చిలకలూరిపేట: త్రుటిలో ఘోర ప్రమాదం తప్పింది. రోడ్డు నిర్మాణ పనుల్లో సిబ్బంది సమన్వయలోపం కారణంగా భారీ గడ్డర్ నేలకొరిగింది. చీరాల వాడరేవు నుంచి పల్నాడు జిల్లా నకరికల్లు వరకు రోడ్డు నిర్మాణ పనులు జరుగుతున్న విషయం విదితమే. వాడరేవు నుంచి చిలకలూరిపేట మండలం బొప్పూడి వరకు 47 కిలో మీటర్ల మేర ఒక నిర్మాణ సంస్థ, ఇక్కడి నుంచి నకిరికల్లు వరకు మరో నిర్మాణ సంస్థ కాంట్రాక్టులు దక్కించుకున్నాయి. ఈ క్రమంలో వాడరేవు నుంచి చిలకలూరిపేటలోని బొప్పూడి వరకు రోడ్డు నిర్మాణ పనులు దాదాపుగా పూర్తి కావచ్చాయి. ఈ క్రమంలో ఎన్‌హెచ్16 పై ఫ్‌లై ఓవర్ పనులు జరుగుతున్నాయి. రోడ్డు వేసేందుకు అవసరమైన ఫిల్లర్లు, వాటిపై పీయర్‌క్యాప్‌ల నిర్మాణ పనులు ఇప్పటికే పూర్తయ్యాయి. ఈ ఫిల్లర్లపై ఐరన్ రాడ్స్, సిమెంట్‌తో నిర్మాణం చేసిన గడ్డర్లను ఏర్పాటు చేయాల్సి ఉంది. శనివారం రెండు భారీ క్రేన్‌ల సహాయంతో 43 మీటర్ల పొడవైన గడ్డర్లు ఏర్పాటు చేస్తున్నారు. ఈ క్రమంలో సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో క్రేన్‌కు అమర్చిన ఇరన్‌రోప్‌లు జారడంతో వందల టన్నుల బరువైన సిమెంట్, ఐరన్‌తో నిర్మించిన గడ్డర్ నేలకొరిగింది. భారీ శబ్దంతో గడ్డర్ నేలకొరగడంతో నిత్యం రద్దీగా ఉండే జాతీయ రహదారిపై వాహనదారులు ఒక్కసారిగా ఉలికిపాటుకు గురయ్యారు. పిల్లర్లపై గడ్డర్‌ను అమర్చేందుకు అప్పటికే ట్రాఫిక్‌ను మళ్లించిన నేపథ్యంలో పెనుముప్పు తప్పినట్‌లైంది. కూలిన గడ్డర్ జేసీబీకు సంబంధించిన ట్రాలీపై పడి పోయింది. అదృష్టవశాత్తు ప్రమాదం జరిగిన సమయంలో కింద ఎవరూ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది. గడ్డర్ శిథిలాలను గ్యాస్ కట్టర్లు, క్రేన్ల సహాయంతో రోడ్డు కాంట్రాక్టు సంస్థకు చెందిన సిబ్బంది తొలగిస్తున్నారు.
రోడ్డు నిర్మాణ పనుల్లో
నేలకొరిగిన భారీ గడ్డర్


