ఆస్ట్రేలియా స్పిన్నర్ ఆడం జంపా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తన ప్రతిభకు తగ్గ గుర్తింపు దక్కనందు వల్లే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)ను వదిలివేసినట్లు తెలిపాడు. అదే సమయంలో పాకిస్తాన్ సూపర్ లీగ్ (PSL) ఆడేందుకు డబ్బే కారణం అంటూ జంపా విచిత్రమైన వ్యాఖ్యలు చేశాడు.
డబ్బుకు డబ్బు.. పేరు పేరు
కాగా ప్రపంచంలోనే ఖరీదైన లీగ్‌గా పేరొందిన ఐపీఎల్‌లో ఆడేందుకు విదేశీ ఆటగాళ్లు ఆసక్తి చూపుతుంటారు. ఐపీఎల్‌లో ఆడటం ద్వారా డబ్బుకు డబ్బు.. పేరు పేరు సంపాదించిన ఆటగాళ్లు ఎందరో ఉన్నారు. అంతేకాదు ఐపీఎల్‌లో ఆడేందుకు పీఎస్‌ఎల్‌ను వీడిన ఆటగాళ్లు కూడా కోకొల్లలు.
పీఎస్‌ఎల్‌ను వీడి ఐపీఎల్‌లో
తాజాగా 2026 ఎడిషన్‌లో జింబాబ్వే పేసర్ బ్లెస్సింగ్ ముజర్‌బానీ, శ్రీలంక కెప్టెన్ దసున్ షనక (Dasun Shanaka), ఆస్ట్రేలియా పేసర్ స్పెన్సర్ జాన్సన్ తదితరులు పీఎస్‌ఎల్‌ను వీడి ఐపీఎల్‌లో చేరారు. అయితే, వీరికి ఆడం జంపా మాత్రం భిన్నంగా ఉన్నాడు. ఐపీఎల్‌లో తన ప్రతిభకు తగ్గ ధర దక్కలేదని.. అందుకే పీఎస్‌ఎల్‌లో చేరినట్లు తెలిపాడు.
జంపా మాత్రం రివర్స్
‘‘నేను రేసులో లేను. అందుకే ఐపీఎల్-2026 మినీ వేలంలో నా పేరు నమోదు చేసుకోలేదు. ఆ టోర్నీ నుంచి పూర్తిగా తప్పుకొన్నా. నిజం చెప్పాలంటే... నాలాంటి నైపుణ్యాలు ఉన్న ఆటగాడి కంటే ఇతరులకు ఎక్కువ డబ్బు లభిస్తోంది.
అందుకే అక్కడ ఉండటం సరైన నిర్ణయం కాదనిపించింది. అందుకే ఐపీఎల్ ఆడకూడదని నిర్ణయించుకున్నా. విరామం తీసుకున్నా. ఇంతలో పీఎస్‌ఎల్ నుంచి పిలుపు వచ్చింది’’ అని ఆడం జంపా చెప్పుకొచ్చాడు.
కాగా 2016లో ఐపీఎల్‌లో అరంగేట్రం చేసిన జంపా తొలుత రూ. 30 లక్షల జీతం అందుకోగా.. క్రమేణా ఆ మొత్తం 2.40 కోట్ల రూపాయలకు చేరింది. తాజాగా పీఎస్‌ఎల్‌లో కరాచీ కింగ్స్‌తో జంపా రూ. 1.51 కోట్లకు (పాకిస్తాన్ కరెన్సీలో రూ. 4.5 కోట్లు) ఒప్పందం చేసుకున్నాడు.


