breaking news
Indian Naval Ships
-
అజేయంగా మన సముద్ర శక్తి
కోల్‌కతా: ఒక దేశం ఆర్థిక, వ్యూహాత్మక ప్రభావానికి బలమైన నౌకాదళ సామర్థ్యమే నిర్ణయాత్మక అంశమని ప్రధాని మోదీ చెప్పారు. అందుకు అనుగుణంగానే భారత్ సన్నద్ధమవుతోందని వివరించారు. దేశీయ పరిజ్ఞానంతో నిర్మించిన మూడు కీలక యుద్ధనౌకలు ఐఎన్ఎస్ దుణగిరి, ఐఎన్ఎస్ సంశోధక్, ఐఎన్ఎస్ అగ్రయ్ని మోదీ ఆదివారం జాతికి అంకితం చేశారు. పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలోని శ్యామప్రసాద్ ముఖర్జీ పోర్టులో జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. సముద్రయాన సామర్థ్యాలు కలిగిన దేశం శక్తివంతమైనదిగా, అధిక ఆర్థిక, వ్యూహాత్మక ప్రభావాన్ని కలిగి ఉంటుందని గుర్తుచేశారు. అజేయమైన సముద్ర శక్తిగా భారత్ వేగంగా ఎదుగుతోందని తెలిపారు. ఐన్ఎస్ దుణగిరి, ఐన్ఎస్ అగ్రయ్, ఐఎన్ఎస్ సంశోధక్ నౌకలు సముద్ర పోరాటం, హైడ్రోగ్రాఫిక్ సర్వేయింగ్, జలాంతర్గామి వ్యతిరేక యుద్ధంలో కీలక పాత్ర పోషిస్తాయని ప్రధాని మోదీ తెలిపారు. 2022లో ‘ఐఎన్ఎస్ విక్రాంత్’విమాన వాహక నౌకను ప్రారంభించడం ద్వారా భారత్ తన సముద్ర సామర్థ్యాలను ప్రపంచానికి చాటిచెప్పిందని అన్నారు. కొత్త నౌకలను మనదేశంలోనే డిజైన్ చేసి, నిర్మించామని, దేశ ప్రతిభకు నిదర్శనంగా నిలుస్తున్నాయని హర్షం వ్యక్తంచేశారు. ఉపాధి ఇంజిన్‌గా ‘మారిటైమ్’లక్షలాది ఉద్యోగాలను సృష్టించే సామర్థ్యం మారిటైమ్ రంగానికి ఉందని, ‘అభివృద్ధి చెందిన భారత్’కు ఇది ఉపాధి ఇంజిన్‌గా పనిచేస్తుందని పేర్కొన్నారు. ఆధునిక నౌక నిర్మాణానికి వేల టన్నుల ఉక్కు, ఎలక్ట్రానిక్స్, యంత్ర పరికరాలు, విడిభాగాలు అవసరమవుతాయని, వీటి తయారీకి అనేక కంపెనీలు పనిచేస్తున్నాయని, తద్వారా వేలాది మంది యువతకు ఉపాధి లభిస్తోందని ప్రధానమంత్రి తెలియజేశారు.కొత్త నౌకల విశేషాలు.. ఐఎన్ఎస్ దుణగిరి: ఇది అత్యాధునిక స్టెల్త్ యుద్ధ నౌక. బ్రహ్మోస్ క్షిపణులు, మధ్యశ్రేణి గగనతల క్షిపణి వ్యవస్థ, ఆయుధాలు, సెన్సర్లు ఇందులో అమర్చారు. దీని పొడవు 149 మీటర్లు. 2022 జూలై 15న జలప్రవేశం చేసింది. ఐఎన్ఎస్ సంశోధక్: ఇది భారీ సర్వే నౌక. భారత తీర ప్రాంతాలు, లోతైన సముద్ర జలాల్లో హైడ్రోగ్రాఫిక్ సర్వేలు నిర్వహించడానికి ఈ నౌక సాయపడుతుంది. రక్షణ, పౌర అవసరాల కోసం సముద్ర గర్భ డేటాను సేకరించడానికి ఇది తోడ్పడుతుంది. దీని పొడవు 110 మీటర్లు. 2023 జూన్ 13వ తేదీన తొలిసారిగా జలప్రవేశం చేసింది. విపత్కర పరిస్థితుల్లో సహాయ చర్యలకు, మానవీయ సాయం పంపిణీ, రక్షణ చర్యలు చేపట్టేందుకు వీలుగా సంశోధక్‌ను నిర్మించారు.ఐఎన్ఎస్ అగ్రయ్:ఇది అర్నాల తరగతికి చెందిన జలాంతర్గామి విధ్వంసక నౌక. తీరప్రాంత జలాల్లో శత్రు దేశాల జలాంతర్గాములను గుర్తించి, నాశనం చేయగలదు. తేలికపాటి టార్పెడోలు, స్వదేశీ రాకెట్ లాంచర్లు, అత్యాధునిక సోనార్ వ్యవస్థలు ఇందులో ఉన్నాయి. 77.6 మీటర్ల పొడవు ఉంటుంది. -
