ఏప్రిల్ 2తో ముగియనున్న సర్పంచ్‌ల పదవీకాలం గత సెప్టెంబర్‌లో ప్రీ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసిన కమిషన్ స్థానిక ఎన్నికల నిర్వహణపై ఎటూ తేల్చని చంద్రబాబు ప్రభుత్వం జూన్ తర్వాతే పంచాయతీ ఎన్నికలకు అవకాశాలు అప్పటి వరకు ప్రత్యేక అధికారుల చేతిలోకి వెళ్లనున్న పల్లెపాలన అధికారుల నియామకానికి కసరత్తు చేస్తున్న యంత్రాంగం
ప్రత్యేకాధికారుల జాబితాపై కసరత్తు...
పంచాయతీ ఎన్నికల నిర్వహణపై చంద్రబాబు సర్కారు మల్లగుల్లాలు
గ్రామ పంచాయతీల్లో త్వరలో ప్రత్యేకాధికారుల పాలన అమలు కానుంది. సర్పంచుల పదవీకాలం ఏప్రిల్ 2వ తేదీతో ముగియనుంది. నిబంధనల ప్రకారం ఆలోగా ఎన్నికలు నిర్వహించాలి. ఎన్నికల కమిషన్ గత ఏడాది సెప్టెంబర్‌లో ప్రీ షెడ్యూల్‌ను కూడా విడుదల చేసింది. కానీ సాంకేతిక, పాలనపరమైన కారణాలతోపాటు ప్రజల్లో ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత కూడా ఎన్నికల వాయిదాకు కారణంగా భావిస్తున్నారు.
సత్తెనపల్లి: వాస్తవానికి ప్రీ ఎన్నికల షెడ్యూలు ప్రకారం అక్టోబర్ 15వ తేదీలోగా వార్డుల పునర్విభజన, రిజర్వేషన్ల ప్రక్రియ, అక్టోబర్ 16 నుంచి నవంబర్ 15వ తేదీలోగా వార్డుల వారీగా ఓటర్ల జాబితాలు రూపొందించాలి. నవంబర్ 1 నుంచి 15వ తేదీలోగా ఎన్నికల అధికారుల నియామకం, డిసెంబర్ 16 నుంచి 30వ తేదీలోగా పోలింగ్ కేంద్రాల ఖరారు కావాలి. డిసెంబర్ 15వ తేదీలోగా రిజర్వేషన్ల ఖరారు, జనవరిలో ఎన్నికల నిర్వహణకు నోటిఫికేషన్ జారీ చేయాలని ప్రాథమికంగా నిర్ణయించారు. కానీ ఎక్కడా ఆ మేరకు చర్యలు తీసుకున్న ఆనవాళ్లు కనిపించడం లేదు. చంద్రబాబు ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలను మూడు నెలల ముందుగానే నిర్వహించేస్తుందంటూ గత ఏడాది పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అందుకు అనుగుణంగా ఎన్నడూ లేని విధంగా ముందస్తుగానే స్థానిక సమరానికి చంద్రబాబు సన్నద్ధం అవుతున్నారన్నట్లుగా హడావుడి చేశారు. జనవరిలోనే ఎన్నికలు నిర్వహించేస్తున్నారంటూ ప్రచారం జరిగింది. దీనిపై అధికారికంగా ముఖ్యమంత్రిగానీ, ఉప ముఖ్యమంత్రిగానీ, ప్రభుత్వం గానీ ఎటువంటి ప్రకటన చేయలేదు. ప్రత్యేకాధికారుల పాలన తప్పని పరిస్ధితి నెలకొంది. బీసీ రిజర్వేషన్ల ఖరారు, డెడికేటెడ్ కమిషన్ నివేదిక వంటి సాంకేతిక, న్యాయపరమైన అంశాల కారణంగా పంచాయతీ ఎన్నికలు ఆలస్యం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఆలస్యానికి ప్రధాన కారణాలు...
