పట్నంబజారు: గంజాయి విక్రయిస్తున్న ముగ్గురు యువకులను పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచారు. పాత గుంటూరు పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈస్ట్ సబ్ డివిజన్ డీఎస్పీ షేక్ అబ్దుల్ అజీజ్, పాత గుంటూరు పోలీస్‌స్టేషన్ ఎస్‌హెచ్‌వో కే.వెంకట ప్రసాద్ వివరాలను వెల్లడించారు. గుంటూరు తారకరామానగర్‌కు చెందిన షేక్ మహబూబ్ బాషా అలియాస్ 220 బాషా గంజాయి తాగటానికి అలవాటు పడి, సులువుగా డబ్బులు సంపాదించాలని ఉద్దేశంతో గంజాయి విక్రయాలు చేస్తున్నాడు. ఈ క్రమంలో లంబసింగ్ వాటర్ ఫాల్స్ దాటిన తరువాత అన్నారం అనే గ్రామం వద్ద తాబేలీ ఛత్రపతి, తామిలి కొండలరావు వద్ద లిక్విడ్ గంజాయి కొనుగోలు చేస్తూ ఉంటాడు. ఈ క్రమంలో ఛత్రపతి, కొండలరావుకు గంజాయి కావాలని ఫోన్ చేయగా, లిక్విడ్ గంజాయి తీసుకుని వారు ఈనెల 15వ తేదీన వస్త్ర నగర్ వద్దకు వచ్చారు. పక్కా సమాచారం అందుకున్న పోలీసులు దాడి చేసి ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి కిలో లిక్విడ్ గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నిందితులను పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన సిబ్బందిని అభినందించారు. ఈ మేరకు వారినీ అరెస్ట్ చేసి కోర్టుకు హాజరు పరుస్తున్నట్లు తెలిపారు.