చైనా చేరిన భారత యుద్ధ నౌకలు
పెదవాల్తేరు(విశాఖతూర్పు): చైనాలో జరుగనున్న అంతర్జాతీయ ఫ్లీట్ రివ్యూలో పాల్గొనేందుకు భారత్‌కు చెందిన నౌకలు తరలి వెళ్లాయి. భారతీయ నావికాదళానికి చెందిన కోల్‌కతా, శక్తి నౌకలు చైనాలోని క్వింగ్డాయో నగరంలోకి సోమవారం ప్రవేశించాయి. చైనా నేవీ పీఎల్ఏ 70వ వార్షికోత్సవాలను పురస్కరించుకుని అంతర్జాతీయ ఫ్లీట్‌రివ్యూ తలపెట్టారు. భారతీయ నౌకలకు చెందిన సిబ్బంది చైనాలో 21 తుపాకులతో సెల్యూట్ నిర్వహించారు. భారతీయ నౌకలకు స్వాగత కార్యక్రమంలో భాగంగా చైనా నేవీ పీఎల్ఏ సిబ్బంది నేవీ బ్యాండుతో సాదర స్వాగతం పలికారు. కాగా, భారతీయ నౌకలు చైనాలో అంతర్జాతీయ ఫ్లీట్‌రివ్యూలో గతంలో 2009, 2014 సంవత్సరాల్లోనూ పాల్గొన్నాయి. భారత్–చైనా మధ్య గల సౌభ్రాతృత్వ స్నేహానికి వారధిగా ఇరు దేశాల నేవీలు పరస్పర సహకారంలో భాగంగానే భారతీయ నౌకలు అంతర్జాతీయ ఫ్లీట్‌రివ్యూలో పాల్గొంటున్నాయి. ఈనెల 23వ తేదీన భారతీయ నౌకలు నిర్వహించే పరేడ్‌ని చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ సమీక్షిస్తారు. పలు క్రీడా ఈవెంట్లలో భారతీయ నౌకాదళ సిబ్బంది పాల్గొంటారు. ఇంటర్నేషనల్ ఫ్లీట్‌రివ్యూలో చైనాలోని భారత్ రాయబారి విక్రమ్మిస్రి తదితర అధికారులు పాల్గొంటారు. మే 4వ తేదీన ఫ్లీట్‌రివ్యూ ప్రారంభోత్సవం కన్నుల పండువగా జరుగనుంది. భారతీయ నౌకలు చైనా ప్రయాణంలో భాగంగా వియత్నాంలోని కామ్రన్హ్బే పోర్టు మీదుగా చైనా చేరుకున్నాయి. అలాగే, ఈ నౌకలు తిరుగు ప్రయాణంలో భాగంగా పోర్టు బూషన్, దక్షిణ కొరియా, సింగపూర్ పోర్టుకు వెళతాయి. కేంద్ర ప్రభుత్వ యాక్ట్ ఈస్ట్ పాలసీలో భాగంగా తూర్పు, దక్షిణ ఆసియా దేశాలతో సాంస్కృతిక, ఆర్థిక, మేరీటైమ్ రంగాల్లో ఆయా దేశాలతో భారత్ సత్సంబంధాలు కొనసాగిస్తోంది. -
పెర్త్‌లో భారత్- ఆస్ట్రేలియాల నౌకాదళ విన్యాసాలు
విశాఖపట్నం: భారత ఆస్ట్రేలియా దేశాల యుద్ధ నౌకలు ఆస్ట్రేలియాలోని పెర్త్‌లో శుక్రవారం విన్యాసాలు ప్రారంభించాయి. ఈ సందర్భంగా పెర్త్‌లోని ఫ్రీమేంట్లే పోర్టులో తూర్పు నావికా దళం చీఫ్ రియర్ అడ్మిరల్ సతీష్‌సోనీ అస్ట్రేలియా నావికాదళ అధికారులతో శుక్రవారం భేటీ అయ్యారు. ద్వైపాక్షిక ఒప్పందాల బలోపేతంలో భాగంగా ఇరుదేశాల నావికా దళాల యుద్ధనౌకలు విన్యాసాల్లో పాల్గొంటుండగా భారత్ తరపున స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మితమైన నౌకలు ఐఎన్ఎస్ సత్పురా, కమోర్తాలు పెర్త్ చేరుకున్నాయి. ప్రపంచ దేశాలు లుక్ ఈస్ట్, ఏక్ట్ ఈస్ట్ పాలసీ పట్ల ఆసక్తిగా గమనిస్తున్న తరుణంలో ఈ విన్యాసాలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.


