తెలుగు రాష్ట్రాల్లో జోరందుకున్న వ్యాపారం | Telugu States Business Surge Crompton Rebrands Exclusive CFO Interview | Sakshi
Sakshi News home page

తెలుగు రాష్ట్రాల్లో జోరందుకున్న వ్యాపారం

Aug 19 2026 1:30 PM | Updated on Aug 19 2026 2:07 PM

Telugu States Business Surge Crompton Rebrands Exclusive CFO Interview

కన్జ్యూమర్ ఎలక్ట్రికల్స్ రంగంలో ఎనిమిదిన్నర దశాబ్దాలుగా సర్వీసులందిస్తున్న ప్రముఖ సంస్థ క్రాంప్టన్ గ్రీవ్స్ కన్జ్యూమర్ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ తమ నూతన బ్రాండ్ లోగో, కలర్ ప్యాలెట్, బ్రాండ్ ఐడెంటిటీ (Crompton 2.0)ను ఆవిష్కరించింది. వినియోగదారుల ఆధునిక గృహ అవసరాలను, ఆకాంక్షలను ప్రతిబింబించేలా ఈ నూతన లోగో రూపుదిద్దుకుందని ముంబయిలో జరిగిన ప్రత్యేక సమావేశంలో కంపెనీ ప్రతినిధులు చెప్పారు. ఈ సందర్భంగా కంపెనీ చీఫ్‌ ఫైనాన్షియల్‌ ఆఫీసర్‌ (సీఎఫ్‌ఓ) కాళీశ్వరన్ అరుణాచలంతో ‘సాక్షి వెబ్‌’ ప్రత్యేక ఇంటర్వ్యూ..

క్రాంప్టన్ గ్రీవ్స్ నూతన బ్రాండ్ లోగో, వినియోగదారుల సేవల్లో వస్తున్న కీలక మార్పుల వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశం ఏమిటి?

వినియోగదారుల ఆధునిక జీవనశైలికి తగినట్లుగా సరికొత్త అనుభూతిని అందిస్తూ అత్యుత్తమ ఉత్పత్తులను పరిచయం చేయడమే మా నూతన లోగో ప్రధాన ఉద్దేశం. కస్టమర్లకు బెస్ట్ ఎక్స్‌పీరియన్స్ కల్పించడంతో పాటు వేగవంతమైన, కస్టమర్-సెంటిమెంట్ ఆధారిత సర్వీస్ ఓరియెంటెడ్ అప్రోచ్‌తో ముందడుగు వేస్తున్నాం. మా సాంప్రదాయ ఉత్పత్తులైన ఫ్యాన్లు, లైటింగ్ వ్యాపారాన్ని డిజైన్, ఎనర్జీ ఎఫిషియెన్సీ రంగాల్లో మరింత వేగవంతంగా నవీకరిస్తున్నాం. అధిక సంఖ్యలో ఉండే గృహోపకరణాలపై ప్రత్యేక దృష్టి సారించాం. ఇది మార్కెట్లో మా పట్టును మరింత బలోపేతం చేస్తుంది. క్రాంప్టన్ అంటే కేవలం లైట్లు, ఫ్యాన్లు మాత్రమే కాదు.. ఇదొక సమగ్ర గృహ పరిష్కారాల బ్రాండ్.

తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల్లో వ్యాపార విస్తరణ, వృద్ధి అవకాశాలు ఎలా ఉన్నాయి?

దక్షిణాదిలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న వ్యూహాత్మక మార్కెట్లు. ఈ రెండు రాష్ట్రాల్లో మౌలిక వసతులు, రియల్ ఎస్టేట్ రంగం ఊపందుకోవడం వల్ల వైర్లు, రెసిడెన్షియల్ ఎలక్ట్రికల్ వైరింగ్ విభాగంలో మెరుగైన వ్యాపార వృద్ధి నమోదవుతోంది. ఇక్కడ ప్యాకేజింగ్, రెసిడెన్షియల్, కమర్షియల్ ప్రాజెక్టుల నుంచి భారీ డిమాండ్ ఉంది. తెలుగు రాష్ట్రాల మార్కెట్ విస్తరణ ద్వారా మా కంపెనీకి నిలకడైన రాబడులు వస్తున్నాయి. స్థానికంగా కొత్త ఉపాధి అవకాశాల కల్పనకు, స్థానిక పంపిణీ నెట్‌వర్క్ పటిష్టతకు పెద్దపీట వేస్తున్నాం.

