మాచర్ల: ఆపదలో ఉన్న మహిళలు, బాలికలకు సేవలందించేందుకు పల్నాడు జిల్లా మాచర్ల పట్టణంలో వన్ స్టాప్ టూ సెంటర్ ఏర్పాటు చేస్తున్నట్లు జిల్లా శిశు సంక్షేమ శాఖ అధికారిణి ఎం.ఉమాదేవి తెలిపారు. మాచర్ల పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేయనున్న వన్ స్టాప్ టూ సెంటర్ పరిశీలించేందుకు శనివారం ఎంపీడీవో కార్యాలయానికి వచ్చారు.
శిశు సంక్షేమ శాఖ అధికారులు, ఇతర అధికారులతో సమీక్షించారు. అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడుతూ ఇంటి నుంచి తప్పిపోయిన బాలికలు, ఆపదలో ఉన్న మహిళలు, కుటుంబ కలహాలతో బయటకు వచ్చిన వారికి, ప్రేమ వివాహాలు చేసుకుని విడిపోయన మహిళలకు, రన్‌వే బాలికలకు వైద్య, ఆర్ధిక సహాయం, షెల్టర్ ఇచ్చేందుకు వన్ స్టాప్ సెంటర్‌ను మాచర్లలో ఆదివారం ప్రారంభించనున్నట్లు తెలిపారు. సీఎం వర్చువల్ ద్వారా సెంటర్‌ను ప్రారంభిస్తారన్నారు. ఒంటరి మహిళలు, ఇబ్బందులకు గురైన మహిళలకు ఐదురోజులపాటు ఈ సెంటర్‌లో వసతి కల్పించడంతోపాటు, భోజనం, వైద్య సౌకర్యాలు కల్పిస్తారని తెలిపారు. కుటుంబ కలహాలు ఉన్నవారికి కౌన్సెలింగ్ చేయడం జరుగుతోందన్నారు. 18 సంవత్సరాలలోపు బాలికలకు వారి కుటుంబ సభ్యులను పిలిపించి కౌన్సెలింగ్ ఇవ్వడం జరుగుతోందన్నారు. మహిళల రక్షణ కోసం ఈ సెంటర్‌ను ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో అధికారులు, సూపర్‌వైజర్లు, అంగన్‌వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు.


