అజేయంగా మన సముద్ర శక్తి | India Gets 3 New Indigenous Warships commissioned in Kolkata | Sakshi
Sakshi News home page

అజేయంగా మన సముద్ర శక్తి

Jun 22 2026 4:39 AM | Updated on Jun 22 2026 4:39 AM

India Gets 3 New Indigenous Warships commissioned in Kolkata

ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్య

దుణగిరి, సంశోధక్, అగ్రయ్‌ నౌకలను జాతికి అంకితమిచ్చిన మోదీ

కోల్‌కతా: ఒక దేశం ఆర్థిక, వ్యూహాత్మక ప్రభావానికి బలమైన నౌకాదళ సామర్థ్యమే నిర్ణయాత్మక అంశమని ప్రధాని మోదీ చెప్పారు. అందుకు అనుగుణంగానే భారత్‌ సన్నద్ధమవుతోందని వివరించారు. దేశీయ పరిజ్ఞానంతో నిర్మించిన మూడు కీలక యుద్ధనౌకలు ఐఎన్‌ఎస్‌ దుణగిరి, ఐఎన్‌ఎస్‌ సంశోధక్, ఐఎన్‌ఎస్‌ అగ్రయ్‌ని మోదీ ఆదివారం జాతికి అంకితం చేశారు. 

పశ్చిమ బెంగాల్‌ రాజధాని కోల్‌కతాలోని శ్యామప్రసాద్‌ ముఖర్జీ పోర్టులో జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. సముద్రయాన సామర్థ్యాలు కలిగిన దేశం శక్తివంతమైనదిగా, అధిక ఆర్థిక, వ్యూహాత్మక ప్రభావాన్ని కలిగి ఉంటుందని గుర్తుచేశారు. అజేయమైన సముద్ర శక్తిగా భారత్‌ వేగంగా ఎదుగుతోందని తెలిపారు. 

ఐన్‌ఎస్‌ దుణగిరి, ఐన్‌ఎస్‌ అగ్రయ్, ఐఎన్‌ఎస్‌ సంశోధక్‌ నౌకలు సముద్ర పోరాటం, హైడ్రోగ్రాఫిక్‌ సర్వేయింగ్, జలాంతర్గామి వ్యతిరేక యుద్ధంలో కీలక పాత్ర పోషిస్తాయని ప్రధాని మోదీ తెలిపారు. 2022లో ‘ఐఎన్‌ఎస్‌ విక్రాంత్‌’విమాన వాహక నౌకను ప్రారంభించడం ద్వారా భారత్‌ తన సముద్ర సామర్థ్యాలను ప్రపంచానికి చాటిచెప్పిందని అన్నారు. కొత్త నౌకలను మనదేశంలోనే డిజైన్‌ చేసి, నిర్మించామని, దేశ ప్రతిభకు నిదర్శనంగా నిలుస్తున్నాయని హర్షం వ్యక్తంచేశారు. 

ఉపాధి ఇంజిన్‌గా ‘మారిటైమ్‌’
లక్షలాది ఉద్యోగాలను సృష్టించే సామర్థ్యం మారిటైమ్‌ రంగానికి ఉందని, ‘అభివృద్ధి చెందిన భారత్‌’కు ఇది ఉపాధి ఇంజిన్‌గా పనిచేస్తుందని పేర్కొన్నారు. ఆధునిక నౌక నిర్మాణానికి వేల టన్నుల ఉక్కు, ఎలక్ట్రానిక్స్, యంత్ర పరికరాలు, విడిభాగాలు అవసరమవుతాయని, వీటి తయారీకి అనేక కంపెనీలు పనిచేస్తున్నాయని, తద్వారా వేలాది మంది యువతకు ఉపాధి లభిస్తోందని ప్రధానమంత్రి తెలియజేశారు.

కొత్త నౌకల విశేషాలు.. ఐఎన్‌ఎస్‌ దుణగిరి: ఇది అత్యాధునిక స్టెల్త్‌ యుద్ధ నౌక. బ్రహ్మోస్‌ క్షిపణులు, మధ్యశ్రేణి గగనతల క్షిపణి వ్యవస్థ, ఆయుధాలు, సెన్సర్లు ఇందులో అమర్చారు. దీని పొడవు 149 మీటర్లు. 2022 జూలై 15న జలప్రవేశం చేసింది. 

ఐఎన్‌ఎస్‌ సంశోధక్‌:  ఇది భారీ సర్వే నౌక. భారత తీర ప్రాంతాలు, లోతైన సముద్ర జలాల్లో హైడ్రోగ్రాఫిక్‌ సర్వేలు నిర్వహించడానికి ఈ నౌక సాయపడుతుంది. రక్షణ, పౌర అవసరాల కోసం సముద్ర గర్భ డేటాను సేకరించడానికి ఇది తోడ్పడుతుంది. దీని పొడవు 110 మీటర్లు. 2023 జూన్‌ 13వ తేదీన తొలిసారిగా జలప్రవేశం చేసింది. విపత్కర పరిస్థితుల్లో సహాయ చర్యలకు, మానవీయ సాయం పంపిణీ, రక్షణ చర్యలు చేపట్టేందుకు వీలుగా సంశోధక్‌ను నిర్మించారు.

ఐఎన్‌ఎస్‌ అగ్రయ్‌:ఇది అర్నాల తరగతికి 
చెందిన జలాంతర్గామి విధ్వంసక నౌక. తీరప్రాంత జలాల్లో శత్రు దేశాల జలాంతర్గాములను గుర్తించి, నాశనం చేయగలదు. తేలికపాటి టార్పెడోలు, స్వదేశీ రాకెట్‌ లాంచర్లు, అత్యాధునిక సోనార్‌ వ్యవస్థలు ఇందులో ఉన్నాయి. 77.6 మీటర్ల పొడవు ఉంటుంది. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement