విద్యుత్ కోతలతో పంటలు ఎండుతున్నాయని రైతుల ఆవేదన 15 రోజులుగా నిరీక్షించి సబ్ స్టేషన్‌ను ముట్టడించిన రైతులు
దుర్గి: ఆరుగాలం కష్టపడి పండించిన పంట చేతికొచ్చే దశలో రైతుల కళ్ల ముందే పంటలు ఎండిపోవటంతో ఆందోళన చెందిన రైతులు సబ్‌స్టేషన్ ముట్టిడించి ధర్నా నిర్వహించారు. ఈ ఘటన మండల పరిధిలోని కంచరగుంట గ్రామంలో సోమవారం చోటుచేసుకుంది. వివరాలలోకి వెళ్తే కోలగోట్ల సబ్‌స్టేషన్ పరిధిలోని కంచరగుంట గ్రామంలో రైతాంగం మిర్చి, మొక్కజొన్న సాగు చేస్తున్నారు. పూర్తిగా మెట్ట ప్రాంతం కావడంతో రైతులు బోరు బావుల మీద ఆధారపడ్డారు. నెల రోజుల్లో పంట చేతికి వస్తున్న దశలో గత 15 రోజులుగా అరకొర విద్యుత్ సరఫరా అవుతోంది. పంటలు ఎండిపోయే దశకు చేరుకున్నాయని ఆందోళన చెందిన రైతులు స్థానిక సబ్ స్టేషన్ ముట్టడించి ధర్నా నిర్వహించారు. దుర్గి, ముటుకూరు ప్రధాన రహదారులపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ గత 15 రోజుల నుంచి సమస్యను స్థానిక విద్యుత్ అధికారులకు సమస్యను పరిష్కరించాలని విజ్ఞప్తి చేసినా పట్టించుకోలేదన్నారు. తమకు పగటిపూట తొమ్మిది గంటలు నిరంతర విద్యుత్ అందజేయాలని కోరినా ఆలకించలేదన్నారు. రాత్రిపూట మూడు గంటలు, పగటి పూట రెండు గంటలు మాత్రమే విద్యుత్ సరఫరా చేయడంపై ఆందోళన వ్యక్తం చేశారు. గత నాలుగు నెలల క్రితం మొంథా తుపానుతో కొంత పంట దెబ్బతిని అప్పుల పాలమయ్యామని రైతులు చెప్పారు. ఇప్పుడు ఉన్న పంటను కూడా కాపాడుకోలేకపోతే తమకు ఆత్మహత్యలు శరణ్యమని వారు తెలిపారు. ధర్నా కారణంగా భారీగా బస్సులు, కార్లు, ద్విచక్ర వాహనాలు నిలిచిపోయాయి. ఎస్‌ఐ ఎల్. సుధీర్‌బాబు తమ సిబ్బందితో ఘటనా స్ధలానికి చేరుకొని రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సమస్యను 24గంటల్లోపు పరిష్కరిస్తామని హామీ ఇవ్వటంతో రైతులు ఆందోళన విరమించారు. అనంతరం పోలీసులు ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. కార్యక్రమంలో గామానికి చెందిన రైతులు, కూలీలు, మహిళలు పాల్గొన్నారు.


