరసిస్తున్న విద్యార్థులు నిధులు లేవని చేతులెత్తేస్తున్న విద్యాశాఖ అధికారులు దాతలు ముందుకు రావాలంటూ విన్నపాలు జిల్లాలో అర్ధాకలితో అలమటిస్తున్న విద్యార్థులు 26,400 మంది
సత్తెనపల్లి: విద్యార్థులకు పదో తరగతి ఎంతో కీలకం. ఇందులో వచ్చిన మార్కుల ఆధారంగా ఉన్నత చదువులకు అవకాశం ఉంటుంది. పబ్లిక్ పరీక్షలు ఈ నెల 16వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ క్రమంలో వంద శాతం ఉత్తీర్ణత, ఉత్తమ ఫలితాల సాధనకు ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులు ఉదయం, సాయంత్రం ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. విద్యార్థులు ఉదయం 7 గంటలకే ఇంటి నుంచి వస్తున్నారు. తిరిగి వెళ్లడానికి సాయంత్రం 6 నుంచి 7 గంటలకుపైగా అవుతుంది. ఈ క్రమంలో నీరసించిపోయి చదువులపై ఏకాగ్రత పెట్టలేకపోతున్నారు. వారికి సాయంత్రం అల్పాహారం ఇవ్వాల్సి ఉన్నా ప్రభుత్వం నిధులు విడుదల చేయలేదు.
26,400 మందికిపైగా విద్యార్థులు
జిల్లా వ్యాప్తంగా ఈ ఏడాది 183 జెడ్పీ, మున్సిపల్, ప్రభుత్వ పాఠశాలలకు సంబంధించి 26,400 మంది పైగా పదో తరగతి విద్యార్థులు ఉన్నారు. వారికి ఉదయం, సాయంత్రం స్టడీ అవర్స్‌తోపాటు ప్రత్యేక తరగతులు, పరీక్షలు నిర్వహిస్తున్నారు.వంద శాతం ఉత్తీర్ణతతోపాటు ఉత్తమ ఫలితాలు కూడా సాధించాలని ఉపాధ్యాయులపై తీవ్ర ఒత్తిడి తెస్తున్నారు. ఉదయం నుంచి పుస్తకాలతో కుస్తీ పడుతున్న విద్యార్థులు సాయంత్రానికి నిరసించి పోతున్నారు. వారికి సాయంత్రం వేళ స్నాక్స్ అందించాలంటే ఒక్కో పాఠశాలకు విద్యార్థుల సంఖ్యను బట్టి రూ. 1,000 నుంచి రూ.1,500 వరకు ఖర్చు అవుతుంది. పౌష్టికాహరానికి ప్రభుత్వం బడ్జెట్ కేటాయించలేదు. దీంతో మధ్యాహ్న భోజనంతోనే సరిపెట్టుకోవాల్సి వస్తోంది. మధ్యాహ్నం ఒంటి గంటకు తింటున్న భోజనం తప్ప మరే ఆహారం లేకపోవడంతో సాయంత్రానికి విద్యార్థులు ఆకలితో అల్లాడిపోతున్నారు. కాలే కడుపుతో చదువుపై పూర్తిస్థాయిలో ఏకాగ్రత నిలపలేక ఇబ్బంది పడుతున్నారు.
నీరసిస్తున్న బాలలు
సుదీర్ఘంగా గంటలపాటు చదువుకోవడం వల్ల విద్యార్థులు శారీరక శక్తిని కోల్పోతున్నారు. మధ్యాహ్న భోజనం తర్వాత సాయంత్రం వరకు ఏమీ తినకపోవడంతో చాలామంది విద్యార్థులు నీరసానికి గురవుతున్నారు. కనీసం సాయంత్రం వేళల్లో బిస్కెట్లు, పాలు లేక ఏదైనా అల్పాహారం అందుబాటులో లేకపోవడంతో వారు చదువుపై సరిగ్గా దృష్టి సారించలేకపోతున్నారు. ఆకలి కడుపులతో పాఠాలు వినడం, చదవడం పెద్ద సవాలుగా మారింది.
దాతలు ముందుకు వస్తేనే...
విద్యార్థుల పరిస్థితిని గమనించిన విద్యాశాఖ అధికారులు దాతల సహాయాన్ని కోరుతున్నారు. సాయంత్రం ప్రత్యేక తరగతుల సమయంలో అల్పాహారం అందించేందుకు నిధుల కొరత ఉందని అధికారులు అంటున్నారు. జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలు ఉన్న ప్రాంతాల్లో దాతలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు ముందుకు వచ్చి స్నాక్స్ పంపిణీ చేయాలని చెబుతున్నారు.
జిల్లా సమాచారం
జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు : 172
మున్సిపల్ ఉన్నత పాఠశాలలు : 07
ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు : 04
టెన్త్ విద్యార్థుల సంఖ్య : 26,400


