ఆర్జేడీ అధినేత తేజశ్వీ యాదవ్‌తో రేఖా గుప్తా
పట్నా: బిహార్ రాజకీయాల్లో ప్రతిష్ఠాత్మకంగా భావించిన బాంకీపూర్ అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నికలో ప్రధాన ప్రతిపక్షం రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జేడీ)కి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ అభ్యర్థి రేఖ గుప్తా డిపాజిట్ కోల్పోయారు. ఆమె కేవలం 14,273 ఓట్లు (10.95 శాతం) మాత్రమే సాధించి మూడో స్థానానికి పరిమితమయ్యారు.
ఈ ఉపఎన్నికలో జన్ సురాజ్ పార్టీ (జేఎస్‌పీ) వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిశోర్ 19324 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. ఆయనకు 64151 ఓట్లు (49.23 శాతం) రాగా, రెండో స్థానంలో నిలిచిన బీజేపీ అభ్యర్థి నీరజ్ కుమార్ 44827 ఓట్లు (3434 శాతం) దక్కించుకున్నారు. సుదీర్ఘ కాలంగా బీజేపీకి కంచుకోటగా ఉన్న బాంకీపూర్‌లో విజయాన్ని నమోదు చేసి రాజకీయ సమీకరణాలను మార్చేశారు ప్రశాంత్ కిశోర్. అదే సమయంలో ఆర్జేడీని మూడో స్థానానికి నెట్టేశారు.
2025 అసెంబ్లీ ఎన్నికల్లో రేఖా గుప్తా 46,363 ఓట్లు సాధించి రెండో స్థానంలో నిలిచారు. అయితే తాజా ఉపఎన్నికలో ఆమె ఓట్ల సంఖ్య భారీగా తగ్గి 14,273కు పరిమితమవడం ఆర్జేడీకి ఆందోళన కలిగిస్తోంది. ఈ ఫలితం ఆ పార్టీకి బాంకీపూర్‌లో ప్రజా మద్దతు గణనీయంగా తగ్గిందనే సంకేతాలను ఇస్తోంది.
తాజా ఉపఎన్నికలో మొత్తం 1,30,313 ఓట్లు పోలయ్యాయి. ఎన్నికల నిబంధనల ప్రకారం అభ్యర్థి తన డిపాజిట్‌ను నిలుపుకోవాలంటే మొత్తం పోలైన ఓట్లలో కనీసం ఆరో వంతు (16.67 శాతం) ఓట్లు పొందాలి. ఈ ఎన్నికలో డిపాజిట్‌ను కాపాడుకోవడానికి సుమారు 21,719 ఓట్లు అవసరం కాగా, రేఖా గుప్తాకు కేవలం 14,273 ఓట్లు మాత్రమే రావడంతో 7,446 ఓట్ల తేడాతో డిపాజిట్ కోల్పోయారు.
సంప్రదాయ ఓటు బ్యాంక్‌కు గండి
ఈ ఫలితం ఆర్జేడీ నాయకత్వానికి హెచ్చరికగా మారింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో రెండో స్థానంలో నిలిచిన పార్టీ, ఇప్పుడు మూడో స్థానానికి పడిపోవడంతో తమ సంప్రదాయ ఓటు బ్యాంకు ఎటు మళ్లిందనే అంశంపై సమీక్ష చేపట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది.
మరోవైపు, ప్రశాంత్ కిషోర్ విజయం బిహార్ రాజకీయాల్లో కొత్త పరిణామాలకు నాంది పలికింది. బీజేపీ ఆధిపత్యం ఉన్న స్థానాన్ని కైవసం చేసుకోవడం ద్వారా జన్ సురాజ్ పార్టీ రాష్ట్ర రాజకీయాల్లో బీజేపీ, ఆర్జేడీ వంటి ప్రధాన పార్టీలకు కొత్త సవాలుగా ఎదుగుతోందనే సంకేతాలను ఈ ఫలితం ఇచ్చింది.


