వందేళ్ల చరిత్ర కలిగినఅమరావతి ఆయుర్వేద ఆస్పత్రి హెల్త్ సెంటర్ నిర్మాణ సాకుతో ఆయుర్వేద ఆస్పత్రి ప్రహరీ, హెర్బల్ గార్డెన్‌లను ధ్వంసం చేసిన టీడీపీ నేతలు మండిపడుతున్న గ్రామస్తులు
ఉన్నతాధికారులకు నివేదించాం..
అమరావతి: ప్రసిద్ధ శైవక్షేత్రం, పర్యాటకకేంద్రమైన అమరావతిలో అమరేశ్వరస్వామి దేవాలయం, అలాగే అమరావతి స్థూపం తర్వాత అంతే పురాతనమైన ఆయుర్వేద ఆస్పత్రిని ధ్వంసం చేయటంపై గ్రామస్తులు, మేధావులు, రాజకీయ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ఈ వైద్యశాలను కాపాడాలని కోరుతున్నారు. బ్రిటిష్ హయాంలో 1923 సంవత్సరంలో ఈ ఆయుర్వేద ఆస్పత్రి స్థాపించినట్లు చరిత్ర చెబుతోంది. సుమారు వంద సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ ఆయుర్వేద ఆస్పత్రిపై ఇటీవల తెలుగుదేశం పార్టీ నాయకులు హెల్త్‌సెంటర్ నిర్మాణం చేయాలనే సాకుతో ప్రహారీ, హెర్బల్ గార్డెన్ ధ్వంసం చేయటంపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 1947 వ సంవత్సరంలో ఏర్పడిన గ్రామ పంచాయతీ 1923లో నిర్మాణం చేయబడిన ఆయుర్వేద ఆస్పత్రికి స్థలం ఇచ్చిందనే వాదనతో విభేదిస్తున్నారు.
● పదేళ్ల క్రితం ప్రజల్లో ఆయుర్వేద వైద్యంపై మక్కువ పెరగటం, అప్పటికే ఆయుర్వేద వెద్యశాల శిఽథిలావస్థకు చేరటంతో రూ.లక్షల ఖర్చుతో నూతన భవనాలను నిర్మాణం చేయాలని నిర్ణయించారు. ఈనేపధ్యంలో 2015 సంవత్సరంలో ఆయుష్‌శాఖ గ్రామపంచాయతీ నుంచి 25సెంట్ల స్థలం ఆయుర్వేద ఆస్పత్రి వారికి చెందినదని పొజిషన్ సర్టిఫికేట్ ఇవ్వటం జరిగింది. ఈక్రమంలో సుమారు రూ.25లక్షల నిధులతో ఆయుర్వేద ఆస్పత్రితో పాటుగా యోగా హాల్, పంచకర్మ నిర్వహించటానికి ప్రత్యేక గదులు నిర్మాణం చేశారు.
● ప్రస్తుతం ఈ ఆయుర్వేద వైద్యశాలలో అనుభవజ్ఞులైన వైద్యులు అన్ని రోగాలకు చికిత్స చేయటంతో పాటుగా మందులు ఉచితంగా అందస్తున్నారు. వాటితో పాటుగా పంచకర్మ, యోగా వంటి పద్ధతులలో రోగులకు చికిత్సలు అందించటంతో రోజుకు సుమారు వందమంది పైగా ఇక్కడ చికిత్సకు వస్తున్నారు. అలాగే రోగులకు ప్రకృతిలో దొరికే ఆయుర్వేద మొక్కలపై అవగాహన ఏర్పరచటానికి అస్పత్రి ఆవరణలో రూ.లక్ష వ్యయంతో హెర్బల్ గార్డెన్ ఏర్పాటు చేసి అందులో ఆయుర్వేద అవసరాలకు ఉపయోగించే అరుదైన మొక్కలను నాటి వాటి ఉపయోగాలను పేర్లను తెలియచేసే బోర్డులను ఏర్పాటు చేశారు. రెండు రోజుల క్రితం కొందరు టీడీపీ నాయకులు ఇక్కడ హెల్త్ సెంటర్ నిర్మాణం చేయాలని.. స్థలం కావాలంటూ ఆస్పత్రి ప్రహరీని, హెర్బల్ గార్డెన్‌ను ధ్వంసం చేశారు. నిత్యం వందమంది రోగులకు అవపరమైన వైద్యసేవలు అందిస్తున్న ఈ వైద్యశాలను కాపాడాలని ప్రజలు కోరుతున్నారు.
ఆయుర్వేద వైద్యశాల ప్రహరీ పడగొట్టడం, మొక్కలు, చెట్లు ధ్వంసం చేసిన మాట వాస్తవం. ఈ సంఘటన వివరాలను ఆయుష్ శాఖ, జిల్లా ఉన్నతాధికారులకు నివేదిక అందించాం. దీనిపై తదుపరి వారి ఆదేశాల మేరకు నిర్ణయం ఉంటుంది
– డాక్టర్ జైనబ్‌జహా వైద్యాధికారి, ఆయుర్వేద వైద్యశాల, అమరావతి


