మామాఅల్లుళ్లను మింగేసిన కంటైనర్‌ | - | Sakshi
Sakshi News home page

మామాఅల్లుళ్లను మింగేసిన కంటైనర్‌

Mar 11 2026 7:52 AM | Updated on Mar 11 2026 7:52 AM

నకరికల్లు: కంటైనర్‌ అదుపు తప్పి ద్విచక్ర వాహనంపై బోల్తా పడడంతో ఇరువురు దుర్మరణం పాలయ్యారు. ఈ ఘటన మండలంలోని అడ్డరోడ్డు వద్ద అద్దంకి–నార్కట్‌పల్లి రాష్ట్ర రహదారిపై మంగళవారం జరిగింది. సంఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల మేరకు... పిడుగురాళ్ల మండలం గుత్తికొండ గ్రామానికి చెందిన జిల్లా గురుమూర్తి (55), గుంటూరు నగరం లక్ష్మీపురానికి చెందిన గోపిదేశి సత్యనారాయణ (45) వరుసకు మామాఅల్లుళ్లు. ఈపూరు మండలం ఇనిమెళ్ల గ్రామంలోని మామిడితోటకు మందు పిచికారీ చేయించి స్కూటీపై గుత్తికొండకు బయలుదేరారు. మార్గమధ్యలో అడ్డరోడ్డు వద్దకు వచ్చేసరికి పిడుగురాళ్ల వైపు అతివేగంతో వెళ్తున్న కంటైనర్‌ అదుపుతప్పి స్కూటీపై బోల్తా పడింది. దీంతో ఇద్దరూ అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు. ఘటనా స్థలానికి ఎస్‌ఐ కె.సతీష్‌, సిబ్బంది వచ్చి స్థానికుల సహాయంతో క్రేన్‌ ద్వారా కంటైనర్‌ని పక్కకు తీయించారు. కంటైనర్‌ కిందనున్న మృతదేహాలను వెలికితీశారు. మృతుల బంధువులకు సమాచారం అందించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం నరసరావుపేట ఏరియా వైద్యశాలకు తరలించారు.

భారీగా నిలిచిన ట్రాఫిక్‌

అద్దంకి–నార్కట్‌పల్లి రాష్ట్ర రహదారిపై కంటైనర్‌ బోల్తా పడడంతో రహదారిపై ట్రాఫిక్‌ భారీగా నిలిచిపోయింది. హైవేపై వెళ్లే వాహనాలతోపాటు నరసరావుపేట–పిడుగురాళ్ల వైపు రాకపోకలు సాగించేవి కూడా భారీ సంఖ్యలో నిలిచిపోయాయి. మండుటెండ కావడంతో ప్రయాణికులు వేచి ఉండలేక రెండుగంటల పాటు అవస్థలు పడ్డారు. కంటైనర్‌ను వెలికితీసిన పోలీసులు ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు.

బైకుపై వెళ్తుండగా వాహనం పడి మృతి

Advertisement
 
Advertisement
Advertisement