‘నన్ను నెట్టేసినా సరే.. ఇల్లు ఖాళీ చేయను’ | Rabri Devi Refuses To Vacate Government Bungalow In Bihar Amid Political Row, Check Out More Details Inside | Sakshi
Sakshi News home page

‘నన్ను నెట్టేసినా సరే.. ఇల్లు ఖాళీ చేయను’

May 31 2026 11:58 AM | Updated on May 31 2026 2:47 PM

 I Wont Vacate: Rabri Devi On Bihar Residence

పాట్నా: బీహార్‌లో ప్రభుత్వ బంగ్లా చుట్టూ వివాదం నెలకొంది. మాజీ ముఖ్యమంత్రి, ఆర్‌జేడీ నాయకురాలు రబ్రీ దేవి తాను ఉంటున్న నివాసాన్ని ఖాళీ చేయడానికి నిరాకరించారు. ప్రస్తుతం ఎన్‌డీఏ ప్రభుత్వంలోని ఒక మంత్రికి కేటాయించిన ఆ ఇంటిని వదిలి, మరో ఇంటికి మారేందుకు ఆమె ససేమిరా ఒప్పుకోవడం లేదు. రాజ్ భవన్, ముఖ్యమంత్రి నివాసానికి సమీపంలో ఉన్న '10, సర్క్యులర్ రోడ్' బంగ్లాను మత్స్యశాఖ మంత్రి నంద్ కిషోర్ రామ్‌కు కేటాయిస్తూ భవన నిర్మాణ శాఖ మే 27న ఉత్తర్వుల్లో జారీ చేసింది.

ఈ ఉత్తర్వులు జారీ అయినప్పుడు ఆమె నగరంలో లేరు. ఆమె విమానాశ్రయానికి చేరుకోగానే.. జర్నలిస్టులు ఈ విషయంపై మీడియా ప్రశ్నించడంతో ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సామ్రాట్ చౌదరి సీఎం అయినందుకు చాలా ఉత్సాహంగా ఉన్నట్లు కనిపిస్తోంది. ఆయన ప్రభుత్వం నన్ను బలవంతంగానైనా ఖాళీ చేయించమనండి. నేను మాత్రం ఈ ఇల్లు ఖాళీ చేయనంటూ ఆమె సమాధానమిచ్చారు. దశాబ్ద కాలంగా ఆమె ఉంటున్న ఈ బంగ్లాను, గతంలో జేడీయూ అధ్యక్షుడు నితీష్ కుమార్ నేతృత్వంలోని ప్రభుత్వం ఆమెకు మాజీ సీఎం హోదాలో కేటాయించిన సంగతి తెలిసిందే.

శాసనమండలి ప్రతిపక్ష నేతగా ఉన్న రబ్రీ దేవిని ఇల్లు ఖాళీ చేయాలని ప్రభుత్వం గతేడాది నవంబర్‌లోనే మొదటిసారి కోరింది. అప్పట్లో నితీష్ కుమారే ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆ సమయంలో భవన నిర్మాణ శాఖ జారీ చేసిన నోటిఫికేషన్‌లో... 10, సర్క్యులర్ రోడ్ బంగ్లాను అప్పటి ఉప ముఖ్యమంత్రి విజయ్ కుమార్ సిన్హాకు కేటాయిస్తున్నట్లు పేర్కొన్నారు. అయితే, సీనియర్ బీజేపీ నాయకుడైన సిన్హా ప్రస్తుతం క్యాబినెట్‌లో కొనసాగుతున్నప్పటికీ ఉప ముఖ్యమంత్రి హోదాను కోల్పోయారు. రబ్రీ దేవి ఆ బంగ్లాను వదిలిపెట్టేందుకు నిరాకరించారు.

తాజా వివాదంపై భవన నిర్మాణ శాఖ మంత్రి, సీనియర్ జేడీయూ నాయకురాలు లేశి సింగ్ మాట్లాడుతూ... శాసనమండలి ప్రతిపక్ష నేతకు '39, హార్డింజ్ రోడ్' బంగ్లాను కేటాయిస్తూ గతంలో ఇచ్చిన ఉత్తర్వులు ఇప్పటికీ అమలులోనే ఉన్నాయని చెప్పారు. కాబట్టి, రబ్రీ దేవి ఆ ఇంటికి మారడం మంచిదన్నారు. ఆమె గత ఉత్తర్వులను పాటించారా? అనే విషయంతో మాకు సంబంధం లేదు. కానీ, ప్రభుత్వ ప్రముఖులకు తగిన బంగ్లాలు కేటాయించడంలో ప్రభుత్వానికి పూర్తి అధికారం ఉంది. ఎవరూ కూడా నిర్దిష్ట బంగ్లాపై తమకు హక్కు ఉందని పట్టుబట్టలేరు. మాజీ సీఎంగా రబ్రీ దేవి ఈ విషయాన్ని అర్థం చేసుకుని, దానికి అనుగుణంగా నడుచుకుంటారని ఆశిస్తున్నామంటూ సింగ్ పేర్కొన్నారు.

1997లో తన భర్త తర్వాత ముఖ్యమంత్రి పదవి చేపట్టిన రబ్రీ దేవి.. ప్రస్తుతం ఆయనతో కలిసే ఈ బంగ్లాలో ఉంటున్నారు. వారి చిన్న కుమారుడు, ఆర్‌జేడీ వర్కింగ్ ప్రెసిడెంట్ తేజస్వి యాదవ్ అసెంబ్లీ ప్రతిపక్ష నేత హోదాలో 1 పోలో రోడ్ నివాసంలో ఉన్నప్పటికీ, ఎక్కువ సమయం ఈ '10, సర్క్యులర్ రోడ్' బంగ్లాలోనే గడుపుతుంటారు.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement