మాక్స్‌వెల్‌కు షాకిచ్చిన క్రికెట్‌ ఆస్ట్రేలియా | Cricket Australia Axe 3 Time WC Winner From Central Contract List | Sakshi
Sakshi News home page

మాక్స్‌వెల్‌కు షాకిచ్చిన క్రికెట్‌ ఆస్ట్రేలియా

Apr 1 2026 12:27 PM | Updated on Apr 1 2026 12:39 PM

Cricket Australia Axe 3 Time WC Winner From Central Contract List

క్రికెట్‌ ఆస్ట్రేలియా (సీఏ) 2026-27 సీజన్‌కు సంబంధించి ఆటగాళ్ల వార్షిక కాంట్రాక్టుల జాబితా ప్రకటించింది. ఇందులో 21 మందికి చోటు దక్కింది. కాగా ఈ ఏడాది ఆగష్టు నుంచి ఆస్ట్రేలియా క్రికెట్‌ జట్టు 12 నెలల కాలంలో 20 టెస్టు మ్యాచ్‌లు ఆడనుంది.

మాక్స్‌వెల్‌కు షాకిచ్చిన సీఏ
ఈ నేపథ్యంలో టెస్టులకు సంబంధించి బిజీ షెడ్యూల్‌ కారణంగా.. వైట్‌బాల్‌ స్పెషలిస్టులు అయిన గ్లెన్‌ మాక్స్‌వెల్‌ (Glenn Maxwell), మ్యాట్‌ షార్ట్‌లకు సీఏ షాకిచ్చింది. గతేడాది వార్షిక కాంట్రాక్టులో ఉన్న వీరిద్దరిపై ఈసారి వేటు వేసింది. ఇక గతేడాది రిటైర్‌ అయిన ఉస్మాన్‌ ఖవాజా పేరును కూడా సీఏ తొలగించింది.

మూడు ప్రపంచకప్‌లు గెలిచిన విజేత
వీరితో పాటు గాయాలతో సావాసం చేస్తున్న ఫాస్ట్‌ బౌలర్‌ లాన్స్‌ మోరిస్‌ (Lance Morris)కు సైతం సెంట్రల్‌ కాంట్రాక్టు దక్కలేదు. కాగా 37 ఏళ్ల గ్లెన్‌ మాక్స్‌వెల్‌ ఆస్ట్రేలియా తరఫున రెండు వన్డే వరల్డ్‌కప్‌, ఒక టీ20 వరల్డ్‌కప్‌ గెలిచిన ఘనుడు. అయితే, ఈసారి మాత్రం అతడిని సీఏ సెంట్రల్‌ కాంట్రాక్టు నుంచి తొలగించడం గమనార్హం.

ఇదిలా ఉంటే.. యువ ఓపెనర్‌ సామ్‌ కొన్‌స్టాస్‌ను కూడా సీఏ పక్కనపెట్టింది. 20 ఏళ్ల ఈ బ్యాటర్‌కు బదులు.. 31 ఏళ్ల జేక్‌ వెదర్లాండ్‌ను సెంట్రల్‌ కాంట్రాక్టు జాబితాలో చేర్చింది. మరోవైపు.. ఫాస్ట్‌ బౌలర్‌ జే రిచర్డ్‌సన్‌ పేరును కూడా సీఏ తొలగించింది. మిచెల్‌ స్టార్క్‌, జోష్‌ హాజిల్‌వుడ్‌, స్కాట్‌ బోలాండ్‌ వారసుడిగా పేరొందిన రిచర్డ్‌సన్‌ను సీఏ పట్టించుకోకపోవడం విశేషం.

వీరికి అవకాశం
అదే సమయంలో.. ఇంగ్లండ్‌తో ప్రతిష్టాత్మక యాషెస్‌ టెస్టు సిరీస్‌లో రాణించిన 31 ఏళ్ల బ్రెండన్‌ డాగెట్‌, 36 ఏళ్ల మైకేల్‌ నాజర్‌లకు సీఏ చోటు ఇచ్చింది. కాగా ఆగష్టులో స్వదేశంలో బంగ్లాదేశ్‌తో సిరీస్‌తో ఆసీస్‌ టెస్టు ప్రయాణం మొదలుకానుంది. ఆ తర్వాత సౌతాఫ్రికా, ఇండియా టూర్లకు వెళ్తుంది. ఆఖరిగా స్వదేవంలో ఇంగ్లండ్‌తో 150వ వార్షికోత్సవ టెస్టు మ్యాచ్‌ ఆడుతుంది.

క్రికెట్‌ ఆస్ట్రేలియా 2026-27 సీజన్‌కు గానూ ప్రకటించిన కాంట్రాక్టు ప్లేయర్ల జాబితా
జేవియర్‌ బార్ట్‌లెట్‌, స్కాట్‌ బోలాండ్‌, అలెక్స్‌ క్యారీ, ప్యాట్‌ కమిన్స్‌, బ్రెండన్‌ డాగెట్‌, నాథన్‌ ఎల్లిస్‌, కామెరాన్‌ గ్రీన్‌, జోష్‌ హాజిల్‌వుడ్‌, ట్రవిస్‌ హెడ్‌, జోష్‌ ఇంగ్లిస్‌, మాథ్యూ కుహ్నెమన్‌, మార్నస్‌ లబుషేన్‌, నాథన్‌ లియాన్‌, మిచెల్‌ మార్ష్‌, టాడ్‌ మర్ఫీ, మైకేల్‌ నాజర్‌, స్టీవ్‌ స్మిత్‌, మిచెల్‌ స్టార్క్‌, జేక్‌ వెదర్లాండ్‌, బ్యూ వెబ్‌స్టర్‌, ఆడం జంపా.

చదవండి: IPL 2026: గెలుపు జోష్‌లో ఉన్న శ్రేయస్‌ అయ్యర్‌కు భారీ షాక్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement