ముంబైలోని కేల్కర్ కళాశాలలో జరిగిన ఓ సాధారణ పుట్టినరోజు వేడుక సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ విద్యార్థులు చేసుకున్న ఈ వేడుక తమ సహ విద్యార్థి పుట్టినరోజుకి సంబంధించింది కాదు. కాంటీన్‌లో పని చేసే ఉద్యోగికి పుట్టినరోజు వేడుక నిర్వహించి విద్యార్థులు ఆశ్చర్యపరిచారు. ఆ విద్యార్థులకు సోషల్ మీడియాలో ప్రశంసలు వెల్లువెత్తాయి.
దయ చూపాలంటే పెద్ద పెద్ద పనులు చేయాల్సిన అవసరం లేదని, చిన్న మంచి పని చేసినా చాలని చాలామంది కామెంట్లు చేశారు. ఈ వీడియో చూసిన పూర్వ విద్యార్థులు కూడా కళాశాల కాంటీన్‌తో తమ జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో అజింక్య భుజ్‌బల్ అనే యూజర్ షేర్ చేశారు. "ఎక్కడికి వెళ్లినా ఆనందాన్ని పంచి వస్తాను" అని పేర్కొన్నారు.
వీడియోలో కేల్కర్ కళాశాల విద్యార్థులు కాంటీన్ భయ్యా చుట్టూ చేరి చప్పట్లు కొడుతూ "హ్యాపీ బర్త్‌డే" పాట పాడారు. ఊహించని ఈ వేడుక చూసి ఆయన ఆప్యాయంగా చిరునవ్వు చిందించారు. విద్యార్థుల ప్రేమాభిమానాలకు ఆయన భావోద్వేగానికి గురైనట్లు కనిపించారు.
వీడియోలో... "మా కాంటీన్ భయ్యా పుట్టినరోజు జరిపాం. #స్ప్రెడ్ లవ్ ఎఫ్‌టీ కేల్కరైట్స్" అని రాసి ఉంది. ఈ వీడియో కింద వచ్చిన కామెంట్లలో విద్యార్థుల ఆలోచనను చాలామంది ప్రశంసించారు. "అందరి ప్రేమను పొందిన వ్యక్తి.. అజాత శత్రువు" అని ఓ యూజర్ పేర్కొన్నారు. "భీమ్‌రాజ్ ఎంత ముద్దుగా ఉన్నాడు" అని మరో వ్యక్తి అనన్నారు. "ఈ కాంటీన్‌తో ఎన్నో జ్ఞాపకాలు ఉన్నాయి" అని ఇంకొకరు కామెంట్ చేశారు.


