ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పొందిన వీడియో స్ట్రీమింగ్ సంస్థ యూట్యూబ్ తమ ప్లాట్‌ఫామ్‌పై వ్యూస్ లెక్కింపు విధానంలో భారీ మార్పులు తెస్తోంది. ఆగస్టు 24 నుంచి అమల్లోకి రానున్న ఈ కొత్త విధానం ప్రకారం, ఒక వీడియో ప్లే కావడం ప్రారంభమైన మరుక్షణమే (ఫస్ట్ ఫ్రేమ్ ప్లే కాగానే) దానిని ఒక ‘వ్యూ’గా పరిగణిస్తారు. గతంలో ఒక వ్యూ నమోదు కావడానికి వినియోగదారులు సదరు వీడియోను నిర్ణీత సమయం (సుమారు 30 సెకన్లు) వరకు చూడాల్సి వచ్చేది. అయితే డిజిటల్ మీడియా పోటీలో టిక్‌టాక్, ఇన్‌స్టాగ్రామ్ రీల్స్.. వంటి ప్లాట్‌ఫామ్‌లకు అనుగుణంగా డేటా విధానాన్ని ఏకీకృతం చేసేందుకు యూట్యూబ్ ఈ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే యూట్యూబ్ షార్ట్స్‌లో అమల్లో ఉన్న ఈ సూత్రాన్ని ఇకపై లాంగ్-ఫార్మాట్ (పొడవైన) వీడియోలకు కూడా వర్తింపజేస్తున్నారు.
క్రియేటర్లు, ప్రకటనకర్తలకు ఏం మారనుంది?
ఈ మార్పు వల్ల క్రియేటర్ల ఛానెళ్లపై పబ్లిక్‌గా కనిపించే వ్యూస్ సంఖ్య వేగంగా, భారీగా పెరిగే అవకాశం ఉంది. అయితే, క్రియేటర్ల ఆదాయం (మానిటైజేషన్) విషయంలో ఎలాంటి ప్రతికూల ప్రభావం ఉండదని యూట్యూబ్ స్పష్టం చేసింది.
ఆదాయంలో మార్పు ఉండదు: ప్రకటనల ద్వారా వచ్చే ఆదాయం, యూట్యూబ్ పార్ట్‌నర్ ప్రోగ్రామ్ అర్హతలు కేవలం పబ్లిక్ వ్యూస్‌పై కాకుండా ఎంగేజ్డ్ వ్యూస్ (వీక్షకులు ఎంత సమయం వీడియో చూశారనేది) ఆధారంగానే నిర్ణయిస్తారు.
యూట్యూబ్ స్టూడియోలో స్పష్టత: క్రియేటర్లు తమ అనలిటిక్స్ కోసం పబ్లిక్ వ్యూస్‌తో పాటు నిజమైన ఎంగేజ్‌మెంట్ తెలిపే ‘ఎంగేజ్డ్ వ్యూస్’ను విడివిడిగా చూసుకునే వెసులుబాటును యూట్యూబ్ స్టూడియోలో కల్పిస్తారు.
పాత వీడియోల డేటా సురక్షితం: ఆగస్టు 24 కంటే ముందు అప్‌లోడ్ చేసిన పాత వీడియోల చారిత్రక డేటా యథాతథంగానే ఉంటుందని సంస్థ తెలిపింది.
ఈ నిర్ణయం ద్వారా బ్రాండ్లు, స్పాన్సర్లకు తమ రీచ్‌ను ప్రతిబింబించడం క్రియేటర్లకు సులువవుతుంది. ఈ విధానం ద్వారా డిజిటల్ కంటెంట్ పరిశ్రమలో మరింత పారదర్శకత పెరుగుతుందని టెక్ విశ్లేషకులు భావిస్తున్నారు.
ఇదీ చదవండి: బంగారం షాపింగ్ చేసేవారికి రిలీఫ్! పడిన ధర..