జిల్లాలో 529 గ్రామపంచాయతీలు ఉన్నాయి. ఆయా పంచాయతీల్లో ఎంపీడీవోలు, ఈఓపీఆర్‌డీలు, తహసీల్దార్లు, ఇతర మండల స్థాయి అధికారులను ప్రత్యేకాధికారులుగా నియమించే అవకాశం ఉంది. అధికారులు కొరత ఉన్న ప్రాంతాల్లో ఒక అధికారికి రెండు, మూడు పంచాయతీల బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందని సమాచారం.
పంచాయతీ ఎన్నికలు నిర్వహణకు ముందు బీసీ రిజర్వేషన్ల అంశం కొలిక్కి రావాల్సి ఉంది. స్థానిక సంస్థల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని చంద్రబాబు ప్రభుత్వం హామీ ఇచ్చింది. సుప్రీంకోర్టు మార్గదర్శకాలు ప్రకారం (ట్రిపుల్ టెస్ట్) రిజర్వేషన్ల అమలకు ఏకసభ్య డెడికేటెడ్ కమిషన్‌ను నియమించింది. ఈ కమిషన్ 45 రోజుల్లో నివేదిక ఇవ్వాల్సి ఉంది. అనంతరం రిజర్వేషన్ల ఖరారు ప్రక్రియ ప్రారంభించడానికి మరో రెండు నెలలు పట్టొచ్చు ఇక రాష్ట్ర ఎన్నికల కమిషనర్ మారనున్నారు. ఇవన్నీ పూర్తయ్యేసరికి ఎన్నికలు జూన్ తర్వాతే జరిగే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇక కూటమిలోని నాయకులు, కార్యకర్తలను సంతృప్తి పరిచేందుకు చంద్రబాబు ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఎన్నికలు జరిగితే అందర్నీ సంతృప్తి పరచలేమని భావించి వాయిదా వేసిందని అంటున్నారు. మరోవైపు ప్రజల్లో అసంతృప్తిని సైతం అంచనా వేసి, ఎన్నికల నిర్వహణకు వాయిదా వేస్తోందని వాదనలు కూడా వస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడంతో ఎక్కడ వ్యతిరేకత వస్తుందోనని చంద్రబాబు సర్కారు వెనుకడుగు వేస్తున్నట్లు భావిస్తున్నారు.
గ్రామపంచాయతీలకు ప్రత్యేకాధికారులను నియమించేందుకు జిల్లా అధికారులు ఇప్పటికే జాబితా సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. తహసీల్దారులు, మండల పరిషత్ అధికారులు, పంచాయతీరాజ్ సహాయ ఇంజినీర్లు, మండల విద్యాశాఖ అధికారులు, వ్యవసాయ అధికారులు, పశువైద్యాధికారులు, ఉద్యాన శాఖ అధికారులు, ఉప తహసీల్దార్ల పేర్లను పరిశీలిస్తున్నారు. ప్రత్యేకాధికారులుగా గెజిటెడ్ అధికారులనే నియమించాలని ప్రభుత్వం స్పష్టం చేయడంతో కింది స్థాయి అధికారుల పేర్లను జాబితా నుంచి తొలగించినట్లు సమాచారం. అధికారుల కొరత ఏర్పడితే చిన్న పంచాయతీల్లో రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌లు, మండల పరిషత్ సూపరింటెండెంట్లు, సీనియర్ అసిస్టెంట్లను ప్రత్యేకాధికారులుగా నియమించే అవకాశం ఉంది. మండల కేంద్రాలకు జిల్లాస్థాయి అధికారులను, ప్రధాన గ్రామ పంచాయతీలకు తమసీల్దార్లను, ఎక్కువ జనాభా గల పంచాయతీలకు ఎంపీడీవోలను ప్రత్యేక అధికారులుగా నియమించే ప్రతిపాదనలు ఉన్నాయి. అవసరమైతే ఒక అధికారికి రెండు లేదా మూడు పంచాయతీల బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందని తెలుస్తోంది.


