కాలువలో ఈతకు దిగి వ్యక్తి మృతి | - | Sakshi
Sakshi News home page

కాలువలో ఈతకు దిగి వ్యక్తి మృతి

Mar 11 2026 7:32 AM | Updated on Mar 11 2026 7:32 AM

మంగళగిరి టౌన్‌: కాలువలోకి ఈతకు దిగి ప్రమాదవశాత్తు ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన కాజ గ్రామంలో మంగళవారం చోటుచేసుకుంది. మంగళగిరి రూరల్‌ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం దుగ్గిరాల మండలం చిలువూరుకు చెందినబొడ్డు వెంకటరమణ (22) సోమవారం మధ్యాహ్నం సమయంలో తోటి స్నేహితులు మహేష్‌, శ్రీనివాస్‌లతో కలసి మోటారు సైకిల్‌పై బయటకు వెళ్లారు. అనంతరం కాజ గ్రామ చెరువు వద్దకు చేరుకున్నారు. బహిర్భూమికి వెళ్లిన అనంతరం వెంకట రమణ ఈత కొట్టేందుకు చెరువులోకి దిగాడు. చెరువులోని కొంతదూరం వెళ్లాక రెండు చేతులు పైకి ఎత్తి కనబడడంతో స్నేహితులు పెద్దగా కేకలు వేశారు. చుట్టపక్కల ఉన్న రైతులు చెరువు వద్దకు చేరుకుని మునిగిన వెంకట రమణను బయటకు తీసుకు వచ్చారు. అప్పటికే వెంకటరమణ మృతిచెందినట్లు నిర్ధారించారు. జరిగిన ఘటనపై వెంకటరమణ భార్య మంజుల మంగళగిరి రూరల్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

గుండెపోటుతో

కానిస్టేబుల్‌ మృతి

మంగళగిరి టౌన్‌: ఇంటెలిజెన్స్‌ సెక్యూరిటీ విభాగంలో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్‌ కొలసాని వెంకటేశ్వరరావు(60) మంగళవారం ఉదయం వాకింగ్‌ చేస్తుండగా గుండెపోటుతో మృతి చెందారు. విజయవాడ రామవరప్పాడులో నివాసముంటున్న కొలసాని వెంకటేశ్వరరావు 1980లో ఏపీఎస్పీ కానిస్టేబుల్‌గా చేరారు. 2005లో ఏఆర్‌ కానిస్టేబుల్‌గా, 2019లో సివిల్‌ పీసీగా బదిలీ అయ్యి గుంటూరు జిల్లాలో విధులు నిర్వహిస్తున్నారు. సివిల్‌ కానిస్టేబుల్‌గా ఉంటూ ఇంటెలిజెన్స్‌ సెక్యూరిటీలోని డాగ్‌ స్క్వాడ్‌లో ప్రస్తుతం పనిచేస్తున్నారు. ఈయనకు 2008లో గుండెజబ్బు రావడంతో స్టంట్స్‌ వేశారు. 2011లో బైపాస్‌ సర్జరీ కూడా జరిగింది. ఈ క్రమంలో మంగళవారం ఉదయం మంగళగిరిలోని ఏపీఎస్పీ ఆరవ బెటాలియన్‌ గ్రౌండ్‌లో పీపీటీ టెస్ట్‌లో వాకింగ్‌ చేస్తుండగా అకస్మాత్తుగా కుప్పకూలిపోయాడు. మంగళగిరి ఎయిమ్స్‌కు తరలించగా, పరీక్షించిన వైద్యులు వెంకటేశ్వరరావు మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతుని భార్య రాజేశ్వరి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఎయిడెడ్‌ ఉపాధ్యాయ పోస్టులకు దరఖాస్తు

స్వీకరణ గడువు పొడిగింపు

గుంటూరు ఎడ్యుకేషన్‌: గుంటూరు, బాపట్ల జిల్లాల్లోని వివిధ ఎయిడెడ్‌ పాఠశాలల్లో పలు ఉపాధ్యాయ పోస్టులను కాంట్రాక్టు పద్ధతిలో భర్తీ చేసేందుకు దరఖాస్తు స్వీకరణ గడువును ఈనెల 20వ తేదీ వరకు పొడిగించినట్లు ఆర్జేడీ బి.లింగేశ్వర రెడ్డి మంగళవారం ఓ ప్రకటన లో తెలిపారు. చెరుకుపల్లి మండలంలోని బాపూజీ ఎయిడెడ్‌ హైస్కూల్‌, శాస్త్రి మెమొరియల్‌ ఎయిడెడ్‌ యూపీ స్కూల్‌, గుంటూరు శ్రీనివాసరావు పేటలోని శ్రీ రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ కమిటీ ప్రాథమికోన్నత పాఠశాల, అరండల్‌ పేట 10/4 లోని రెసిడెన్షియల్‌ ఆదివాసీ ప్రాథమికోన్నత పాఠశాలతో పాటు మార్కెట్‌ సెంటర్లోని హిందూ కాలేజీ హైస్కూల్‌, బ్రాడీపేటలోని మాజేటి గురవయ్య హైస్కూల్లో ప్ర భుత్వ అనుమతి మేరకు వివిధ పోస్టులను భర్తీ చేయనున్నట్లు పేర్కొన్నారు. నిబంధనల మేరకు అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తులను ఆయా పాఠశాల కరెస్పాండెంట్‌కు వ్యక్తిగతంగా, పోస్టు ద్వారా పంపాలని తెలిపారు. పూర్తి వివరాలకు హెచ్‌టీటీపీఎస్‌//సీఎస్‌ఈ.ఏపీ.ఇన్‌ను సందర్శించాలని సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement