ఆస్ట్రేలియా స్టార్ స్పిన్నర్ ఆడమ్ జంపా కీలక నిర్ణయం తీసుకున్నాడు. ఆస్ట్రేలియా డొమాస్టిక్ సీజన్ 2026-27 ముందు అతడు తన హోమ్ టీమ్ 'న్యూ సౌత్ వేల్స్'కు గుడ్‌బై చెప్పాడు. ఇకపై అతడు క్వీన్స్‌లాండ్ బుల్స్‌కు ప్రాతినిథ్యం వహించనున్నాడు.
34 ఏళ్ల జంపా గతంలో సౌత్ ఆస్ట్రేలియా, న్యూ సౌత్ వేల్స్‌లకు ఆడాడు. ఇప్పుడు అతడికి క్వీన్స్‌లాండ్ మూడో డొమాస్టిక్ జట్టు కానుంది. ఈ విషయాన్ని క్వీన్స్‌లాండ్ హై పెర్ఫార్మెన్స్ జనరల్ మేనేజర్ బెన్నెట్ కింగ్ ధ్రువీకరించారు.
"జంపా ఒక వరల్డ్ క్లాస్ బౌలర్. అతడు మా జట్టుతో ఒప్పందం కుదుర్చుకోవడం చాలా సంతోషంగా ఉంది. అతని అనుభవం, సూచనలు మా జట్టుకు ఎంతగానో ఉపయోగపడతాయి. అతడు ఆస్ట్రేలియా తరపున అత్యున్నత స్ధాయిలో మరింత కాలం రాణించేందుకు మా వంతు సహకారం అందిస్తామని" బెన్నెట్ కింగ్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
కాగా ఈ ఆసీస్ సూపర్ స్టార్ ప్రస్తుతం దిహాండ్రెడ్ 2026 టోర్నీలో లండన్ స్పిరిట్ జట్టు తరపున ఆడుతున్నాడు. త్వరలోనే క్వీన్స్‌లాండ్ జట్టుతో కలుస్తాడు. అయితే అంతర్జాతీయ మ్యాచ్‌ల కమిట్‌మెంట్ కారణంగా అతడు డొమెస్టిక్ సీజన్ మొత్తానికి అందుబాటులో ఉండకపోవచ్చు. జంపా తన కెరీర్‌లో 198 వన్డే, 153 టీ20 వికెట్లు పడగొట్టాడు.
చదవండి: కరేబియన్ గడ్డ మీద చరిత్ర సృష్టించిన వెస్టిండీస్- పాక్ టెస్టు మ్యాచ్


