కూలిన ఐఏఎఫ్‌ విమానం.. ఐదుగురి మృతి | Five Indian air force staff killed as transport plane crashes in Assam | Sakshi
Sakshi News home page

కూలిన ఐఏఎఫ్‌ విమానం.. ఐదుగురి మృతి

Jun 14 2026 4:22 AM | Updated on Jun 14 2026 4:23 AM

Five Indian air force staff killed as transport plane crashes in Assam

ఘటనాస్థలిలో విమాన శకలాల వద్ద ఐఏఎఫ్‌ అధికారులు

గువాహటి: భారతీయ వాయుసేన రవాణా విమానం ఒకటి శనివారం అసోంలోని జోర్హాట్‌ జిల్లాలో కూలినట్లు రక్షణ శాఖ అధికార ప్రతినిధి ప్రకటించారు. నలభై మూడవ స్క్వాడ్రన్‌కు చెందిన ఏఎన్‌–32 విమానం రౌరియా ప్రాంతంలోని ఐఏఎఫ్‌ బేస్‌ వద్ద ల్యాండ్‌ అవుతూండగా కూలిపోయింది. ఈ ఘటనలో ఐదుగురు వాయుసేన సిబ్బంది మరణించినట్లు వాయుసేన ఒక ప్రకటనలో తెలిపింది. మరణించిన వారిని స్వా్కడ్రన్‌ లీడర్‌ ప్రశాంత్‌ సింగ్, ఫ్లైట్‌ లెఫ్టినెంట్‌ శుభమ్‌కుమార్, సార్జెంట్‌ జితేంద్ర శర్మ, అగ్నివీర్‌ వాయు ఖేమారామ్‌ కుమవత్, అగ్నివీర్‌ వాయు డానిష్‌ ఆలమ్‌లుగా గుర్తించారు.

మృతుల కుటుంబాలకు సంతాపం వ్యక్తం చేసిన వాయుసేన ఈ కష్టకాలంలో వారికి అండగా ఉంటామని తెలిపింది. ఈ ఘటన నేపథ్యంలో వాయుసేన కేంద్రం మొత్తాన్ని సీల్‌ చేశారని, ఎవరినీ లోనికి అనుమతించడం లేదని వాయుసేన అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు. ప్రమాద కారణాలను గుర్తించేందుకు వాయుసేన కోర్ట్‌ ఆఫ్‌ ఎంక్వైరి ఒకదాన్ని ఏర్పాటు చేసినట్లు సమాచారం. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం భారీ శబ్ధం తరువాత ఆ ప్రాంతం నుంచి పెద్ద ఎత్తున పొగలు వెలువడ్డాయి. మంటలార్పేందుకు అగ్నిమాపక వాహనాలతోపాటు అంబులెన్స్‌లు వెళుతూ కనిపించాయని స్థానికులు తెలిపారు. ఈ ఘటనలో కోపైలెట్‌ ఒకరు కొద్దిపాటి గాయాలతో బయటపడినట్లు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలిసింది. 

వానలా... సాంకేతిక లోపమా? 
ఏఎన్‌–32 రవాణా విమానం ప్రమాదానికి గురికావడం వెనుక ఉన్న కారణాలను వాయుసేన విశ్లేషిస్తోంది. అయితే జోర్హాట్‌ ప్రాంతంలో శనివారం ఉదయం వర్షాలు జోరుగా పడుతున్నాయి. మేఘాలు కూడా చాలా దిగువన ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో వర్షం కారణంగానే విమానం కూలిందా? లేక ఏదైనా సాంకేతిక లోపం తలెత్తిందా? అన్న ప్రశ్నలు వస్తున్నాయి. వర్షం ప్రభావం వల్ల స్పేటియల్‌ డిస్‌ఓరియెంటేషన్‌ జరిగి ఉండవచ్చునని లేదా సంకేతికపరమైన సమస్య, వాతావరణ సమస్య కారణం కావచ్చునని కొందరు నిపుణులు అంచనా వేస్తున్నారు.

సోవియట్‌ యూనియన్‌ కాలం నాటి ఏఎన్‌–32ను భారతీయ వాయుసేన సుమారు 40 ఏళ్లుగా సరుకులు, సిబ్బంది రవాణా కోసం ఉపయోగిస్తోంది. గతంలో అంటే 1986లో (డీమాపూర్, నాగాలాండ్‌), 2009 (అరుణాచల్‌ ప్రదేశ్‌), 2016 (తాంబరం నుంచి పోర్ట్‌బ్లెయిర్‌కు వెళుతూండగా బంగాళాఖాతంలో, 2019 (అరుణాచల్‌ ప్రదేశ్‌) లోనూ ఏఎన్‌–32 విమానాలు కూలిపోయాయి. ఈ ఘటనల్లో మొత్తం 68 మంది ప్రాణాలు కోల్పోయారు. పాతబడ్డ, తరచూ ప్రమాదాలకు గురవుతున్న ఈ ఏఎన్‌–32 విమానాల స్థానంలో దశల వారీగా ఎయిర్‌బస్‌ సీ–295 విమానాలను వినియోగించేందుకు వాయుసేన ప్రయత్నిస్తోంది.  

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement