2027 ఏప్రిల్ 1 నుంచి నిబంధనలు అమల్లోకి...
దేశీయంగా టెంపర్డ్ గ్లాస్ మార్కెట్ రూ. 20,000 కోట్లు
న్యూఢిల్లీ: హాట్ కేకుల్లా అమ్ముడవుతున్న స్మార్ట్ ఫోన్‌లు ఒకెత్తయితే.. వాటి స్క్రీన్ ప్రొటెక్టర్లకు కూడా అంతకు మించి గిరాకీ ఉంది. ఈ నేపథ్యంలో నాణ్యతకు భరోసానిచ్చేలా కేంద్ర ప్రభుత్వం వాటిని బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్) పరిధిలోకి తెచ్చింది. అంటే ఇకపై స్మార్ట్ ఫోన్ స్క్రీన్ ప్రొటెక్టర్ ఉత్పత్తులను భారత్‌లో విక్రయించాలంటే.. ఆయా సంస్థలు తప్పనిసరిగా నియంత్రణపరమైన అనుమతులు పొందాల్సి ఉంటుంది. ఈ నిబంధనలు వచ్చే ఏడాది ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి.
ఈ చర్యలతో నాసిరకమైన స్క్రీన్ ప్రొటెక్టర్లకు అడ్డుకట్టపడే అవకాశం ఉండటంతో పాటు ఇప్పటికే ఉత్పత్తి మొదలు పెట్టిన ఆప్టిమస్ ఇన్‌ఫ్రాకామ్ వంటి దేశీ తయారీదారులకు దన్నుగా నిలవనుంది. ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ గూడ్స్ (తప్పనిసరి రిజి్రస్టేషన్) ఆర్డర్, 2021 నిబంధనలను ఉటంకిస్తూ కేంద్రం దీనిపై తాజాగా నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నిబంధనల్లో నోటిఫై చేసిన 66వ ఐటమ్‌గా స్క్రీన్ ప్రొటెక్టర్లను చేర్చారు. ఈ జాబితాలో ఇప్పటికే స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, మొబైల్–ల్యాప్‌టాప్ చార్జర్లు, ఎల్‌ఈడీ టీవీలు, మైక్రోవేవ్ ఓవెన్లు, ప్రింటర్లు, సెట్‌టాప్ బాక్సుల వంటి ఉత్పత్తులు ఉన్నాయి.
నాణ్యతకు పెద్దపీట..
బీఐఎస్ ప్రమాణాల అమలును తప్పనిసరి చేయడం ఈ కేటగిరీకి సంబంధించి చాలా కీలకమైన మైలురాయి అని, నాణ్యమైన స్క్రీన్ ప్రొటెక్టర్ల దిశగా ఇది ఆహా్వనించదగిన పరిణామంగా ఆప్టిమస్ ఇన్‌ఫ్రాకామ్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ అశోక్ గుప్తా పేర్కొన్నారు. పెరుగుతున్న డిమాండ్‌ను తట్టుకోవడానికి ఇప్పటికే ఉన్న తయారీకి తోడుగా మరో 2 కోట్ల యూనిట్ల అదనపు సామర్థ్యాన్ని జోడించే ప్రణాళికల్లో ఉన్నట్లు ఆయన వెల్లడించారు.
అమెరికా మెటీరియల్ టెక్ సంస్థ కార్నింగ్ భాగస్వామ్యంతో నోయిడాలో నెలకొల్పిన ప్లాంట్ నుంచి వచ్చే ఏడాది జనవరి నుంచి ఉత్పత్తులు మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉందన్నారు. కాగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో టెంపర్డ్ గ్లాస్ స్క్రీన్ ప్రొటెక్టర్ల వ్యాపారం నుంచి రూ.1800–2,000 కోట్ల ఆదాయాన్ని
కంపెనీ ఆశిస్తోంది.
60,000 మందికి ఉపాధి...
ప్రస్తుతం ఏటా దేశంలో 50 కోట్లకు పైగా స్క్రీన్ ప్రొటెక్టర్లు అమ్ముడవుతున్నాయని.. బీఐఎస్‌లోకి ఈ ఉత్పత్తులను చేర్చడం వల్ల 60,000 మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభించడమే కాకుండా రూ.2,000 కోట్ల జీఎస్‌టీ ఆదాయం సమకూరే అవకాశం ఉందని ఇండియా సెల్యులార్ అండ్ ఎల్రక్టానిక్స్ అసోసియేషన్ (ఐసీఈఏ) చైర్మన్ పంకజ్ మొహీంద్రూ చెప్పారు. నాసిరకమైన స్క్రీన్ ప్రొటెక్టర్ల బారి నుంచి వినియోగదారులకు రక్షణ లభిస్తుందని, అలాగే ప్రపంచ స్థాయి తయారీ, ఎగుమతుల కేంద్రంగా భారత్‌ను నిలబెడుతుందని కూడా ఆయన పేర్కొన్నారు. 2025లో టెంపర్డ్ గ్లాస్ స్క్రీన్ ప్రొటెక్టర్ల రిటైల్ మార్కెట్ దాదాపు రూ.20,000 కోట్లుగా ఉన్నట్లు పరిశ్రమ వర్గాల అంచనా.


