తల్లి మందలించటంతో ఫ్యాన్‌కు ఉరి వేసుకున్న బాలుడు తీవ్ర విషాదంలో తల్లిదండ్రులు నరసరావుపేటలో చోటు చేసుకున్న సంఘటన 7వ తరగతి విద్యార్థి మృతితో ఇస్లాంపేటలో విషాదఛాయలు
మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం
సెల్ ఫోన్ వద్దన్నందుకు బాలుడి బలవన్మరణం
నరసరావుపేటటౌన్: తల్లి మందలించిందని కుమారుడు ఇంట్లో ఫ్యాన్‌కు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన నరసరావుపేట పట్టణంలో కలకలం రేపింది. ఇస్లాంపేటకు చెందిన షేక్ రిహాన్ (11) ప్రకాష్‌నగర్‌లోని ఓ ప్రైవేటు పాఠశాల్లో 7వ తరగతి చదువుతున్నాడు. ప్రతి రోజు పాఠశాల నుంచి వచ్చిన తర్వాత ఇంట్లో సెల్‌ఫోన్‌న్‌తీసుకొని గంటల కొద్ది ఆన్‌లైన్ గేమ్ ఆడేందుకు అలవాటు పడ్డాడు. అనేక సార్లు తల్లిదండ్రులు వారించినా వినలేదు. సోమవారం సెల్‌ఫోన్‌లో గేమ్ ఆడుతున్న కుమారుడిని చూసి తల్లి మందలించింది. దీంతో అలిగి డాబా పైరూంకి వెళ్లిన బాలుడు ఎంతసేపటికీ కిందకు రాలేదు. దీంతో పైకి వెళ్లి చూడగా ఫ్యానన్‌కు చీరతో ఉరివేసుకొని వేలాడుతూ కనిపించాడు. విగతజీవిగా పడి ఉన్న బిడ్డను చూసి ఆ తల్లి రోదించిన తీరు అందరినీ కంట తడి పెట్టించింది. ఒక్క మాట అనకుండా ఉండాల్సింది అంటూ బోరున విలపించింది. రిహాన్ మృతితో పాఠశాలకు మంగళవారం సెలవు ప్రకటించారు.
ఆందోళనకరంగా సెల్‌ఫోన్ వినియోగం..
ఇటీవల కాలంలో యువతకు సెల్‌ఫోన్ లేనిదే రోజు గడవటం లేదు. సెల్‌ఫోన్ వినియోగం విపరీతంగా పెరగటం ఆందోళన కలిగిస్తుంది. మొబైల్ లేకుండా ఒక్కరోజు కూడా గడవలేని పరిస్థితి ఏర్పడింది. సోషల్ మీడియా, షార్ట్ వీడియోలు, ఆన్‌లైన్ గేమ్‌లకు యువత పూర్తిగా ఆకర్షితులౌతున్నారు. ముఖ్యంగా ఆన్‌లైన్ గేమ్‌లకు అలవాటు పడిన కొందరు యువకులు గంటల కొద్ది అదే ప్రపంచంలో మునిగిపోతున్నారు. అదే విధంగా ఆన్‌లైన్ క్రికెట్ బెట్టింగ్‌ల్లో ఆర్థికంగా నష్టపోయి అనేక మంది బలవన్మరణాలకు పాల్పడుతున్నారు.
ఎక్కువ సమయం సెల్‌ఫోన్‌కే..
చదువుకు కేటాయించాల్సిన విలువైన సమయాన్ని మొబైల్ స్క్రీన్ ముందు గడుపుతున్నారు. సామాజిక మాధ్యమం పిల్లలపై పెను ప్రభావం చూపుతుంది. అన్నం తినాలన్నా, పుస్తకం పట్టాలన్నా చివరకు నిద్రపోవాలన్నా కాసేపు ఫోన్ పట్టే పరిస్థితి ప్రతి ఇంటా ఉంటుంది. ఎక్కువ సేపు సామాజిక మధ్యమాల్లో గడపటంతో చదువుపై ఏకాగ్రత సన్నగిల్లుతోంది. ఫలితంగా విద్యలో వెనుకబడటమే కాక మానసికంగా కూడా దెబ్బతింటున్నారు. కుటుంబ సభ్యులతో మాట్లాడే సమయం తగ్గిపోగా, వర్చువల్ ప్రపంచమే అసలు జీవితంలా మారిపోతుంది. చిన్న చిన్న విషయాలకు కోపం, నిరాశ ఆవేశం పెరిగి తీవ్ర నిర్ణయాలకు దారి తీస్తున్నాయని నిపుణులు చెప్పుకొస్తున్నారు. పిల్లలు మంచి మార్గంలో నడవాలని తల్లిదండ్రులు మందలిస్తే దాన్ని అర్థం చేసుకోలేని కొందరు యువకులు క్షణికావేశంలో తీసుకొనే నిర్ణయాలు కుటుంబాలను శాశ్వతంగా విచ్ఛిన్నం చేస్తున్నాయి.
మొబైల్‌ఫోన్ అవసరమైన సాంకేతిక సాధనమే అయినప్పటికీ అధిక వినియోగం మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. పిల్లలు రోజంతా సెల్‌ఫోన్‌తో గడపకుండా తల్లిదండ్రులు స్పష్టమైన సమయపరిమితి పెట్టాలి. సెల్‌ఫోన్‌కు అలవాటు పడ్డ పిల్లల నుంచి ఒక్కసారిగా ఫోన్ తీయకుండా, క్రమంగా తగ్గించాలి. పిల్లలతో స్నేహపూర్వకంగా మాడ్లాడి వారి భావాలు, సమస్యలు తెలుసుకొనే ప్రయత్నం చేయాలి. ముఖ్యంగా సోషల్ మీడియా వల్ల వచ్చే అనర్థాల గురించి వివరిస్తూ చదువు, ఆరోగ్యం, భవిష్యత్తుపై అవగాహన కలిగించాలి. చదువు, ఆటలు, విశ్రాంతి అన్ని సమతుల్యంగా ఉండేవిధంగా చూడాలి.
– డాక్టర్ అత్తిలి సతీష్,
మానసిక వైద్య నిపుణులు


