అథ్లెటిక్స్‌లో సంచలనం.. బోల్ట్ రికార్డు బ‌ద్ద‌లు! | 18-year-old Gout Gout shatters Usain Bolt record 200m sprint | Sakshi
Sakshi News home page

అథ్లెటిక్స్‌లో సంచలనం.. బోల్ట్ రికార్డు బ‌ద్ద‌లు!

Apr 12 2026 1:06 PM | Updated on Apr 12 2026 1:38 PM

18-year-old Gout Gout shatters Usain Bolt record 200m sprint

ఉసేన్ బోల్ట్.. ఈ పేరు చెప్పగానే రేసింగ్ ట్రాక్ మీద చిరుతలా పరుగులు పెట్టిన స్ప్రింటర్ గుర్తుకువస్తాడు. పరుగుపందెంలో మిగిలిన వారికీ, ఉసేన్ బోల్ట్‌కి మధ్య ఉన్న దూరం చూసి, ప్రపంచం విస్తుపోయింది.  100, 200, 400 మీట‌ర్ల ఈవెంట్స్‌లో బోల్ట్ ప్ర‌పంచ రికార్డులు నెల‌కొల్పాడు. తాజాగా 200 మీటర్ల స్ప్రింట్ ఈవెంట్‌లో బోల్ట్ నెలకొల్పిన రికార్డును ఆస్ట్రేలియాకు చెందిన 18 ఏళ్ల కుర్రాడు గౌట్‌ బద్దలుకొట్టడం విశేషం. 

ఆస్ట్రేలియన్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో ఆదివారం ఈ అద్భుతం చోటుచేసుకుంది. 200 మీటర్ల ఫైనల్ రేసులో గౌట్ 19.67 సెకన్లలో గమ్యాన్ని చేరి సరికొత్త సృష్టించాడు. ఇంతకముందు ఉసేన్ బోల్ట్ 200 మీటర్ల రేసును 19.93 సెకన్లలో పూర్తి చేశాడు. గతంలో గౌట్ ఇదే 200 మీటర్ల రేసును 20.02 సెకన్లలో పూర్తి చేశాడు. 

తాజాగా తన రికార్డును మరింత సవరించడమే గాకుండా ఏకంగా జమైకా చిరుత బోల్ట్ రికార్డుకు ఎసరు పెట్టి నయా చిరుతగా ఆవిర్భవించాడు. ఇక ఫైనల్లో తన ప్రత్యర్థుల నుంచి గౌట్‌కు పోటీ ఎదురైంది. ఐడాన్ మర్ఫీ 19.88 సెకన్లతో రెండో స్థానంలో, కాలబ్ లా 20.21 సెకన్లతో మూడో స్థానంలో నిలిచారు. అయితే ఫైనల్‌కు ముందే లాచ్లెన్ కెన్నెడీ వైదొలగడం కూడా గౌట్‌కు కలిసొచ్చింది.

ఎవరీ గౌట్‌?
గౌట్ పేరెంట్స్ అత‌డు పుట్ట‌కముందే ద‌క్షిణ సుడాన్ నుంచి ఆస్ట్రేలియాకు వ‌ల‌స వ‌చ్చారు. క్వీన్స్‌లాండ్‌లో నివాసం ఏర్ప‌ర‌చుకున్న మోనికా, బోనా దంప‌తుల‌కు ఏడుగురు సంతానం. అయితే గౌట్ పూర్వీకుల‌ది ఈజిప్ట్ కావ‌డంతో అత‌డికి ఆ పేరు పెట్టారు. సౌత్ఈస్ట్ క్వీన్స్‌లాండ్‌లోని ఇప్స్‌విచ్ గ్రామర్ స్కూల్‌లో చ‌దువుకున్న గౌట్ చిన్న‌ప్ప‌టి నుంచి సాక‌ర్ ఆడ‌డం నేర్చుకున్నాడు. 

అలా అథ్లెటిక్స్‌పై ఇష్టం పెంచుకున్నాడు. ఆ త‌ర్వాత పూర్తి అథ్లెటిక్స్‌లోకి మారిన గౌట్ అండ‌ర్ 16 విభాగంలో 100, 200 మీట‌ర్ల ప‌లు రికార్డులు నెల‌కొల్పాడు. 14 ఏళ్ల వ‌య‌సులో గౌట్ 100 మీట‌ర్ల రేసును 10.57 సెక‌న్ల‌లో పూర్తి చేసిస స‌రికొత్త చ‌రిత్ర సృష్టించాడు. 15 ఏళ్ల వ‌య‌సులో గౌట్ అండ‌ర్‌-18 విభాగంలో 200 మీట‌ర్ల రేసును 20.87 సెకన్ల‌లో పూర్తి చేసి దేశ‌వాలీలో రికార్డు నెల‌కొల్పాడు. 

అంత‌ర్జాతీయ అథ్లెటిక్స్ టోర్నీల్లోనూ స‌త్త చాటిన గౌట్ ఓషినియా అండ‌ర్ 18 అథ్లెటిక్స్ చాంపియ‌న్‌షిప్స్‌లో 200 మీట‌ర్లు, 4x400 మీట‌ర్ల రిలేలో స్వ‌ర్ణ ప‌త‌కాలు కైవ‌సం చేసుకున్నాడు. ఇక ఉసేన్ బోల్ట్, 2009లో 100 మీటర్ల పరుగు పందెన్ని 9.58 సెకన్లలో పూర్తి చేసి వరల్డ్ రికార్డు క్రియేట్ చేశాడు. అలాగే 150 మీటర్లను 14.35 సెకన్లు, 200 మీటర్లను 19.19 సెకన్లలో పూర్తి చేసి ప్రపంచ రికార్డులు నెలకొల్పాడు. 

2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో 2, 2012 లండన్ ఒలింపిక్స్‌లో 3, 2016 రియో ఒలింపిక్స్‌లో 3 స్వర్ణాలు సాధించిన ఉసేన్ బోల్ట్, వరల్డ్ ఛాంపియన్‌షిప్స్‌లో 11 స్వర్ణాలు సాధించాడు. 

 చదవండి: దేశ ప్రజలను అవమానించిన పాక్‌ క్రికెటర్‌!

Advertisement
 
Advertisement
Advertisement