గ్రీన్ ఎనర్జీ, పీఎం సూర్య ఘర్ యోజన పథకం ద్వారా వస్తున్న అవకాశాలను ఎలా అందుకోబోతున్నారు?

కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పీఎం సూర్య ఘర్ యోజన దేశీయ పునరుత్పాదక ఇంధన రంగానికి గొప్ప అవకాశంగా మారింది. సోలార్ ప్లాంట్లు, సోలార్ పంప్‌లు, అనుబంధ గ్రీన్ సొల్యూషన్స్ విభాగంలో విస్తరించడం ద్వారా గ్రీన్‌ ఎనర్జీని గృహ వినియోగదారులకు చేరువ చేస్తున్నాం. ఈ వ్యాపారం పర్యావరణ పరిరక్షణకు తోడ్పడటమే కాకుండా గ్రీన్ ఫీల్డ్ క్రియేషన్, ఉపాధి కల్పన సాధనలో కీలక పాత్ర పోషిస్తుంది. రాబోయే రోజుల్లో సోలార్, గ్రీన్ ఎనర్జీ రంగాలు కంపెనీ వృద్ధికి ప్రధాన ఇంజిన్‌గా నిలుస్తాయి. దీనిపై మా రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ టీమ్‌ పని చేస్తోంది.

ద్రవ్యోల్బణం, అంతర్జాతీయ అనిశ్చితులు, పెరిగిన ఉత్పత్తి వ్యయాల సవాళ్లను ఎదుర్కొనేందుకు ఎలాంటి ఆర్థిక వ్యూహాలను అనుసరిస్తున్నారు?

ద్రవ్యోల్బణం ప్రభావం వల్ల మార్కెట్‌లో పెరిగిన ముడిసరుకుల వ్యయాలను సమతుల్యం చేయడానికి ప్రణాళికబద్ధంగా దాదాపు 6 శాతం ధరల పెంపు చేపట్టాల్సి వచ్చింది. అయితే, కేవలం ధరలు పెంచడం మాత్రమే కాకుండా మా ఉత్పత్తుల నాణ్యతను పెంచే ప్రీమియమైజేషన్ వ్యూహాన్ని వేగవంతం చేశాం. ప్రీమియం నాణ్యత గల ఉత్పత్తులకు వినియోగదారుల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. మాది మార్కెట్లోనే బెస్ట్ క్యాష్ జనరేషన్ బిజినెస్. దీనివల్ల ఎలాంటి సంక్షోభాలనైనా తట్టుకుని నిలబడే స్థిరత్వం మాకుంది.

భవిష్యత్తు నూతన ఆవిష్కరణలు, నిలకడైన ఉపాధి, సాంకేతిక పరిజ్ఞానం పెంపుపై మీ వ్యూహం ఏమిటి?

భవిష్యత్తు వ్యాపార వృద్ధిని దృష్టిలో ఉంచుకుని సరికొత్త సాంకేతికత కలిగిన స్టార్టప్‌లతో కలసి పనిచేస్తున్నాం. కృత్రిమ మేధస్సు, ఆటోమేషన్ సాంకేతికతలను మా తయారీ, సర్వీసు విభాగాల్లో సమర్థవంతంగా వినియోగిస్తున్నాం. ఇక్కడ ఒక ముఖ్య విషయమేమిటంటే.. ఏఐ, ఆటోమేషన్ ద్వారా మనుషులను ఉద్యోగాల నుంచి తొలగించడం మా ఉద్దేశం కాదు. మా మ్యాన్‌పవర్‌ను ఇతర విభాగాల్లో సర్దుబాటు చేసి వారి నైపుణ్యాలను మెరుగుపరచడం ద్వారా లేఆఫ్స్ నివారిస్తున్నాం. ఈ ఆధునిక సాంకేతిక కలయిక ద్వారా డిజైన్, లైటింగ్, ఫ్యాన్లు.. వంటి అన్ని విభాగాల్లో ప్రపంచ స్థాయి ప్రమాణాలను పాటిస్తున్నాం.

ఇదీ చదవండి: బంగారం షాపింగ్ చేసేవారికి రిలీఫ్! పడిన ధర..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement