మూడు కీలక నౌకలను రేపు నేవీలో ప్రవేశపెట్టనున్న ప్రధాని మోదీ
సముద్ర పోరాటం, హైడ్రోగ్రాఫిక్ సర్వే, జలాంతర్గామి వ్యతిరేక యుద్ధం కోసం నిర్మాణం
కోల్‌కతా: స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించిన మూడు కీలక నౌకలను ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం భారత నౌకా దళంలోకి లాంఛనంగా ప్రవేశపెట్టనున్నారని అధికార వర్గాలు తెలియజేశాయి. పశ్చిమ బెంగాల్‌లోని శ్యామప్రసాద్ ముఖర్జీ ఓడరేవులో ఈ కార్యక్రమం జరుగుతుందని శుక్రవారం ఒక ప్రకటనలో వెల్లడించాయి. సముద్ర పోరాటం, హైడ్రోగ్రాఫిక్ సర్వే, జలాంతర్గామి వ్యతిరేక యుద్ధం వంటి కార్యాచరణల కోసం ఈ నౌకలను నిర్మించినట్లు తెలిపాయి.
ఈ మూడు నౌకలకు దునగిరి, సంశోధక్, అగ్రయ్ అని పేరుపెట్టారు. భారత నావికాదళానికి చెందిన వార్íÙప్ డిజైన్ బ్యూరో వీటిని డిజైన్ చేసింది. కోల్‌కతాలోని రక్షణ రంగ సంస్థ గార్డెన్ రీచ్ షిప్‌బిల్డర్స్, ఇంజనీర్స్(జీఆర్‌ఎస్‌ఈ) లిమిటెడ్ నిర్మించింది. దునగిరి నౌకలో అత్యాధునిక ఆయుధాలు, సెన్సార్లు అమర్చారు. ఇందులో బ్రిహ్మోస్ క్షిపణులు కూడా ఉన్నాయి. ఈ నౌకతో భారత నౌకాదళం పోరాట సామర్థ్యం గణనీయంగా పెరుగుతుందని అంటున్నారు.
సంశోధక్ అనే సర్వే నౌకను తీరప్రాంత, లోతైన నీటి హైడ్రోగ్రాఫిక్ సర్వేల కోసం, సముద్ర శాస్త్ర, భూ¿ౌతిక డేటాను సేకరించడానికి రూపొందించారు. ఇక అగ్రయ్ అనేది అర్నాల తరగతికి చెందిన ఒక జలాంతర్గామి వ్యతిరేక యుద్ధ నౌక. తీరప్రాంత జలాల్లో నీటి అడుగున ఉన్న ముప్పును గుర్తించి, ఎదుర్కోవడానికి తేలికపాటి టార్పెడోలు, స్వదేశీ రాకెట్ లాంచర్లు, జల సోనార్ వ్యవస్థలు అమర్చారు. ఈ మూడు నౌకల్లో 75 శాతానికి పైగా స్వదేశీ కంటెంట్ ఉందని, వీటి నిర్మాణంలో 200కు పైగా ఎంఎస్‌ఎంఈలు పాలుపంచుకున్నాయని అధికార వర్గాలు చెప్పాయి.
నేడు, రేపు ఒడిశా, బెంగాల్‌లో మోదీ పర్యటన
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ శనివారం, ఆదివారం ఒడిశా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో పర్యటించబోతున్నారు. పలు అభివృద్ధి ప్రాజెక్టులను ఆయన ప్రారంభిస్తారు. మరికొన్నింటికి శంకుస్థాపన చేస్తారు. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద రైతుల ఖాతాల్లో 23వ విడత నిధులు జమచేస్తారు. దేశవ్యాప్తంగా 9.44 కోట్లమంది బ్యాంకు ఖాతాల్లోకి 18,800 కోట్లు బదిలీ చేయబోతున్నారు.
శనివారం ఒడిశా రాష్ట్రంలో మయూర్‌భంజ్‌లోని పవిత్ర క్షేత్రాలైన సంథాలి జహెరా, హో జహెరాలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో కలిసి ప్రార్థనల్లో పాల్గొంటారు. అలాగే బెంగాల్‌లోని హూగ్లీ జిల్లాలో ‘పశ్చిమ బంగ దివస్’వేడుకలకు హాజరవుతారు. ఆదివారం ఉదయం కోల్‌కతాలో 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవంలో పాల్గొంటారు. ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. అనంతరం పలు వ్యవసాయ రంగానికి సంబంధించి ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన, నేషనల్ మిషన్ ఆన్ నేచురల్ ఫామింగ్, ప్రధానమంత్రి ధన్–ధాన్య కృషి యోజనను ప్రారంభిస్తారు.


