హోదా మార్పుపై హడావుడి చర్యలు గ్రేడ్–1 గ్రామ పంచాయతీలు...169 ఐదు వేలకు పైబడి జనాభా ఉన్న పంచాయతీల పేరు మార్పు జిల్లాలో 529 గ్రామ పంచాయతీలు
నిధులు కేటాయించాలి
సత్తెనపల్లి: జిల్లాలో గ్రామ పంచాయతీల పునర్ వర్గీకరణకు ఆమోదం తెలుపుతూ ప్రభుత్వ ఉత్తర్వులు ఇచ్చింది. పంచాయతీ ఆదాయం, జనాభా ప్రాతిపదికన వీటిని పునర్ వర్గీకరించనున్నారు. ప్రస్తుతం ఉన్న మూడు రకాల పంచాయతీలు ఇక నుంచి నాలుగు వర్గాలుగా ఏర్పడనున్నాయి. వీటిలో కొత్తగా రూర్బన్ పంచాయతీల ఏర్పాటుకు నిర్ణయించారు. జిల్లాలో మొత్తం 529 గ్రామ పంచాయతీలు ఉండగా, 13 రూర్బన్ పంచాయతీలు, 169 గ్రేడ్–1 పంచాయతీలు, 110 గ్రేడ్ –2 పంచాయతీలు, 237 గ్రేడ్–3 పంచాయతీలున్నాయి. రూర్బన్ పంచాయతీల్లో పట్టణ తరహాలో సదుపాయాలు కల్పించనున్నారు. ఇదీ ఎంత వరకు అమలుకు నోచుకుంటుందో వేచి చూడాలి.
జిల్లాలో ఇలా...
గ్రామపంచాయతీల పునర్ వర్గీకరణలో కొత్తగా రూర్బన్ పంచాయతీలను ప్రభుత్వం ప్రకటించింది. ఇందుకోసం మైదాన ప్రాంతం, గిరిజన ప్రాంతాలకు వేర్వేరు నిబంధనలను అమలు చేస్తున్నారు. మైదాన ప్రాంతంలో పది వేలకు పైగా జనాభా ఉండి వార్షిక ఆదాయం రూ.కోటి కంటే ఎక్కువ ఉండాలి. అదే గిరిజన ప్రాంతంలో ఐదు వేల కంటే ఎక్కువ జనాభా ఉంటే సరిపోతుంది. జిల్లాలో అమరావతి, అచ్చంపేట, కారంపూడి, క్రోసూరు, నకరికల్లు, పెదకూరపాడు, రెంటచింతలతోపాటు పెదగార్లపాడు, గణపవరం, లింగంగుంట్ల, రావిపాడు, గుండ్లపల్లి, జానపాడు పంచాయతీలను రూర్బన్ పంచాయతీలుగా ప్రకటించారు.
జనాభా ప్రాతిపదికన వర్గీకరణ..
జనాభా లెక్కల ప్రకారం పంచాయతీల పునర్ వర్గీకరణ చేశారు. 2,500 నుంచి 5 వేల మధ్య జనాభా ఉన్న పంచాయతీలను గ్రేడ్–1 పరిధిలోకి తీసుకు వచ్చారు. జిల్లాలో 169 గ్రామపంచాయతీలు గ్రేడ్ –1 పరిధిలోకి వచ్చాయి. 1,500 నుంచి 2000 లోపు జనా భా ఉంటే వాటిని గ్రేడ్–2 పరిధిలోకి తీసుకొచ్చారు. జిల్లాలో 110 గ్రామపంచాయతీలు గ్రేడ్–2లో ఉన్నా యి. పంచాయతీలో 1500 కంటే తక్కువ జనాభా ఉంటే గ్రేడ్–3లోకి తీసుకువచ్చారు. జిల్లాలో 237 గ్రామ పంచాయతీలు గ్రేడ్–3లో ఉన్నాయి. ఐదు వేలకు పైగా జనాభా ఉన్న పంచాయతీలను రూర్బన్ పంచాయతీలుగా ఏర్పాటు చేయనున్నారు.
పంచాయతీలను వర్గీకరించడం వల్ల ఉపయోగం లేదు. వాటికి పూర్తిస్థాయిలో ఆదాయం మార్గాలను పెంచాల్సిన అవసరం ఉంది. పంచాయతీల్లో అభివృద్ధి పనుల కోసం సకాలంలో నిధులు విడుదల చేయాలి. కేవలం పన్నుల రూపంలోనే పంచాయతీలకు ఆదాయం వస్తుంది. వాటిలో చాలా వరకు పారిశుద్ధ్య కార్మికులకు సరిపోతుంది. పంచాయతీలకు ఆదాయం వచ్చేలా వనరులను ఏర్పాటు చేయాలి. కొత్తగా ప్రకటించిన పంచాయతీలకు గ్రేడ్లు వారీగా నిధులు కేటాయించాలి. ప్రభుత్వ భవనాల నుంచి పంచాయతీలకు సకాలంలో పన్నులు వసూలైతే బాగుంటుంది.
– బొలమాల నాగమల్లేశ్యరరావు,
సర్పంచ్, గణపవరం


