భారతదేశంలోని అత్యంత ముఖ్యమైన ఆర్థిక నగరాల్లో ముంబై ఒకటి. ఈ నగరం ఒకప్పుడు పెరిగినంతగా.. ఇప్పుడు పెరగడానికి కావలసినంత స్థలం లేకుండా పోయింది. భూమి పరిమితంగా ఉంది, ఆస్తుల ధరలు అధికంగా ఉన్నాయి. అంతేకాకుండా.. రోడ్లు, గృహ నిర్మాణం, మౌలిక సదుపాయాలపై ఒత్తిడి పెరుగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో ముంబై నగర భవిష్యత్ విస్తరణకు మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 'ముంబై 3.0'గా పిలుస్తున్న కర్నాల-సాయి-చిర్నేర్ (KSC) న్యూ టౌన్‌ను అభివృద్ధి చేయాలని చూస్తోంది.
ఈ కొత్త నగరం రాయగఢ్ జిల్లాలోని ఉరాన్, పన్వెల్, పెన్ తాలూకాల్లోని 124 గ్రామాలను కలుపుకుని సుమారు 323.44 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో అభివృద్ధి కానుంది. ఈ ప్రాంతానికి 'ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ' (MMRDA)ను న్యూ టౌన్ డెవలప్‌మెంట్ అథారిటీగా నియమించారు. అంటే.. ఇది సాధారణంగా ఏర్పడే కొత్త నివాస ప్రాంతం కాదు.. ముందస్తు ప్రణాళికతో నిర్మించే ఒక పెద్ద నగరమన్నమాట.
ముంబై 3.0 ఎందుకు అవసరం?
ముంబై ఇప్పటికే తన అసలు ప్రాంతాన్ని దాటి విస్తరించింది. ఆ తర్వాత నవి ముంబై ఒక ప్రధాన ప్రత్యామ్నాయ నగరంగా అభివృద్ధి చెందింది. కానీ.. నవి ముంబైలో కూడా భూమికి డిమాండ్ పెరుగుతోంది. అందువల్ల భవిష్యత్తులో పెరిగే జనాభా, ఉద్యోగాలు, పరిశ్రమలు, గృహ అవసరాలను తీర్చడానికి మరో పెద్ద పట్టణ కేంద్రం అవసరమైంది.
ముంబై 3.0 ప్రాజెక్టులో కేవలం కొత్త భవనాల నిర్మాణం మాత్రమే కాకుండా.. ఉద్యోగాలు, నివాసాలు, పరిశ్రమలు, విద్య, వైద్యం, టెక్నాలజీ, లాజిస్టిక్స్ వంటి అన్ని రంగాలను ఒకే ప్రాంతంలో అభివృద్ధి చేసి, సమగ్ర నగరంగా రూపొందించాలని భావిస్తున్నారు.
ప్రణాళిక ప్రకారం.. సుమారు 104 చదరపు కిలోమీటర్ల ప్రాంతంలో టౌన్‌షిప్‌లు, పారిశ్రామిక కారిడార్లు అభివృద్ధి చెందనున్నట్లు సమాచారం. ఇదే సమయంలో.. గ్రీన్ జోన్లు, అడవులు, గ్రామీణ ప్రాంతాలను కూడా రక్షించడానికి ప్రాధాన్యం ఇవ్వనున్నారు. దీంతో ఆర్థిక అభివృద్ధితో పాటు పర్యావరణ సమతుల్యతను కూడా కాపాడే ప్రయత్నం జరుగుతోంది.

ముంబై 3.0కి ప్రధాన బలం
ఈ కొత్త నగరానికి ఉన్న అతిపెద్ద ప్రయోజనం కనెక్టివిటీ. ముంబై-నవి ముంబై మధ్య ప్రయాణాన్ని వేగవంతం చేసిన అటల్ బిహారీ వాజ్‌పేయీ సెవ్రీ-న్హావా శేవా అటల్ సేతు ఈ ప్రాంత అభివృద్ధికి ఎంతో కీలకం. అదే విధంగా.. నవి ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్, పన్వెల్-కర్జత్ రైల్వే కారిడార్, విరార్-అలీబాగ్ మల్టీమోడల్ కారిడార్, ముంబై-పుణే ఎక్స్‌ప్రెస్‌వే వంటి మౌలిక సదుపాయాలు ఈ ప్రాంతాన్ని ముంబై మెట్రోపాలిటన్ రీజియన్‌లోని ఇతర ప్రాంతాలతో అనుసంధానించనున్నాయి.
