చైనా చేరిన భారత యుద్ధ నౌకలు

Indian Naval Ships Reach China To Participate In Navy Fleet Review - Sakshi

పెదవాల్తేరు(విశాఖతూర్పు): చైనాలో జరుగనున్న అంతర్జాతీయ ఫ్లీట్‌ రివ్యూలో పాల్గొనేందుకు భారత్‌కు చెందిన నౌకలు తరలి వెళ్లాయి. భారతీయ నావికాదళానికి చెందిన కోల్‌కతా, శక్తి నౌకలు చైనాలోని క్వింగ్‌డాయో నగరంలోకి సోమవారం ప్రవేశించాయి. చైనా నేవీ పీఎల్‌ఏ 70వ వార్షికోత్సవాలను పురస్కరించుకుని అంతర్జాతీయ ఫ్లీట్‌రివ్యూ తలపెట్టారు. భారతీయ నౌకలకు చెందిన సిబ్బంది  చైనాలో 21 తుపాకులతో సెల్యూట్‌ నిర్వహించారు. భారతీయ నౌకలకు స్వాగత కార్యక్రమంలో భాగంగా చైనా నేవీ పీఎల్‌ఏ సిబ్బంది నేవీ బ్యాండుతో సాదర స్వాగతం పలికారు. కాగా, భారతీయ నౌకలు చైనాలో అంతర్జాతీయ ఫ్లీట్‌రివ్యూలో గతంలో 2009, 2014 సంవత్సరాల్లోనూ పాల్గొన్నాయి.

భారత్‌–చైనా మధ్య గల సౌభ్రాతృత్వ స్నేహానికి వారధిగా ఇరు దేశాల నేవీలు పరస్పర సహకారంలో భాగంగానే భారతీయ నౌకలు అంతర్జాతీయ ఫ్లీట్‌రివ్యూలో పాల్గొంటున్నాయి. ఈనెల 23వ తేదీన భారతీయ నౌకలు నిర్వహించే పరేడ్‌ని చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ సమీక్షిస్తారు. పలు క్రీడా ఈవెంట్లలో  భారతీయ నౌకాదళ సిబ్బంది పాల్గొంటారు. ఇంటర్నేషనల్‌ ఫ్లీట్‌రివ్యూలో చైనాలోని భారత్‌ రాయబారి విక్రమ్‌మిస్రి తదితర అధికారులు పాల్గొంటారు.

మే 4వ తేదీన ఫ్లీట్‌రివ్యూ ప్రారంభోత్సవం కన్నుల పండువగా జరుగనుంది. భారతీయ నౌకలు చైనా ప్రయాణంలో భాగంగా  వియత్నాంలోని కామ్‌రన్హ్‌బే పోర్టు మీదుగా చైనా చేరుకున్నాయి. అలాగే, ఈ నౌకలు తిరుగు ప్రయాణంలో భాగంగా పోర్టు బూషన్, దక్షిణ కొరియా, సింగపూర్‌ పోర్టుకు వెళతాయి. కేంద్ర ప్రభుత్వ యాక్ట్‌ ఈస్ట్‌ పాలసీలో భాగంగా తూర్పు, దక్షిణ ఆసియా దేశాలతో సాంస్కృతిక, ఆర్థిక, మేరీటైమ్‌ రంగాల్లో ఆయా దేశాలతో భారత్‌ సత్సంబంధాలు కొనసాగిస్తోంది. 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top