చందోలు(కర్లపాలెం): చందోలు గ్రామంలో కొలువై ఉన్న బగళాముఖి అమ్మవారు ఆదివారం ఆది మహాశక్తి అలంకరణలో పూజలు అందుకున్నారు. భక్తులు అధిక సంఖ్యలో అమ్మవారి ఆలయానికి విచ్చేసి ప్రదక్షిణలు చేసి పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు అమ్మవారికి అర్చనలు, విశేష పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులు అమ్మవారి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. భక్తులు అధిక సంఖ్యలో రావటంతో ఆలయం వద్ద సందడి నెలకొంది.
పెదకాకాని: బాజీబాబా దర్గా ఉరుసు మహోత్సవం ఈనెల 19, 20 తేదీలలో ఘనంగా నిర్వహించనున్నట్లు దర్గా ఈఓ షేక్ ఖాజా మస్తాన్ తెలిపారు. గుంటూరు జిల్లా పెదకాకాని హజరత్ సయ్యద్ బాజీ షహీద్ అవులియా దర్గా 538వ ఉరుసు మహోత్సవం పురస్కరించుకుని ఆదివారం బాజీబాబా దర్గాలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈఓ మాట్లాడుతూ రాష్ట్ర వక్ఫ్‌బోర్డు ఆధ్వర్యంలో నిర్వహించే ఉరుసు మహోత్సవంలో భక్తులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. నిర్వహణకు రాష్ట్ర వక్ఫ్‌బోర్డు రూ.17.50 లక్షల నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు. వేలాదిగా తరలివచ్చే భక్తుల సౌకర్యార్థం తాగునీరు, టెంట్లు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. పారిశుధ్యంపై ప్రత్యేక చర్యలు చేపట్టామన్నారు. ఇప్పటికే ఉరుసు నిర్వహణకు వక్ఫ్ బోర్డు సూపరిండెంట్‌లు, సీనియర్ అధికారులతో కమిటీ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. 19వ తేదీ సాయంత్రం చాందిని అలంకరణ, రాత్రి 10 గంటలకు పెదకాకాని ముస్లింపాలెం జెండా చెట్టు నుంచి వైభవంగా ఉరుసు మహోత్సవం ప్రారంభం అవుతుందన్నారు. 20వ తేదీ దీపారాధన, గంధం పంపిణీ, ఖురాన్ పఠనం, సలామి ప్రార్థనలు జరుగుతాయన్నారు. 19వ తేదీ రాత్రి ఉరుసు మహోత్సవం సందర్భంగా భక్తులందరికీ ఉచిత అన్నసంతర్పణ కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అనంతరం స్థానిక టీడీపీ నాయకులతో కలసి దర్గాలో ఉరుసు మహోత్సవ వాల్‌పోస్టర్ ఆవిష్కరించారు.
దుగ్గిరాల: దుగ్గిరాల రైలుపేటలోని పసుపు యార్డు సమీపంలోని వేంకటేశ్వర స్వామి జన్మనక్షత్రం శ్రవణా నక్షత్రం పురస్కరించుకొని ఆదివారం కల్యాణం నిర్వహించారు. స్వామి వారికి విశ్వక్సేన పూజ, శాంతి హోమంతో వేడుకలు ప్రారంభించారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామి వారి కల్యాణం కనులారా తిలకించారు. అనంతరం భక్తులు తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. మధ్యాహ్నం అన్నప్రసాద వితరణ చేశారు. కల్యాణం ఏర్పాట్లను ఆలయ కమిటీ పర్యవేక్షించింది.