దీని వల్ల భవిష్యత్తులో.. ముంబై 3.0 ప్రాంతం ఐటీ, ఫైనాన్షియల్ సర్వీసెస్, గ్లోబల్ కెపబిలిటీ సెంటర్లు, డేటా సెంటర్లు, ఆరోగ్య సేవలు, విద్య, లాజిస్టిక్స్ వంటి రంగాలకు ఆకర్షణీయంగా మారే అవకాశం ఉంది.
రియల్ ఎస్టేట్‌పై ప్రభావం
ముంబై 3.0 అభివృద్ధి రియల్ ఎస్టేట్ రంగంలో కూడా కొత్త అవకాశాలను సృష్టించే అవకాశం ఉంది. భారీ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు సాధారణంగా వాటి చుట్టుపక్కల కొత్త నివాస, వాణిజ్య ప్రాంతాల అభివృద్ధికి దారితీస్తాయి.
అటల్ సేతు, కొత్త విమానాశ్రయం, రైల్వే, మల్టీమోడల్ కారిడార్లు పూర్తిస్థాయిలో పనిచేయడం ప్రారంభిస్తే.. ఈ ప్రాంతంలో కొత్త రియల్ ఎస్టేట్ మైక్రో-మార్కెట్లు ఏర్పడవచ్చు. ఉద్యోగాలు పెరిగితే.. వాటికి అనుగుణంగా ఇళ్లు, కార్యాలయాలు, షాపింగ్ ప్రాంతాలు, పాఠశాలలు, ఆసుపత్రులు, ఇతర సేవలకు కూడా డిమాండ్ పెరుగుతుంది. అయితే.. దీని ప్రయోజనాలు వెంటనే కనిపించవు. ఇలాంటి భారీ నగర ప్రాజెక్టులు పూర్తిగా అభివృద్ధి చెందడానికి అనేక సంవత్సరాలు పడుతుంది. కాబట్టి.. దీనిని తక్షణ రియల్ ఎస్టేట్ బూమ్‌గా కాకుండా దీర్ఘకాలిక నగర అభివృద్ధి ప్రణాళికగా చూడాలి.

భారీ పెట్టుబడులు
ముంబై 3.0 ప్రాజెక్టుకు ప్రభుత్వ స్థాయిలో కూడా గణనీయమైన ప్రాధాన్యం లభిస్తోంది. 2026-27 సంవత్సరానికి MMRDA సుమారు రూ.4,000 కోట్లను కర్నాలా-సాయి-చిర్నేర్ న్యూ టౌన్ అభివృద్ధికి కేటాయించింది.
ఇదే సమయంలో భూముల విషయంలో 124 గ్రామాల భూస్వాములతో వ్యవహరించడం కూడా కీలకమైన అంశం. భూస్వాములకు నగదు పరిహారం, డెవలప్‌మెంట్ రైట్స్, ల్యాండ్ పూలింగ్ వంటి వివిధ మార్గాలను ప్రతిపాదిస్తున్నారు. ఇంత పెద్ద ప్రాజెక్టు విజయవంతం కావాలంటే భూసేకరణ, స్థానిక ప్రజల ప్రయోజనాలు, పునరావాసం వంటి అంశాలను జాగ్రత్తగా నిర్వహించాల్సి ఉంటుంది.
ముంబై 3.0 భవిష్యత్తు
ముంబై 3.0 అనేది ఒక్కరోజులో ఏర్పడే నగరం కాదు. ప్రణాళిక, భూమి సంబంధిత ప్రక్రియలు, మౌలిక సదుపాయాల నిర్మాణం, పెట్టుబడులు, పరిశ్రమల రాక వంటి అనేక దశల తర్వాతే ఇది పూర్తిస్థాయి నగరంగా రూపుదిద్దుకుంటుంది. ప్రాజెక్టు తొలి దశ ఈ దశాబ్దం చివరి భాగంలో రూపుదిద్దుకునే అవకాశం ఉన్నప్పటికీ.. మొత్తం నగర వ్యవస్థ అభివృద్ధి చెందడానికి ఇంకా ఎక్కువ సమయం పట్టవచ్చు.


