ఆటో, ట్యాక్సీ ప్రయాణికులకు అలర్ట్‌ | Proposal to hike auto and taxi fares in Mumbai full details | Sakshi
Sakshi News home page

Mumbai: త్వరలో ఆటో, ట్యాక్సీ చార్జీల పెంపు

Aug 18 2026 7:17 PM | Updated on Aug 18 2026 7:17 PM

Proposal to hike auto and taxi fares in Mumbai full details

దాదర్‌ (మహారాష్ట్ర): ముంబైకర్లపై త్వరలో ఆటో, ట్యాక్సీ చార్జీల భారం పడనుంది. అందుకు అవసరమైన ప్రతిపాదన సిద్ధమైంది. దీంతో ముంబై మెట్రోపాలిటన్‌ రీజియన్‌ (ఎమ్మెమ్మార్‌) పరిధిలో తిరుగుతున్న ట్యాక్సీ, ఆటో చార్జీలు పెరగనున్నాయి. ట్యాక్సీలకు కనీసం రూ.రెండు లేదా మూడు, ఆటోలకు కనీసం రూపాయి చొప్పున చార్జీలు  పెరగనున్నాయి. ఆ ప్రకారం ట్యాక్సీలకు 1.5 కిలోమీటరు దూరానికి ఇదివరకు కనీస చార్జీలు రూ.31 ఉండగా ఇకనుంచి రూ.33 లేదా 34 చొప్పున, అలాగే ఆటోలకు కనీస చార్జీలు రూ.26 ఉండగా ఇక నుంచి రూ.27 చొప్పున పెరిగే అవకాశాలున్నాయి. ఆ తరువాత దూరాన్ని బట్టి అదనంగా చార్జీలు పెరుగుతాయని ఆటో, ట్యాక్సీ చాలక్, మాలక్‌ సంఘటన చీఫ్‌ థంపీ కురియన్‌ చెప్పారు.

చార్జీల పెంపు ప్రతిపాదనను ఇటీవలే  రవాణాశాఖ కార్యాలయం నుంచి ముంబై మెట్రోపాలిటన్‌ రీజియన్‌ ట్రాన్స్‌పోర్టు అథారిటీ (ఎమ్మెమ్మార్టీఏ)కు పంపించారు. ఎమ్మెమ్మార్టీఏ ఆమోదం లభించగానే కొత్తచార్జీలు అమలులోకి వస్తాయి. అయితే ట్యాక్సీ, ఆటో ఎల్రక్టానిక్‌ మీటర్లను ఆధీకృత మెకానిక్‌ల ద్వారా రీకాలిబ్రేషన్‌ చేయాల్సి ఉంటుంది. అందుకు కొంత సమయం పడుతుంది. ఇందుకోసం ప్రాంతీయ రవాణా కార్యాలయం (ఆర్టీఓ) కొన్ని రోజుల గడువు ఇస్తుంది. ఆ లోపు మీటర్లలో మార్పులు చేసుకోవల్సి ఉంటుంది. లేదంటే ట్యాక్సీ, ఆటో డ్రైవర్లపై చర్యలు తీసుకుంటారు. కొద్ది రోజుల కిందట మహారాష్ట్ర స్టేట్‌ రోడ్‌ ట్రాన్స్‌పోర్టు కార్పొరేషన్‌ (ఎమ్మెస్సార్టీసీ) 14.95 శాతం చార్జీలు పెంచిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆటో, ట్యాక్సీల చార్జీలు కూడా పెరగనున్నాయి. దీంతో ప్రయాణికులపై ఆర్థికభారం మరింత అదనం కానుంది.

ఈశాన్య దేశాలలో జరుగుతున్న యుద్దం కారణంగా భారత దేశంలో తరుచూ డీజీల్, పెట్రోల్, కంప్రెస్డ్‌ నేచురల్‌ గ్యాస్‌ (సీఎన్‌జీ) ధరలు పెరుగుతున్నాయి. గత నాలుగైదు నెలల కాలవ్యవధిలో ఏకంగా మూడు, నాలుగుసార్లు ఇంధనం చార్జీలు పెరిగాయి. తరుచూ పెరుగుతున్న సీఎన్‌జీ ధరలతో చార్జీలు పెంచకుండా నడపడం డ్రైవర్లకు, యజమానులకు గిట్టుబాటు కావడం లేదు. దీనికి తోడు రోడ్లన్నీ పాడైపోవడంవల్ల నిర్వహణ భారం కూడా పెరిగిపోయింది. దీంతో ఆటో, ట్యాక్సీల చార్జీలు పెంచుకునేందుకు అనుమతి ఇవ్వాలని యూనియన్‌ ప్రతినిధులు ఆర్టీఓకు వినతి పత్రం సమర్పించారు.

చదవండి: పెరగనున్న గణేశ్‌ విగ్రహాల ధరలు

దీనిపై  విచారించిన ఆర్టీఓ చార్జీల పెంపు ప్రతిపాదనను ఎమ్మెమ్మార్టీయే ఆమోదం కోసం పంపించింది. ఆటో, ట్యాక్సీ డ్రైవర్లకు చార్జీల పెంపునకు అనుమతి ఇవ్వడమే కాదు వారి ప్రవర్తనలో మార్పులు తీసుకురావల్సిన అవసరం ఎంతైనా ఉందని ముంబైకర్లు అంటున్నారు. సమీప కిరాయిలు నిరాకరించడం, ఎక్కువ చార్జీలు వసూలు చేయడం, ప్రయాణికులతో దురుసుగా ప్రవర్తించడం, లోకల్‌ రైల్వే, మెట్రో స్టేషన్ల బయట ఆటోలు, ట్యాక్సీలు ఇష్టమున్నట్లు పార్క్‌చేసి కృత్రిమ ట్రాఫిక్‌ జామ్‌ సృష్టిస్తున్నారు. వీటిన్నిటిని అరికట్టేవిధంగా నియమాల్లో మార్పులు చేయాలని కోరుతున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement