పాము కాటుకు గురై వివాహిత మృతి | - | Sakshi
Sakshi News home page

పాము కాటుకు గురై వివాహిత మృతి

Mar 10 2026 12:44 PM | Updated on Mar 10 2026 12:44 PM

పాము కాటుకు గురై వివాహిత మృతి ఈపూరు(శావల్యాపురం): మండలంలోని కొచ్చర్ల తండాకు చెందిన వివాహిత పాము కాటుకు గురై మృతి చెందిన సంఘటన సోమవారం చోటుచేసుకుంది. ఎస్‌ఐ వేణుగోపాల్‌రావు తెలిపిన వివరాల మేరకు మొక్కజొన్న పంటకు నీరు పెట్టేందుకు తన భర్తకు వ్యవసాయ పనుల్లో సహాయంగా మేరా జ్యోతుపద్మాబాయి (35) వెళ్లిది. ఈక్రమంలో పాముకాటుకు గురైంది. వినుకొండ ప్రభుత్వ వైద్యశాలకు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించినట్లు ఎస్‌ఐ తెలిపారు. మృతురాలికు ఇద్దరు పిల్లలు ఉన్నారు. శవపంచానామా అనంతరం బాధిత కుటుంబ సభ్యులకు మృతదేహాన్ని అప్పగిస్తామన్నారు. విషాదాంతం.. ఆ తాపీ మేస్త్రి జీవితం చిలకలూరిపేట: అనురాగాల పందిరి నుంచి అనాథగా యాచకత్వం వైపు మళ్లిన ఒక అభాగ్యుడి జీవితం, రావిచెట్టు నీడన విషాదాంతమైంది. నాదెండ్ల మండలం గణపవరం గ్రామానికి చెందిన కటారు లక్ష్మీనారాయణ ప్రకాశం జిల్లా మిట్టపాలెంకు చెందిన ధనలక్ష్మితో 18 ఏళ్ల కిందట వివాహమైంది. ఆరేళ్ల పాటు అన్యోన్యంగా సాగిన వారి సంసారంలో ఏదో తెలియని అలజడి రేగింది. భార్యాపిల్లలను వదిలి స్వగ్రామం చేరుకున్న లక్ష్మీనారాయణ, తల్లి కశమ్మ వద్ద ఉంటూ తాపీ పనులు చేసుకునేవాడు. అయితే కాలక్రమేణా మానసిక స్థితి క్షీణించడంతో కన్నతల్లికి కూడా దూరమై చిలకలూరిపేట వీధుల్లో యాచకుడిగా మారిపోయాడు. సోమవారం స్థానిక అడ్డరోడ్డు సెంటర్‌లోని కల్యాణి బార్‌ ఎదురుగా ఉన్న రావిచెట్టు నీడనే ఆయన అనాథలా మృతి చెందాడు. నిర్జీవంగా పడి ఉన్న లక్ష్మీనారాయణ(38)ను చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆసుపత్రికి తరలించారు. వినాయకుడి విగ్రహం ధ్వంసం

కరికల్లు: గుర్తుతెలియని దుండగులు వినాయకస్వామి రాతి విగ్రహాన్ని ధ్వంసం చేశారు. మండలంలోని రూపెనగుంట్ల గ్రామంలో సోమవారం తెల్లవారుజామున జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్థానికులు తెలిపిన వివరాలు ఇలాఉన్నాయి. రూపెనగుంట్ల గ్రామం శివారులో పొలాల మధ్యన వినాయకస్వామి ఆలయం ఉంది. కాగా గుర్తుతెలియని దుండగులు రాత్రివేళ విగ్రహాన్ని ఆలయం వెనుకభాగంలోని తీసుకెళ్లి ధ్వంసం చేశారు. విగ్రహం గుర్తించిన ప్రాంతంలో గోతాలు, మంటలు వేసిన ఆనవాళ్లు కన్పిస్తున్నాయి. దీంతో పురాతన ఆలయం కావడంతో నిధులు నిక్షేపాల కోసం అత్యాశపరులు ఇలాంటి దుశ్చర్యకు పాల్పడి ఉంటారని స్థానికులు భావిస్తున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు గ్రామస్తులు సన్నద్ధమవుతున్నట్లు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement