గుంటూరు వెస్ట్(క్రీడలు): జిల్లా క్రికెట్ అసోసియేషన్ తరపున త్రీమెన్ కమిటీ ఆధ్వర్యంలో సీనియర్, అండర్–23 యువకుల క్రికెట్ జట్టు ఎంపిక ఈనెల 9న తేదీ ఉదయం 07.30 గంటలకు అరండల్‌పేట 10/3 శ్రీ మాజేటి గురవయ్య హైస్కూల్ గ్రౌండ్‌లో నిర్వహిస్తామని యు.మహతి శంకర్ గురువారం ఒక ప్రటకటనలో పేర్కొన్నారు. అండర్–23 బాలురు 01–09–2003 తరువాత జన్మించిన వారై ఉండాలన్నారు. సీనియర్ జట్టుకు వయస్సు పరిమితి లేదన్నారు. ప్లేయర్స్ వైట్ డ్రెస్‌తోపాటు సొంత కిట్ బ్యాగ్‌తో రిపోర్ట్ చేయాలన్నారు. డిజిటల్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్స్, ఆధార్ కార్డ్ జిరాక్స్ కాఫీతో రిపోర్ట్ తప్పనిసరన్నారు.
చీరాల రూరల్: ఎస్పీ ఉమామహేశ్వర్‌పై అవినీతి, అసత్య ఆరోపణలు చేస్తున్న చుండూరు మండలం తెలుగుదేశం పార్టీ నాయకుడు బాలకోటిరెడ్డిపై చర్యలు తీసుకోవాలంటూ మాల మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు మల్లెల వెంకటరావు, దళిత మహాసభ మాచవరపు జూలియన్‌లు డిమాండ్ చేశారు. బాలకోటిరెడ్డిని తక్షణమే అరెస్టు చేయాలంటూ గురువారం వారు తమ అనుచరులతో కలిసి చీరాల ఒన్‌టౌన్ పోలీసు స్టేషన్‌లో సీఐ సుబ్బారావుకు ఫిర్యాదు చేశారు. వారు మాట్లాడారు. బాలకోటిరెడ్డిపై చుండూరు చుట్టు పక్కల పోలీసుస్టేషన్‌లలో అనేక కేసులు నమోదై ఉన్నాయని, అతనిపై రౌడీషీటు కూడా ఉందని తెలిపారు. సెటిల్‌మెంట్లు, దందాలు, కోడి పందేలు, పేకాట, ఇసుక వంటి అక్రమ మార్గాల్లో డబ్బులు సంపాదిస్తూ చివరకు పోలీసులపైనే దాడులకు దిగడం వారిని బ్లాక్‌మెయిల్ చేసే విధంగా వీడియోలు పెట్టడం దారుణమన్నారు. వారిపై అవినీతి, అసత్య ఆరోపణలు చేయడం వంటి అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతున్నాడని ఆరోపించారు. తక్షణమే తెలుగుదేశం పార్టీ పెద్దలు అతనిపై క్రమశిక్షణ చర్యలు తీసుకుని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. తక్షణమే పోలీసు ఉన్నతాధికారులు స్పందించి అటువంటి సంఘ విద్రోహ శక్తులపై కేసులు నమోదుచేసి జైలుకు పంపించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర సమతా సైనిక్‌దళ్ అధ్యక్షుడు కంచర్ల చిట్టిబాబు, చీరాల, బాపట్ల నాయకులు పులిపాటి బాబురావు, మల్లెల బుల్లిబాబు, దార్ల శాస్త్రి, దేవరపల్లి బాబురావు, పండ్లూరి వినోద్, గోసాల అశోక్ తదితరులుపాల్గొన్నారు.
మంగళగిరి టౌన్: గుంటూరు జిల్లా మంగళగిరి ఎయిమ్స్ ఆసుపత్రిలో సదుపాయాలు, సౌకర్యాలు, అభివృద్ధి అంశాలపై గురువారం కేంద్ర గ్రామీణ అభివృద్ధి, కమ్యూనికేషన్ శాఖ సహాయమంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ ఎయిమ్స్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ ఎయిమ్స్‌లో సమస్యలను అధిగమించే అంశంపై గతంలో రివ్యూల్లో సమీక్షించామని పేర్కొన్నారు. ఎయిమ్స్‌ను ఆంధ్రప్రదేశ్‌కు ఒక గొప్ప రీసెర్చ్ అండ్ అకడమిక్ ఇనిస్టిట్యూట్‌గా చేయాలనే ఉద్దేశ్యంతో ఫైనాన్స్ మినిస్ట్రీ నుంచి దాదాపు 500 పోస్టులకు అనుమతులు తీసుకువచ్చామని గుర్తుచేశారు. ఎయిమ్స్‌లో గతంలో 12 ఆపరేషన్ థియేటర్లు ఉండగా నేడు 87 థియేటర్లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. రక్త పరీక్షలకు ఆలస్యం అవుతుందని, మిగతా అన్ని పరీక్షలు త్వరగానే రిపోర్టులు వస్తున్నాయని అధికారులు తెలిపినట్లు పేర్కొన్నారు. ఫార్మసీ కౌంటర్లు కూడా పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నామని, ప్రయాణికుల సౌకర్యార్ధం ఆసుపత్రి ఆవరణలో బస్ షెల్టర్‌ను అందుబాటులోకి తెచ్చామన్నారు. కార్యక్రమంలో ఎయిమ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ప్రొఫెసర్ డాక్టర్ అహంతం సాంతాసింగ్, ఎయిమ్స్ అధికారులు పాల్గొన్నారు.


